BC Reservation : హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు రాష్ట్ర సర్కార్!
BC Reservation : స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో నంబర్ 9 పై హైకోర్టు తాత్కాలికంగా స్టే విధించిన సంగతి తెలిసిందే
- By Sudheer Published Date - 05:30 PM, Sat - 11 October 25

తెలంగాణలో బీసీల రిజర్వేషన్ల (BC Reservation) అంశం మరోసారి రాజకీయ, న్యాయ వాదనలకు కేంద్రబిందువుగా మారింది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో నంబర్ 9 పై హైకోర్టు తాత్కాలికంగా స్టే విధించిన సంగతి తెలిసిందే. కోర్టు ఆ ఉత్తర్వుల్లో రిజర్వేషన్ పరిమితి 50% మించకూడదనే సుప్రీంకోర్టు మార్గదర్శకాలను గుర్తుచేసింది. దీంతో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తాత్కాలికంగా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వాయిదా పడగా, ప్రభుత్వ వర్గాల్లో ఆందోళన నెలకొంది.
Congress: ఢిల్లీకి చేరిన వరంగల్ జిల్లా కాంగ్రెస్ పంచాయితీ!?
తాజాగా ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. హైకోర్టు స్టేను ఎత్తివేయించుకునేందుకు స్పెషల్ లీవ్ పిటిషన్ (SLP) దాఖలు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ మేరకు అగ్రశ్రేణి న్యాయవాదులను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. సీనియర్ కౌన్సిల్స్ ద్వారా వాదనలు వినిపించి, బీసీలకు అధిక రిజర్వేషన్లు ఇవ్వడం వెనుక ఉన్న సామాజిక సమతుల్యత, జనాభా శాతం, ఆర్థిక స్థితి వంటి అంశాలను వివరించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
ప్రభుత్వ వర్గాల ప్రకారం, బీసీలు సమాజంలో అత్యధిక శాతం కలిగిన వర్గం కాబట్టి వారికి తగిన ప్రాతినిధ్యం ఇవ్వడం అవసరమని వాదన. “బీసీలకు సరైన రాజకీయ హక్కులు, సమాన అవకాశాలు అందించడమే మా లక్ష్యం” అని అధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రతిపక్షాలు మాత్రం ఇది రాజకీయ ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయమని ఆరోపిస్తున్నాయి. ఇక సుప్రీంకోర్టులో ప్రభుత్వం దాఖలు చేయబోయే పిటిషన్‌పై ఏ విధమైన తీర్పు వస్తుందో, అది తెలంగాణలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌పై ఎంత ప్రభావం చూపుతుందో అన్నది రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చగా మారింది.