Hussain Sagar 2.0: హుస్సేన్‌సాగర్ నయా లుక్..స్కై వాక్ తో పాటు మరెన్నో !!
Hussain Sagar 2.0: హైదరాబాద్ గర్వకారణంగా నిలిచిన హుస్సేన్‌సాగర్‌ను ‘హుస్సేన్‌సాగర్ 2.0’ పేరుతో ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయనున్నట్లు సీఎం వెల్లడించారు.
- By Sudheer Published Date - 09:30 AM, Tue - 23 September 25

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్(Hyderabad)ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth) నూతన దిశానిర్దేశాలు జారీ చేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన “తెలంగాణ రైజింగ్ కోర్ – అర్బన్ ఏరియా” సమీక్ష సమావేశంలో ఆయన కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నగరంలో పెరుగుతున్న జనాభా అవసరాలను దృష్టిలో ఉంచుకుని విద్య, వైద్యం, రోడ్డు రవాణా, పారిశుద్ధ్యం వంటి కీలక రంగాలను అభివృద్ధి చేయడం అత్యవసరమని స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలోని పాఠశాలలు, కళాశాలలను ఆధునికీకరించడం, వాటిని వర్గీకరించి ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందేలా చర్యలు చేపట్టాలని విద్యాశాఖను ఆదేశించారు. అంతేకాకుండా ఆక్రమణల నుంచి విముక్తి పొందిన ప్రభుత్వ స్థలాల్లో ఆధునిక పాఠశాల భవనాలను నిర్మించాలని నిర్ణయించారు.
Sourav Ganguly : మరోసారి క్యాబ్ అధ్యక్షుడిగా గంగూలీ
నగరానికి ‘క్లీన్ సిటీ’ ఇమేజ్ తీసుకురావడం ప్రాధాన్యతనిచ్చిన సీఎం, చెత్త సేకరణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. డ్రైనేజీలు, మ్యాన్‌హోల్స్ శుభ్రం కోసం రోబోటిక్ యంత్రాలను వినియోగించాలన్నారు. చెరువులు, కుంటలను సంరక్షించడంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కోసం అధునాతన సిగ్నలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసి, అన్ని జంక్షన్లను కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానం చేయాలని సూచించారు. గూగుల్ సహకారంతో ట్రాఫిక్ నియంత్రణలో కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టాలని కూడా తెలిపారు. అదనంగా, ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలను నిర్మించడం, సచివాలయం సహా అన్ని ప్రభుత్వ సంస్థల్లో సోలార్ విద్యుత్ వినియోగం పెంపు కూడా ఆయన ప్రణాళికలో భాగమైంది.
హైదరాబాద్ గర్వకారణంగా నిలిచిన హుస్సేన్‌సాగర్‌ను ‘హుస్సేన్‌సాగర్ 2.0’ పేరుతో ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయనున్నట్లు సీఎం వెల్లడించారు. ఇందిరా పార్క్, నెక్లెస్ రోడ్, సంజీవయ్య పార్క్ ప్రాంతాల్లో స్కైవాక్‌లు, సైకిల్ ట్రాక్‌లు, మల్టీ లెవెల్ పార్కింగ్ సౌకర్యాలను ఏర్పాటు చేయనున్నారు. వీధి వ్యాపారుల కోసం ప్రత్యేక వెండింగ్ జోన్లు ఏర్పాటు చేయడం ద్వారా వారికి సౌకర్యం కల్పించనున్నారు. మరోవైపు, హైదరాబాద్‌ను ‘డ్రగ్ ఫ్రీ సిటీ’గా మార్చే లక్ష్యంతో డ్రగ్స్ వినియోగదారులను నిందితులుగా పరిగణించి, వారిని పది రోజుల పాటు రీహాబిలిటేషన్ సెంటర్‌లో ఉంచాలని నిర్ణయించారు. ఇందుకోసం చర్లపల్లి జైలు ప్రాంగణంలో ప్రత్యేక రీహాబ్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ చర్యలతో హైదరాబాద్ అభివృద్ధి, శుభ్రత, భద్రత కొత్త దశలోకి ప్రవేశిస్తుందని సీఎం నమ్మకం వ్యక్తం చేశారు.