ఆటోల్లోనూ ఫ్రీ జర్నీ పెట్టాలంటూ తీన్మార్ మల్లన్న డిమాండ్
శాసనమండలిలో చర్చ సందర్భంగా MLC తీన్మార్ మల్లన్న కొత్త డిమాండ్ను తెరపైకి తెచ్చారు. మహిళలకు ఫ్రీ బస్సు పథకం అమలుతో ఆటో డ్రైవర్ల ఉపాధి దెబ్బతింటోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు
- Author : Sudheer
Date : 03-01-2026 - 10:56 IST
Published By : Hashtagu Telugu Desk
- తెరపైకి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కొత్త డిమాండ్
- ఆటోల్లోనూ ఉచిత ప్రయాణం విధానం అమలు చేయాలి
- ప్రైవేటు యాప్ లో అధిక కమీషన్లు వసూలు
తెలంగాణ శాసనమండలి వేదికగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆటో డ్రైవర్ల సమస్యలపై గళం విప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘మహాలక్ష్మి’ ఉచిత బస్సు ప్రయాణ పథకం మహిళలకు ఎంతో ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ, అది ఆటో రంగంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఆటోలపై ఆధారపడి ప్రయాణించే మహిళలు ఇప్పుడు ఉచిత బస్సుల వైపు మళ్లడంతో, ఆటో డ్రైవర్ల రోజువారీ ఆదాయం పడిపోయి వారి కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నాయని మల్లన్న సభ దృష్టికి తీసుకెళ్లారు. ప్రజా రవాణాలో కీలక పాత్ర పోషిస్తున్న ఈ అసంఘటిత రంగ కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన స్పష్టం చేశారు.

Telangana auto drivers
ఈ సమస్యకు పరిష్కారంగా తీన్మార్ మల్లన్న ఒక వినూత్న డిమాండ్‌ను ప్రభుత్వం ముందు ఉంచారు. ఆర్టీసీ బస్సుల్లో కల్పిస్తున్నట్లుగానే, ఎంపిక చేసిన పరిమితుల మేరకు ఆటోల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని, ఆ మేరకు డ్రైవర్లకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరించాలని ఆయన సూచించారు. దీనివల్ల మహిళలకు ప్రయాణ సౌలభ్యం పెరగడమే కాకుండా, ఆటో డ్రైవర్ల ఉపాధికి భరోసా లభిస్తుందని విశ్లేషించారు. ఒకవేళ ఇది సాధ్యం కాకపోతే, ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని, ముఖ్యంగా ప్రైవేట్ యాప్‌ల దోపిడీ నుంచి డ్రైవర్లను రక్షించాలని కోరారు.
ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి ప్రైవేట్ సంస్థలు డ్రైవర్ల నుంచి భారీగా కమీషన్లు వసూలు చేస్తున్నాయని, దీనివల్ల కష్టపడే డ్రైవర్‌కు మిగిలేది తక్కువేనని మల్లన్న పేర్కొన్నారు. వీటికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వమే స్వయంగా ఒక మొబైల్ యాప్‌ను రూపొందించాలని ఆయన డిమాండ్ చేశారు. కేరళ వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే అమలవుతున్న ప్రభుత్వ యాప్ నమూనాలను పరిశీలించి, తక్కువ కమీషన్‌తో డ్రైవర్లకు ఎక్కువ లాభం చేకూరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తద్వారా అటు ప్రయాణికులకు సురక్షితమైన సేవలు, ఇటు డ్రైవర్లకు మెరుగైన ఉపాధి లభిస్తాయని ఆయన తన ప్రసంగంలో వివరించారు.