Revanth Reddy : రేవంత్ బల స్వరూపం.! డిజిటల్ లో ఢమాల్!!
ఢిల్లీ కాంగ్రెస్ విధించిన సభ్యత్వ లక్ష్యాన్ని చేరుకోవడానికి తెలంగాణ కాంగ్రెస్ అగచాట్లు పడుతోంది. గతానికి భిన్నంగా డిజిటల్ సభ్యత్వాన్ని అధిష్టానం పరిచయం చేసింది. సోనియా జన్మదినం డిసెంబర్ 9న ప్రారంభించిన సభ్యత్వ నమోదు నత్తనడకన ఉంది
- By CS Rao Published Date - 12:45 PM, Fri - 24 December 21
ఢిల్లీ కాంగ్రెస్ విధించిన సభ్యత్వ లక్ష్యాన్ని చేరుకోవడానికి తెలంగాణ కాంగ్రెస్ అగచాట్లు పడుతోంది. గతానికి భిన్నంగా డిజిటల్ సభ్యత్వాన్ని అధిష్టానం పరిచయం చేసింది. సోనియా జన్మదినం డిసెంబర్ 9న ప్రారంభించిన సభ్యత్వ నమోదు నత్తనడకన ఉంది. ఇప్పటి వరకు కేవలం 2లక్షల సభ్యత్వాలు మాత్రమే నమోదు అయ్యాయి. అధిష్టానం పెట్టిన 30లక్షల సభ్యత్వానికి చాలా దూరంగా టీ కాంగ్రెస్ ఉంది.దేశ వ్యాప్తంగా తొలిసారిగా డిజిటల్ సభ్యత్వాన్ని కాంగ్రెస్ అనుసరిస్తోంది. రాష్ట్ర నేతల నుంచి బూత్ స్థాయి సభ్యుల వరకు ఆడ్రాయిడ్ ఫోన్లో సభ్యత్వాన్ని నమోదు చేసుకోవాలి. ప్రత్యేకంగా తయారు చేసిన యాప్ ద్వారా లాగిన్ కావాలి. ఆ తరువాత ఫోన్ నెంబర్, ఓటర్ కార్డు, ఆధార్ నెంబర్లను నమోదు చేయాలి. అప్పుడు వచ్చే ఓటీపీని ఉపయోగిస్తే..సభ్యునిగా కాంగ్రెస్ పార్టీ అనుమతిస్తుంది. రెండు లక్షల రూపాయల వరకు బీమా సౌకర్యం ఉంది. నిజమైన కాంగ్రెస్ సభ్యులను యాప్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం అధిష్టానం చేస్తోంది. ఆ క్రమంలోనే యాప్ ను పక్కాగా రూపొందించింది.
గతంలో సభ్యత్వానికి పుస్తకాలను బూత్ స్ఠాయి లీడర్లకు ఇచ్చే పద్ధతి ఉండేది. కొందరు వాళ్లే డబ్బు మొత్తం చెల్లించి సభ్యత్వ పుస్తకాలను తిరిగి నియోజకవర్గ ఇంచార్జిలకు ఇచ్చే అలవాటు. ఆ తరువాత పార్లమెంట్, జిల్లా, రాష్ట్ర అధ్యక్షులకు చేరవేసే పద్ధతి ఎప్పటి నుంచో ఉండేది. సభ్యులు లేకుండాగానే ఉన్నట్టు లక్షల్లో చూపించే వాళ్లు. ఆ జాబితాను ఏఐసీసీకి పీసీసీ పంపేది. కానీ, ఇప్పుడు అలాంటి పద్ధతికి ఏఐసీపీ స్వస్తి పలికింది. ఓటీపీ ద్వారా నిజమైన సభ్యులా? కాదా? అనేది తెలుసుకుంటోంది.డిజిటల్ పద్ధతి సభ్యత్వ నమోదు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కి తలనొప్పిగా మారింది. క్షేత్ర స్థాయిలో ఊహించిన విధంగా సభ్యత్వానికి ముందుకు రావడంలేదు. గడువులోగా ఏఐసీసీ నిర్దేశించిన లక్ష్యంలో నాలుగో వంతు కూడా చేరుకునే పరిస్థితి కనిపించడంలేదు. అధికార టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణలో 80లక్షల మంది సభ్యులు ఉన్నారు. బీజేపీ కూడా పెద్ద సంఖ్యలోనే సభ్యత్వాలను నమోదు చేసింది. ఆ రెండు పార్టీలకు ధీటుగా సభ్యత్వాలను చేర్చడంలో రేవంత్ రెడ్డి బాగా వెనుక బడ్డాడు.
ఇటీవల అన్ని రకాలుగా తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దూకుడు తగ్గింది. ఏఐసీసీ విధించిన లక్ష్యాలను చేరుకోవడంలో తడబడుతున్నాడు. హుజారాబాద్ ఫలితాల తరువాత తెలంగాణ కాంగ్రెస్ క్షేత్ర స్థాయి బలం ఎంతో తేలిపోయింది. పైగా పీసీసీ పగ్గాలు రేవంత్ రెడ్డి చేపట్టిన తరువాత జరిగిన ఉప ఎన్నిక అది. వర్కింగ్ ప్రెసిడెంట్ గా నాగార్జున సాగర్, దుబ్బాక, హుజూర్ నగర్, హైదరాబాద్..రంగారెడ్డి..మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్నికల్లోనూ ఘోరంగా విఫలం అయ్యాడు.పీసీసీ చీఫ్ అయిన తరువాత ఆత్మగౌరవ సభలు పెట్టి హడావుడి చేశాడు. జంగ్ సైరన్ తో హల్ చల్ చేశాడు. సీన్ కట్ చేస్తే..క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పరిస్థితి హుజురాబాద్ ఉప ఎన్నికల్లో తేలింది. సీనియర్లు తొలి నుంచి రేవంత్ రెడ్డి వాలకాన్ని వ్యతిరేకిస్తున్నారు. వాళ్లను కాదని దూకుడుగా వెళ్లిన ఆయనకు కళ్లెం వేసేలా వంశీచందర్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లకు అధిష్టానం కీలక పదవులు ఇచ్చింది. అందుకే, ఆచితూచి అడుగు వేస్తోన్న రేవంత్ సభ్యత్వాల విషయంలో మరోసారి అధిష్టానం ఎదుట బలహీనిడిగా నిలుచుకునే పరిస్థితి కనిపిస్తోందని ఆ పార్టీలోని సీనియర్లు అంచనా వేస్తున్నారు. ఈ దెబ్బతో రేవంత్ నిజమైన బలం ఎంతో అధిష్టానంకు తేలనుందని భావిస్తున్నారట.