Congress MP Candidates : ఇవాళే కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. మారిన లెక్కలివీ!
Congress MP Candidates : తెలంగాణలోని జహీరాబాద్, మహబూబాబాద్, నల్గొండ, మహబూబ్ నగర్ లోకసభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది.
- Author : Pasha
Date : 19-03-2024 - 9:46 IST
Published By : Hashtagu Telugu Desk
Congress MP Candidates : తెలంగాణలోని జహీరాబాద్, మహబూబాబాద్, నల్గొండ, మహబూబ్ నగర్ లోకసభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది. రాష్ట్రంలోని మిగిలిన 13 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరనేది దానిపై ఇవాళ రాత్రి కానీ.. రేపు ఉదయం కానీ క్లారిటీ రానుంది. ఢిల్లీలో ఇవాళ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా లోక్‌సభ అభ్యర్థుల రెండు జాబితాలను విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీ మూడో జాబితాను కూడా రెడీ చేసింది. ఈరోజు జరిగే ఎన్నికల కమిటీలోనే లోక్‌సభ అభ్యర్థుల మూడో జాబితాను ఖరారు చేయనుంది. ఇవాళ రాత్రి కానీ.. రేపు ఉదయం కానీ అభ్యర్థుల వివరాలను హస్తం పార్టీ అధిష్టానం విడుదల చేసే అవకాశముంది. ఇక ఎన్నికల కమిటీ మీటింగ్‌కు హాజరయ్యేందుకు ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు.
Also Read :CMs Powers : ఎన్నికల కోడ్ టైం.. సీఎంలకు ఉండే పవర్ ఎంత ?
చేవెళ్ల, సికింద్రాబాద్, మల్కాజిగిరిలో మారిన లెక్కలు..
సామాజిక సమతుల్యత పాటిస్తూనే విజయం సాధించగలిగే ప్రజాబలం కలిగిన వారికే(Congress MP Candidates) టికెట్లు ఇచ్చే దిశగా తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం ముందుకు వెళ్తోంది. చేవెళ్ల నుంచి సునీతా మహేందర్ రెడ్డి, సికింద్రాబాద్ నుంచి బొంతు రామ్మోహన్‌లను రంగంలోకి దించాలని గతంలో కాంగ్రెస్ నాయకత్వం భావించింది. కానీ ఇప్పుడు లెక్కలు మారాయి. తాజాగా బీఆర్‌ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్‌లో చేరారు. చేవెళ్ల నుంచి రంజిత్ రెడ్డిని.. సునీతా మహేందర్ రెడ్డిని మల్కాజిగిరి నుంచి బరిలోకి దింపాలని రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం యోచిస్తున్నట్లు సమాచారం. సికింద్రాబాద్ లోకసభ స్థానం నుంచి మాజీ మేయర్ బొంతు రామ్మోన్ బదులు దానం నాగేందర్‌ను బరిలోకి దించాలని రేవంత్ భావిస్తున్నారట. ఒక సిట్టింగ్ ఎంపీ, ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేను పార్టీలోకి చేర్చుకోవడం ద్వారా రెండు లోకసభ స్థానాలకు అభ్యర్ధుల సర్దుబాటు జరిగిందని పీసీసీ వర్గాలు అంటున్నాయి.
We’re now on WhatsApp. Click to Join
కాంగ్రెస్ మేనిఫెస్టోపైనా చర్చ
ఈరోజే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కూడా జరగనుంది. పార్టీ మేనిఫేస్టో పై ఈ మీటింగ్‌లో చర్చించి ఒక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా పర్యటించిన రాహుల్ గాంధీ మేనిఫెస్టోలో పెట్టాల్సిన అంశాలను కమిటీకి సూచించారు. దీనిపై తుది నిర్ణయం ఇవాళ వెలువడనుంది. పార్టీ సీనియర్ నేతల నుంచి సలహాలు తీసుకున్నాక మేనిఫేస్టోను అధికారికంగా రిలీజ్ చేయనున్నారు.