CM Revanth : తెలంగాణ వరదలను జాతీయ విపత్తుగా పరిగణించాలి.. కేంద్రానికి లేఖ రాస్తా : సీఎం రేవంత్
తెలంగాణలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్రమోడీకి లేఖ రాస్తానని సీఎం తెలిపారు.
- By Pasha Published Date - 12:37 PM, Mon - 2 September 24

CM Revanth : తెలంగాణలోని పలు జిల్లాలను వర్షాలు, వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఈ పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ వరదలను జాతీయ విపత్తుగా గుర్తించాలంటూ కేంద్రానికి లేఖ రాస్తానన్నారు. తెలంగాణలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్రమోడీకి లేఖ రాస్తానని సీఎం తెలిపారు. వరద నష్టంపై కేంద్రానికి సమగ్ర నివేదికను పంపుతామని, తక్షణ సాయం అందించాలని అడుగుతామన్నారు. వరద ప్రభావిత జిల్లాలు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేటలకు తక్షణ సాయం కింద రూ. 5 కోట్లు విడుదల చేస్తున్నట్లు రేవంత్ ప్రకటించారు. వరదల్లో చనిపోయిన వారి కుటుంబాలకు అందించే ఆర్థిక సాయాన్ని రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచుతున్నట్లు ఆయన వెల్లడించారు. వరదల్లో చనిపోయిన పశువులు, మేకలు,గొర్రెలకు కూడా అందించే పరిహారాన్ని పెంచాలని అధికారులకు సీఎం(CM Revanth)ఆదేశించారు.
We’re now on WhatsApp. Click to Join
ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నందున హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా కమిషనర్లు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. వర్షాల కారణంగా నగరంలో దెబ్బతిన్న రోడ్లకు తక్షణమే మరమ్మతులు చేయించాలన్నారు. విద్యుత్ సరఫరా లో తలెత్తే సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సూచించారు. వరద ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లాల్లో హెల్ప్ లైన్ నంబర్లను ప్రకటించి ప్రజలను ఆదుకోవాలని కలెక్టర్లకు రేవంత్ నిర్దేశించారు. సీఎం రివ్యూ మీటింగ్లో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబు, సీఎస్ శాంతికుమారి, డీజీపీ జితేందర్ తదితర అధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సమీక్ష సమావేశం ముగిసిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం పర్యటనకు బయలుదేరి వెళ్లారు. రోడ్డు మార్గం మీదుగా సీఎం ఖమ్మంకు వెళ్తారు. మున్నేరు వాగు బీభత్సానికి అల్లకల్లోకలం అయిన వరద ప్రభావిత ప్రాంతాలను ఆయన పరిశీలిస్తారు. ఖమ్మంలోని వరద ప్రభావిత ప్రాంతాలను ఆయన పరిశీలించనున్నారు.