Telangana : ఈ నెల 30 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు!
ఈ సమావేశాల్లో ముఖ్యంగా కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై జస్టిస్ చంద్రఘోష్ ఆధ్వర్యంలో రూపొందించిన కమిషన్ నివేదికను అధికార కాంగ్రెస్ ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. ఈ నివేదికపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తుదితీర్మానం తీసుకుంది.
- By Latha Suma Published Date - 12:09 PM, Tue - 26 August 25

Telangana : తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక మలుపు తిరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటూ ఈనెల 30వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలను ప్రారంభించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ సమావేశాలు మొత్తం ఐదు రోజులపాటు జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశాల్లో ముఖ్యంగా కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై జస్టిస్ చంద్రఘోష్ ఆధ్వర్యంలో రూపొందించిన కమిషన్ నివేదికను అధికార కాంగ్రెస్ ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. ఈ నివేదికపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తుదితీర్మానం తీసుకుంది. ఆ మేరకు రాష్ట్ర అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి హైకోర్టులో వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి వచ్చిన ఆరోపణలపై విచారణ చేయడానికి ప్రభుత్వం జస్టిస్ చంద్రఘోష్ నేతృత్వంలో కమిషన్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కమిషన్ తన నివేదికను సమర్పించగా, దానిపై ప్రభుత్వం స్పందిస్తూ అసెంబ్లీలో చర్చకు తీసుకురానున్నట్లు ప్రకటించింది. బాధ్యులపై తగిన చర్యలు కూడా తీసుకుంటామని హైకోర్టు ధర్మాసనానికి తెలియజేసింది.
కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం?
ఈ పరిణామాల నేపథ్యంలో అసెంబ్లీలో కాళేశ్వరం నివేదిక చర్చ సందర్భంగా అధికార కాంగ్రెస్ పార్టీకి, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి మధ్య తీవ్ర మాటల యుద్ధం చోటుచేసుకునే అవకాశాలున్నాయి. ఈ చర్చలో ఎవరు ఏ విధంగా స్పందిస్తారోనన్న ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది. అధికార పక్షం తాము చేపట్టిన కమిషన్ నివేదిక ఆధారంగా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించే అవకాశముండగా, బీఆర్ఎస్ మాత్రం నివేదికను వ్యతిరేకిస్తూ కౌంటర్ దాడికి సిద్ధమవుతోంది.
హైకోర్టులో కేసీఆర్, హరీష్ రావు పిటిషన్
కాళేశ్వరం కమిషన్ నివేదికపై మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ నివేదికను పబ్లిక్ డొమైన్‌లో పెట్టడాన్ని వారు తప్పుబడుతూ, దాన్ని కొట్టివేయాలంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం హైకోర్టు ధర్మాసనం పిటిషన్‌లపై విచారణ చేపట్టింది. ఇరు పక్షాల వాదనలు ముగిసిన అనంతరం, నివేదికను అసెంబ్లీలో చర్చించాకే తుది నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు వివరించింది.
హైకోర్టు కీలక వ్యాఖ్యలు
విచారణ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. జస్టిస్ చంద్రఘోష్ నివేదికను పబ్లిక్ డొమైన్‌లో పెట్టినట్లయితే వెంటనే తొలగించాలని ఆదేశించింది. ఈ నివేదికకు సంబంధించి ప్రభుత్వం మూడు వారాల్లోగా కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలంటూ స్పష్టమైన సూచనలు చేసింది. కేసులో మధ్యంతర ఉత్తర్వులు అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది. పిటిషనర్లు కోరిన విధంగా స్టే ఇవ్వలేమని తేల్చిచెప్పింది. తదుపరి విచారణను ఐదు వారాలకు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో రాజకీయ వేడి మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కాళేశ్వరం వివాదం తెలంగాణలో గత పది ఏళ్ల పాలనపై ప్రశ్నలు వేస్తున్న సందర్భంలో, అసెంబ్లీ చర్చ కీలకంగా మారనుంది. కక్ష్యాదారుల వాదనలు, ప్రభుత్వ చర్యలు, మరియు అసెంబ్లీలో జరిగే చర్చ రాష్ట్ర రాజకీయ దిశను ప్రభావితం చేసే అవకాశం ఉన్నది.
Read Also: Anil Chauhan : ‘సుదర్శన చక్రం’..భారత రక్షణ వ్యవస్థలో మరో విప్లవాత్మక అడుగు