CSMP : హైదరాబాద్ సీఎస్ఎంపీని అమృత్ 2.0లో చేర్చండి – సీఎం రేవంత్ రిక్వెస్ట్
CM Revanth Reddy : హైదరాబాద్ సమగ్ర సీవరేజీ మాస్టర్ ప్లాన్ ను(Hyderabad CSMP) అమృత్ 2.0లో చేర్చాలని కేంద్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి కోరారు
- By Sudheer Published Date - 12:49 PM, Tue - 8 October 24

ఢిల్లీ లో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) బిజీ బిజీ గా గడుపుతున్నారు. రాష్ట్రానికి చెందిన కీలకమైన ప్రాజెక్టులపై కేంద్ర మంత్రులతో చర్చిస్తూ వస్తున్నారు. హైదరాబాద్ సమగ్ర సీవరేజీ మాస్టర్ ప్లాన్ (CSMP), మూసీ సహా సివరేజీ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల నిర్మాణం, మెట్రో రైలు విస్తరణకు సంబంధించి ప్రాజెక్టులపై రాష్ట్రానికి సహకరించాలని కోరారు.
హైదరాబాద్ సమగ్ర సీవరేజీ మాస్టర్ ప్లాన్ ను(Hyderabad CSMP) అమృత్ 2.0లో చేర్చాలని కేంద్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. అలా చేర్చడానికి కుదరని పక్షంలో ప్రత్యేక ప్రాజెక్టుగా చేపట్టాలని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. చారిత్రక హైదరాబాద్ నగరంలో ఏళ్లనాటి మురుగు శుద్ధి వ్యవస్థే ఉందని, ప్రస్తుత అవసరాలకు ఆ వ్యవస్థ ఏమాత్రం తగినట్లుగా లేదని వివరించారు. శివారు పురపాలక సంఘాల్లోనూ సరైన మురుగు నీటి పారుదల వ్యవస్థ లేదని తెలిపారు.
సివరేజీ మాస్టర్ ప్లాన్‌లో భాగంగా హైదరాబాద్‌తో పాటు శివారు 27 పురపాలక సంఘాలను కలుపుకొని 7,444 కి.మీ. మేర రూ.17,212.69 కోట్లతో రూపొందించిన డీపీఆర్‌ను కేంద్ర మంత్రికి అందజేశారు. మూసీలో మురుగునీరు చేరకుండా ఉండేందుకు ట్రంక్ సీవర్స్ మెయిన్స్, లార్జ్ సైజ్ బాక్స్ డ్రెయిన్స్, కొత్త సీవరేజీ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల నిర్మాణానికి రూ. 4 వేల కోట్లతో రూపొందించిన మరో డీపీఆర్‌ను సైతం కేంద్ర మంత్రికి సమర్పించారు.
హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro) రెండో దశ విస్తరణలో భాగంగా నాగోల్- శంషాబాద్ రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్ట్ (36.8 కి.మీ.), రాయదుర్గం- కోకాపేట నియోపొలిస్ (11.6 కి.మీ.), ఎల్‌బీ నగర్-హయత్ నగర్ (7.1 కి.మీ.), ఎంజీబీఎస్ (MGBS)- చాంద్రాయణగుట్ట (7.5 కి.మీ.), మియాపూర్- పటాన్‌చెరు (13.4 కి.మీ.) మొత్తం 76.4 కి.మీ. మేర డీపీఆర్‌లు పూర్తయినట్లు మనోహర్‌లాల్ ఖట్టర్‌కు తెలియజేశారు. ఈ కారిడార్ల నిర్మాణానికి ఖర్చు రూ.24,269 కోట్లుగా అంచనా వేశామన్నారు. ఈ మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50:50 నిష్పత్తిలో సంయుక్త ప్రాజెక్టుగా చేపట్టాలని భావిస్తున్నట్లు సీఎం తెలిపారు.
ఇక సీఎం రేవంత్ రెడ్డి వెంట ఎంపీలు రఘువీర్ రెడ్డి, గడ్డం వంశీకృష్ణ, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు శ్రీనివాసరాజు, ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు.
Read Also : CBN Delhi Tour: ఏపీ ప్రజలకు శుభవార్త.. విశాఖ రైల్వే జోన్ కు ముహూర్తం ఫిక్స్..