Social Justice : భిన్నస్వరాల్లో ఏకత్వం
రెండు వారాల క్రితం జరిగిన రిపబ్లిక్ డే రోజున తమిళనాడు సీఎం స్టాలిన్ కోఆపరేటివ్ ఫెడరలిజం, సామాజిక న్యాయం అనే అంశాలను తెర మీదకు తీసుకొచ్చాడు.
- By CS Rao Published Date - 03:16 PM, Thu - 3 February 22

రెండు వారాల క్రితం జరిగిన రిపబ్లిక్ డే రోజున తమిళనాడు సీఎం స్టాలిన్ కోఆపరేటివ్ ఫెడరలిజం, సామాజిక న్యాయం అనే అంశాలను తెర మీదకు తీసుకొచ్చాడు. ఆ రోజు నుంచి ఆయన భావజాలానికి దగ్గరగా ఉన్న వాళ్లు ఏదో ఒక రూపంలో స్పందిస్తున్నారు. భిన్నత్వంలో ఏకత్వం భారతదేశం అనే నినాదాన్ని బలంగా వినిపించాడు. సామాజిక న్యాయం కోసం వివిధ రాష్ట్రాల్లోని అణగారిన వర్గాల నాయకులతో భేటీ ఉంటుందని స్టాలిన్ ప్రకటించాడు. అంతేకాదు, కో ఆపరేటివ్ ఫెడరలిజం దేశంలో లేకుండా పోతుందని ఆందోళన చెందాడు. అందుకే, ఈ రెండు అంశాలపై భావసారూప్యత ఉన్న వాళ్లను ఒకచోటికి చేర్చాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఇంచుమించు స్టాలిన్ భావజాలం తరహాలోనే రాహుల్ పార్లమెంట్ వేదికగా ప్రసంగించాడు. అందుకే, రాహుల్ కు స్టాలిన్ అభినందనలు తెలిపాడు.కాంగ్రెస్, బీజేయేతర ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడాలని టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ భావిస్తున్నాడు. అందుకే 2018 నాడు ఫెడరల్ ఫ్రంట్ ను ముందుకు కదిలించాడు. కానీ, అది ఆదిలోనే ముగిసిపోయింది. ఇప్పుడు మళ్లీ కొత్త రాజ్యాంగం కావాలని స్లోగన్ అందుకున్నాడు. కోఆపరేటివ్ ఫెడరలిజం లేకుండా బీజేపీ ప్రభుత్వం పాలిస్తోందని మండిపడుతున్నాడు. మత పిచ్చి లేపుతూ దేశాన్ని విభజించేలా పాలిస్తున్నాడని మోడీపై ఫైర్ అయ్యాడు. మీడియా ముఖంగా కేసీఆర్ రెండున్నర గంటల ప్రసంగం ఇంచుమించు స్టాలిన్ భావజాలానికి దగ్గరగా ఉంది. సామాజిక న్యాయం మినహా కోఆపరేటివ్ ఫెడరలిజం గురించి కేసీఆర్ చెప్పాడు. ఆ దిశగా అడుగులు వేయాలని భావిస్తున్నాడు. అందుకోసం రాబోయే రోజుల్లో దీర్ఘకాలిక పోరాటం చేయాలని వ్యూహం రచన చేస్తున్నాడు. అందుకోసం పదవీ విరమణ చేసిన సివిల్ సర్వెంట్లతో కీలక సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించాడు.
