Pranay Murder Case : తెలుగు రాష్ట్రాల్లో చివరిసారిగా ఖైదీని ఎప్పుడు ఉరితీశారో తెలుసా ?
అసలు విషయం ఏమిటంటే.. ప్రస్తుతం తెలంగాణలోని ఏ జైలులోనూ ఉరికంబం(Pranay Murder Case) లేదు.
- By Pasha Published Date - 08:06 AM, Tue - 11 March 25

Pranay Murder Case : ప్రణయ్ హత్య కేసులో ఏ2గా సుభాష్ శర్మను కోర్టు దోషిగా నిర్ధారించి, మరణశిక్ష విధించింది. ఈ తీర్పును హైకోర్టులో అతడు సవాల్ చేసే అవకాశం ఉంది. ట్రయల్ కోర్టు కూడా ఈ శిక్ష విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్తుంది. ఈ క్రమంలో ‘రిఫర్డ్ ట్రయల్’గా పిలిచే విధానంలో దీనిపై హైకోర్టు విచారణ చేయనుంది. ఒకవేళ మరణశిక్షను హైకోర్టు సమర్థిస్తే, సుప్రీంకోర్టులో సుభాష్ శర్మ అప్పీల్ చేసే ఛాన్స్ ఉంది. అక్కడ కూడా చుక్కెదురైతే క్షమాభిక్ష కోసం అతడు రాష్ట్రపతికి విజ్ఞప్తి చేయొచ్చు. రాష్ట్రపతి సైతం తిరస్కరిస్తే, మరణశిక్ష ఖరారైనట్టే. దీంతో తెలంగాణలో సుభాష్ శర్మకు మరణశిక్షను అమలు చేస్తారు.
Also Read :Pregnancy : గర్భధారణ సమయంలో వాంతులు అవ్వడానికి కారణం ఏంటి..?
తెలంగాణలోని ఏ జైలులోనూ ఉరికంబం లేదు
- అసలు విషయం ఏమిటంటే.. ప్రస్తుతం తెలంగాణలోని ఏ జైలులోనూ ఉరికంబం(Pranay Murder Case) లేదు. తలారులుగా పిలిచే హ్యాంగ్ మన్ పోస్టులు కూడా లేవు.
- చాలా ఏళ్లుగా ఉరిశిక్షను అమలు చేయకపోవడంతో కొందరు హెడ్–వార్డర్లకే ఈ అంశంలో ప్రాథమిక శిక్షణ ఇస్తున్నారు.
- ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఆఖరి ఉరిశిక్షను 47 ఏళ్ల క్రితం ముషీరాబాద్ సెంట్రల్ జైలులో అమలు చేశారు.
- 1978లో భారత వైమానిక దళంలో పనిచేసిన ఎయిర్‌మన్ రామవతార్ యాదవ్‌పై హత్య కేసు నిరూపితమైంది. దీంతో అతడికి మరణశిక్ష ఖరారైంది. ఉరి తీశారు. అప్పట్లో ముషీరాబాద్ సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్‌గా ఉన్న సుబ్బారెడ్డి పర్యవేక్షణలో ఈ శిక్ష అమలైంది.
- తదుపరి కాలంలో ముషీరాబాద్ సెంట్రల్ జైలును తెలంగాణలోని చర్లపల్లి ప్రాంతానికి మార్చారు.
- చర్లపల్లి జైలును నిర్మిస్తున్నప్పుడు ఉరికంబం కోసం ఓ ప్రాంతాన్ని ఎంపిక చేసినా, దాన్ని ఏర్పాటు చేయలేదు.
- ప్రస్తుతం తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో ఉరికంబం ఉన్న జైలు రాజమండ్రి సెంట్రల్ జైలు మాత్రమే. 1875 నుంచే ఈ జైలులో ఉరికంబం ఉంది.
- రాజమండ్రి సెంట్రల్ జైలులో చివరిసారిగా 1976 ఫిబ్రవరిలో ఉరిశిక్షను అమలు చేశారు. ఓ హత్య కేసులో దోషిగా తేలిన అనంతపురం జిల్లాకు చెందిన నంబి కిష్టప్పను ఉరి తీశారు.
- స్వాతంత్య్రం వచ్చిన తర్వాతి నుంచి మన దేశంలోని వివిధ జైళ్లలో దాదాపు 100 మందిని ఉరితీశారు. వారిలో 42 మందికి రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే శిక్షణ అమలు చేశారు.
- ఉరి తీయడానికి ముందు ఖైదీని ఆఖరి కోరిక ఏమిటని అడుగుతారు. కిష్టప్ప తన ఆఖరి కోరికగా లడ్డూ తింటానని చెప్పాడట. దీంతో జైలు అధికారులు అతడికి లడ్డూలు ఇచ్చారు. అతడిని రాజమండ్రి జైలు తలారీ ధర్మరాజు ఉరి తీశారు.
Also Read :Skin Beauty Tips : చర్మం ఆరోగ్యంగా మెరిసిపోవాలంటే కొల్లాజెన్ తీసుకోవాల్సిందే
రాజమండ్రి సెంట్రల్ జైలు ఉరికంబం ప్రత్యేకతలు
- రాజమండ్రి సెంట్రల్ జైలులోని ఉరికంబం 1980 వరకు ప్రధాన ద్వారం పక్కనే బహిరంగంగా ఉండేది. ఖైదీని ఉరి తీసిన తర్వాత మృతదేహాన్ని ఉరికంబం కింద ఉండే ప్రత్యేక ఛాంబర్‌లోకి దింపుతారు. అక్కడి నుంచి నేరుగా ట్రే ద్వారా సంబంధీకులకు అప్పగిస్తారు.
- 1980వ దశకం తర్వాత ఈ జైలులోని ఉరికంబాన్ని అడ్మినిస్ట్రేటివ్ భవనం పరిసరాల్లోకి మార్చారు.
- ఉరికంబం ఉన్న ప్రాంతంలో 2013లో రూ.7.5 కోట్లతో కొత్తగా పరిపాలనా భవనాన్ని నిర్మించారు. అయితే ఉరికంబాన్ని అక్కడి నుంచి మార్చడం ఇష్టం లేక భవనం కింద భూగర్భంలో ఏర్పాటు చేశారు.
- రాజమండ్రి సెంట్రల్ జైలులో నిర్మాణాలు ఎన్ని మారినా, నేటికీ బ్రిటీష్ కాలం నాటి ఇనుప ఉరికంబాన్నే వాడుతున్నారు. తరచూ దీనికి నూనె రాస్తూ, దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.