Maheshwar Reddy : బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అలక.. కారణం అదే ?
బీజేపీ ఎమ్మెల్యేలు అందరినీ ఒక టీమ్‌గా ఏర్పాటు చేసి ఏదైనా ఒక రూట్‌లో ఫీల్డ్ విజిట్‌కు పంపితే బాగుండేదని ఏలేటి మహేశ్వర్‌రెడ్డి(Maheshwar Reddy) అనుచరులు అంటున్నారు.
- By Pasha Published Date - 02:00 PM, Sat - 7 September 24

Maheshwar Reddy : తెలంగాణ బీజేపీలో కీలక నేతల మధ్య గ్యాప్ ఏర్పడిందా ? కొత్తగా వచ్చిన నేతలు, చాలా ఏళ్లుగా పార్టీలో ఉన్న సీనియర్ నేతల మధ్య సయోధ్య సాధ్యం కావడం లేదా ? అనే అంశాలపై ఇప్పుడు అంతటా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం బీజేఎల్పీ నేతగా ఉన్న ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సైలెంట్ మోడ్‌లోకి వెళ్లారనే ప్రచారం జరుగుతోంది. బీజేఎల్పీ నేతగా కీలక హోదాలో ఉన్నప్పటికీ తనకు పార్టీలో తగిన ప్రాధాన్యత దక్కడం లేదనే అభిప్రాయంలో ఏలేటి ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలే బీజేపీ హైకమాండ్ జారీ ఒక ఆదేశం వల్లే ఆయన నిరాశకు లోనయ్యారని సమాచారం.
Also Read :Electricity Saving Tips : మీ కరెంటు బిల్లు తగ్గాలా ? ఈ టిప్స్ ఫాలో కండి
తెలంగాణలో వరదలు సంభవించిన ప్రాంతాల్లో బాధితులను పరామర్శించేందుకు బీజేపీ రెండు టీమ్‌లను ఏర్పాటు చేసింది. ఒక టీమ్‌కు బండి సంజయ్, మరో టీమ్‌కు ఈటల రాజేందర్ సారథ్యం వహిస్తారని పార్టీ హైకమాండ్ ప్రకటించింది. దీన్ని విన్నప్పటి నుంచి ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సైలెంట్ మోడ్‌లోకి వెళ్లారని అంటున్నారు. బీజేఎల్పీ నేతగా ఉన్నా.. తనకు ఈ కార్యక్రమంలో తగిన ప్రయారిటీ ఇవ్వకపోవడంపై ఆయన పెదవి విరిచినట్లు సమాచారం. అందుకే ఇటీవలే పలు వరద ప్రభావిత ప్రాంతాల్లో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాలకు ఏలేటి గైర్హాజరయ్యారని సంబంధిత వర్గాలు తెలిపాయి.
Also Read :China Halts Foreign Adoptions : విదేశీయులకు పిల్లల దత్తతపై చైనా సంచలన నిర్ణయం
బీజేఎల్పీ నేతగా ఉన్న తాను ఈటల రాజేందర్ టీమ్‌లో సభ్యుడిగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించలేననే అభిప్రాయంలో ఏలేటి ఉన్నారని అంటున్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు అందరినీ ఒక టీమ్‌గా ఏర్పాటు చేసి ఏదైనా ఒక రూట్‌లో ఫీల్డ్ విజిట్‌కు పంపితే బాగుండేదని ఏలేటి మహేశ్వర్‌రెడ్డి(Maheshwar Reddy) అనుచరులు అంటున్నారు. కనీసం తమ నాయకుడికి ప్రొటోకాల్ ప్రకారం ప్రయారిటీ ఇవ్వకపోవడాన్ని తప్పుపడుతున్నారు. వరద ముంపు ప్రాంతాల పరిశీలనకు మరో బీజేపీ ఎమ్మెల్యే రామారావు పాటిల్ కూడా దూరంగా ఉండిపోయారు. ఈ వ్యవహారాన్ని బీజేపీ అధినాయకత్వం ఎలా సరిదిద్దుతుందో వేచిచూడాలి.