TRS in UP : యూపీ సైకిల్… గులాబీ బెల్
ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో గులాబీ బెల్ మోగబోతోంది. సైకిల్ కోసం ఆ బెల్ మోగించడానికి కారు వేసుకుని గులాబీబాస్ కేసీఆర్ వెళ్లబోతున్నారు. ఆయన మోగించే బెల్ యూపీ ప్రజల చెవులకు ఎక్కుతుందా?
- By Hashtag U Published Date - 08:16 PM, Sat - 15 January 22

ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో గులాబీ బెల్ మోగబోతోంది. సైకిల్ కోసం ఆ బెల్ మోగించడానికి కారు వేసుకుని గులాబీబాస్ కేసీఆర్ వెళ్లబోతున్నారు. ఆయన మోగించే బెల్ యూపీ ప్రజల చెవులకు ఎక్కుతుందా?
హుజూరాబాద్ ఎన్నికల తర్వాత వ్యూహాత్మకంగా బీజేపీని, కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ వస్తున్న సీఎం కేసీఆర్ తన పంతాన్ని నెగ్గించుకునేందుకు తొలి టార్గెట్ పెట్టుకున్నారు. అదే యూపీ ఎన్నికలు. అక్కడ సమాజ్‌వాదీ పార్టీ తరపున ప్రచారం చేసి బీజేపీని దెబ్బతీయాలన్నది టీఆర్‌ఎస్ వ్యూహం. ధాన్యం కొనుగోళ్లలో కేంద్రం వైఖరి, వ్యవసాయ చట్టాలు, కొత్త విద్యుత్ బిల్లును ప్రచార అస్త్రాలుగా మార్చుకుని ఉత్తరప్రదేశ్‌లో బీజేపీపై వ్యతిరేకతను పెంచాలన్నది గులాబీబాస్ ఎంచుకున్న మార్గం.
వారం రోజుల నుంచి యూపీలో పరిణామాలతో తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు బీజేపీపై పోరాటానికి ఊపు వస్తున్నట్లు కనిపిస్తోంది.
యూపీలో మంత్రులు, ఎమ్మెల్యేలు బీజేపీకి రాంరాం చెప్పేసి సైకిల్ (ఎస్పీ ఎన్నికల గుర్తు) ఎక్కుతున్నారు. ఒక్కసారిగా వాతావరణం అఖిలేష్‌కు అనుకూలంగా మారుతోందన్న సంకేతాలు వస్తున్నాయి. సరిగ్గా ఈ సమయంలోనే టీఆర్‌ఎస్ వైపు నుంచి అడుగులు ముందుకు పడుతున్నాయి.
బీజేపీకి వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్ వెళ్లి ప్రచారం చేయడానికి సీఎం కేసీఆర్, మరికొందరు మంత్రులు సిద్ధమయ్యారన్నది ప్రగతిభవన్ నుంచి లీక్ అయిన సమాచారం. అసలే అక్కడ బీజేపీకి వ్యతిరేకత పెరుగుతోంది కాబట్టి, దాన్ని మరింత పెంచడానికి తమ వంతు పాత్ర పోషించాలన్నది కేసీఆర్ వ్యూహంగా కనిపిస్తోంది. ఇదొక్కటే కాదు తాము బీజేపీకి బీ-టీమ్ అన్న ఆరోపణలు తప్పని చెప్పడానికి ఒక అవకాశంగా మార్చుకోవచ్చు. పైగా మూడో ఫ్రంట్ పేరుతో 2019 ఎన్నికలకు ముందు నుంచి కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలకు ఇది మరింత ప్లస్ అవుతుందనేది టీఆర్‌ఎస్ వర్గాల అంచనా.
నిజంగా కేసీఆర్ యూపీ వెళ్లి ప్రచారం చేస్తే అక్కడి ప్రజల రెస్పాన్స్ ఎలా ఉంటుందన్నది మరికొన్ని రోజుల్లోనే తేలిపోతుంది.
We will take a call soon after consultations https://t.co/UfSMjuZPuk
— KTR (@KTRBRS) January 13, 2022