బెంగాల సీఎం మమతా బెనర్జీ కూడా కాంగ్రెస్, బీజేపీయేతర ప్రభుత్వాన్ని కేంద్రంలో ఏర్పాటు చేయాలని దూకుడుగా వెళుతున్నారు. దీర్ఘకాలం దేశాన్ని పరిపాలించిన యూపీఏ ఉనికిలో లేదని ఆమె అభిప్రాయం. అందుకే ఆ స్థానంలో కాంగ్రెస్‌లేని ప్రాంతీయ పార్టీలతో కూటమిని ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తోంది. అందుకే, ఎన్సీపీ నేత శరద్ పవార్ ను కలిసింది. యూపీఏ కూటమిలోని పార్టీలను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల ఎన్నికల తరుణంలో టీఎంసీను ఇతర రాష్ట్రాలకు విస్తరింప చేసే పనిలో ఆమె ఉంది. కో ఆపరేటివ్ ఫెడరలిజం కావాలంటూ దీదీ కోరుతోంది. రాష్ట్రాలపై మోడీ సర్కార్ పెత్తనం పెరిగిందని మండిపడుతోంది. పలుమార్లు మోడీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లకు ఆమె డుమ్మా కొట్టింది. ఇటీవల జరిగిన బెంగాల్ ఎన్నికల్లో మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడి విజయం సాధించిన విషయం విదితమే. అదే ధైర్యంతో రాబోవు రోజుల్లో మోడీ సర్కార్ ను టార్గెట్ చేస్తూ ఒక ప్రత్యామ్నాయ కూటమిని ఏర్పాటు చేయాలని మమత ఆలోచన.సామాజిక న్యాయం డిమాండ్ ను ప్రధానంగా స్టాలిన్ వినిపిస్తున్నాడు. కేంద్రంలో 1990 ప్రాంతంలో ఉండే సామాజిక న్యాయం కూడా ఇప్పుడు లేదని ఆయన గుర్తు చేస్తున్నాడు. ఆనాడు వీపీ సీంగ్, చంద్రశేఖర్, దేవెగౌడ, ములాయంసింగ్, లలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్, మాయావతి తదితరులు కేంద్రం ప్రభుత్వంలో కీలకంగా ఉండే వాళ్లు. క్రమంగా ఆ సామాజిక ఈక్వేషన్ కేంద్ర ప్రభుత్వంలో కనిపించడంలేదని స్టాలిన్ భావన. అందుకే, సామాజిక న్యాయం గొడుగు కొందకు వచ్చే పార్టీల జాబితాను తయారు చేసుకుంటున్నాడు. కో ఆపరేటివ్ ఫెడరలిజాన్ని కోరుకుంటూనే సామాజిక న్యాయం కోణాన్ని స్టాలిన్ ఆవిష్కరిస్తున్నాడు. అదే భావజాలాన్ని రాష్ట్రపతి బడ్జెట్ ప్రసంగంపై మాడ్లాడుతూ రాహుల్ వినిపించాడు. పార్లమెంట్ వేదికగా తమిళలకు చిరకాలంగా జరుగుతోన్న అన్యాయంతో పాటు దేశాన్ని ముక్కలు చేసేలా మోడీ రాజరిక పాలన ఉందని దుమ్మెత్తి పోశాడు. ఆయన ప్రసంగం స్టాలిన్ కి నచ్చడంతో అభినందన తెలిపాడు.
ఈ పరిణామాలను గమనిస్తే, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ గూటికి సామాజిక న్యాయం, కో ఆపరేటివ్ ఫెడరలిజం వెళ్లేలా కనిపిస్తోంది. యూపీఏ భాగస్వామిగా చాలా కాలంగా డీఎంకే ఉంది. ఇప్పుడూ అదే పంథాను స్టాలిన్ కొనసాగిస్తున్నాడు. పైగా గాంధీ కుటుంబంతో సుదీర్ఘ ప్రయాణం చేసిన అనుభవం ఉంది. ఇక కేసీఆర్ వాయిస్ కూడా బీజేపీకి వ్యతిరేకంగా మాత్రమే ఉంది. తాజాగా ఆయన మీడియా సమావేశంలోని వాయిస్ ని గమనిస్తే, బీజేపీని బాగా టార్గెట్ చేశాడు. ఫెడరల్ ఫ్రంట్ అనేది లేదని తేల్చేశాడు. ఫ్రంట్ గురించి తానెప్పుడు చెప్పానంటూ విలేకరులను నిలదీశాడు. కో ఆపరేటివ్ ఫెడరలిజం కావాలని తాజాగా చెబుతున్నాడు. కాంగ్రెస్ గురించి వ్యతిరేకంగా ఈసారి మాట్లాడలేదు. బెంగాల్ లేడీ టైగర్ దీదీ కూడా ఇటీవల కాంగ్రెస్, బీజేపీయేతర కూటమి దిశగా అడుగులు వేయడంలేదు. కో ఆపరేటివ్ ఫెడరలిజం అంటోంది. అంటే, కాంగ్రెస్ తో కూడిన కూటమి దిశగా బలమైన ప్రాంతీయ పార్టీల అధిపతుల అడుగులు పడుతున్నాయని స్పష్టం అవుతోంది. ప్రస్తుతం రాజరిక పాలన కొనసాగుతోందని వాళ్లు భావిస్తున్నారు. యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనే భావాన్ని మోడీ సర్కార్ తుడిచిపెట్టిందని అనుకుంటున్నారు. మత పిచ్చిని ఎక్కించడం ద్వారా విభజించి పాలించే తరహా పాలిటిక్స్ బీజేపీ నడుపుతోందని గ్రహించారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని తీసుకురావాలని వేర్వేరు వేదికలపై ఓకే భావంతో ఆ ముగ్గురు లీడర్లు మాట్లాడడం రాబోయే కూటమికి సంకేతంగా భావించాలి. కాంగ్రెస్‌తో కూడిని కూటమా? లేక కో ఆపరేటివ్ ఫెడరలిజం నినాదంతో ఏర్పడే కూటమినా? అనేది ఐదు రాష్ట్రాల ఎన్నికల తరువాతగాని ఒక రూపానికి వచ్చే అవకాశం లేకపోలేదు.