BRS MLA Defection Case : సుప్రీంకోర్టు డెడ్ లైన్ పై స్పందించిన స్పీకర్
BRS MLA Defection Case : పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతల పిటిషన్లపై అక్టోబర్ 31లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌కు డెడ్‌లైన్ విధించింది. దీంతో స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది
- By Sudheer Published Date - 01:39 PM, Thu - 31 July 25

తెలంగాణలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసు(BRS MLA Defection Case )పై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్(Telangana Assembly Speaker)ను ఆదేశించింది. జస్టిస్ బి.ఆర్. గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసిహ్ ధర్మాసనం ఈ తీర్పును వెలువరిస్తూ, ఏళ్ల తరబడి ఫిరాయింపు పిటిషన్‌పై నిర్ణయం తీసుకోకుండా పెండింగ్‌లో పెట్టడం సరికాదని స్పష్టం చేసింది. అయితే, ఫిరాయించిన ఎమ్మెల్యేలపై తామే వేటు వేయాలన్న పిటిషనర్ల విజ్ఞప్తిని ధర్మాసనం తోసిపుచ్చింది.
2023 నవంబర్‌లో తెలంగాణ శాసనసభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రాగానే, బీఆర్‌ఎస్ పార్టీ తరపున గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారు. పోచారం శ్రీనివాస్‌రెడ్డి, అరికపూడి గాంధీ, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, గూడెం మహిపాల్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, డాక్టర్ సంజయ్ కాంగ్రెస్‌లో చేరిన వారిలో ఉన్నారు. ఈ పరిణామంపై బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానందగౌడ్‌తో పాటు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్లు దాఖలు చేశారు.
Malegaon Bomb Blast Case: 2008 మాలేగావ్ బాంబు పేలుడు కేసులో ఏడుగురు నిర్దోషులుగా విడుదల
ఈ పిటిషన్లపై గతంలో సుప్రీంకోర్టు (Supreme Court) తొమ్మిది సార్లు విచారణ జరిపింది. స్పీకర్ ఈ అంశంపై నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తున్నారని పిటిషనర్లు ఆరోపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఏప్రిల్ 3న తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా, పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతల పిటిషన్లపై అక్టోబర్ 31లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌కు డెడ్‌లైన్ విధించింది. దీంతో స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.
సుప్రీంకోర్టు తీర్పుపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ స్పందించారు. “కోర్టు తీర్పు కాపీ ఇంకా చూడలేదు. చూసిన తర్వాత స్పందిస్తా. ఇప్పటికే ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చాం. సుప్రీం కోర్టు ఆదేశాలపై న్యాయ నిపుణులను సంప్రదించి అధ్యయనం చేస్తాం. ఆ తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటాం” అని ఆయన తెలిపారు. స్పీకర్ ప్రకటనతో ఈ కేసులో తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.