Telangana Election : తెలంగాణ అసెంబ్లీ పోల్స్ నోటిఫికేషన్ విడుదల
Telangana Election : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌ను ఎన్నికల సంఘం విడుదల చేసింది.
- By Pasha Published Date - 10:26 AM, Fri - 3 November 23

Telangana Election : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. నామినేషన్ ప్రక్రియతో ముడిపడిన వివరాలతో గెజిట్ నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది. ఇక ఈరోజు నుంచే నామినేషన్లను స్వీకరించనున్నారు. ఇవాళ్టి నుంచి ఈనెల 10 వరకు రోజూ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థులు తమ నామినేషన్లను సమర్పించాల్సి ఉంటుంది. నామినేషన్ కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ అమలులో ఉంటుందని పోలీసులు, ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. సీసీ కెమెరాల నిఘాలో రిటర్నింగ్ ఆఫీసులు ఉండనున్నాయి. ఇప్పటికే పార్టీల నుంచి బీ ఫారాలు పొందిన అభ్యర్థులు ఈరోజు నుంచే నామినేషన్స్ వేయొచ్చు. ఒక్కో అభ్యర్థి ఒక్కో నియోజకవర్గం నుంచి గరిష్ఠంగా నాలుగుసెట్ల నామినేషన్లు వేయొచ్చు. ఒక అభ్యర్థి రెండుకు మించి నియోజకవర్గాల్లో పోటీ చేయరాదు. నామినేషన్ ప్రక్రియ, కార్యాలయం వెలుపల వీడియో, సీసీటీవీ ద్వారా రికార్డు చేస్తారు.
We’re now on WhatsApp. Click to Join.
- అభ్యర్థులు ఎన్నికల కమిషన్‌కు చెందిన సువిధ పోర్టల్ ద్వారానూ నామినేషన్లను ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చు. ఆన్‌లైన్‌లో నామినేషన్ సమర్పించినా అభ్యర్థి ఆ ప్రతిపై సంతకంచేసి నిర్దిష్ట గడువులోగా రిటర్నింగ్ అధికారికి అందించాల్సి ఉంటుంది.
- విదేశాల్లో ఉండే భారతీయులు అక్కడి నుంచే నామినేషన్ దాఖలు చేస్తే అక్కడి భారత రాయబార కార్యాలయాలు, కాన్సుల్ కార్యాలయాల్లో ప్రమాణం చేయాల్సి ఉంటుంది.
- ఈరోజు నుంచే 119 నియోజకవర్గాలకు 60 మంది ఎన్నికల వ్యయ పరిశీలకులు రంగంలోకి దిగనున్నారు. 39 మంది ఐపీఎస్ అధికారులను పోలీసు పరిశీలకులుగా నియమించారు.
- నవంబర్ 13న నామినేషన్ల పరిశీలన ఉంది. ఎవరైనా నామినేషన్ పత్రాన్ని సరిగ్గా ఫిలప్ చెయ్యకపోతే, అధికారులు తిరస్కరిస్తారు.
- నామినేషన్ వేసి, వేరే కారణాలతో దాన్ని వెనక్కి తీసుకోవాలి అనుకునేవారు నవంబర్ 15లోగా ఆ పని చేయొచ్చు.
- నవంబర్ 30న పోలింగ్ జరగనుంది.
- డిసెంబర్ 3న ఓట్లను లెక్కిస్తారు. ఆ రోజున ప్రజా తీర్పు(Telangana Election) తెలిసిపోతుంది.