Saddula Bathukamma : సద్దుల బతుకమ్మ సంబరాల్లో పాల్గొనబోతున్న సీఎం రేవంత్
CM Revanth : హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వద్ద ప్రభుత్వం ఆధ్వర్యంలో అంబరాన్నంటేలా బతుకమ్మ సంబరాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి
- By Sudheer Published Date - 04:15 PM, Thu - 10 October 24

మరికొద్ది గంటల్లో బతుకమ్మ సంబరాలు (Bathukamma) పూర్తి కాబోతున్నాయి. తొమ్మిది రోజులపాటు రోజుకోరూపంలో కొలిచిన బతుకమ్మను చివరి రోజున సత్తుపిండి, పెరుగన్నం, పులిహోర మలిద ముద్దలు, కొబ్బరన్నం నైవేద్యంగా సమర్పించి సద్దుల బతుకమ్మ రూపంలో ముగియనుంది. ఈ రోజు (గురువారం) రాష్ట్ర వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ (Saddula Bathukamma) వేడుకలు జరగనున్నాయి. ఈ సాయంత్రం హైదరాబాద్ ట్యాంక్‌బండ్ (Hyderabad Tank Bund )వద్ద ప్రభుత్వం ఆధ్వర్యంలో అంబరాన్నంటేలా బతుకమ్మ సంబరాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సంబురాల్లో ఏకంగా 10 వేల మంది మహిళలు పాల్గొనబోతున్నారు. అంతే కాదు ఈ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), మంత్రులు, అధికారులు సైతం పాల్గొనడం విశేషం. సాయంత్రం 4 గంటలకు అమరవీరుల స్మారక చిహ్నం నుంచి ట్యాంక్‌బండ్ వరకు బతుకమ్మలతో మహిళల ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో రాత్రి 11 గంటల వరకు ట్యాంక్‌బండ్ సమీపంలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నట్లు పోలీసులు వెల్లడించారు.
వాహనాలను ఇక్బాల్ మినార్ నుంచి అప్పర్ ట్యాంక్ బండ్ తెలుగు తల్లి ఫ్లై ఓవర్ వైపు మళ్లిస్తారు. అటు, పీవీ విగ్రహం ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ నుంచి ఎన్టీఆర్ మార్క్ వైపు వచ్చే వాహనాలను నెక్లెస్ రోటరీ వద్ద ప్రసాద్ ఐమాక్స్, మింట్ కాంపౌండ్ లేన్ వైపు మళ్లించనున్నారు. రాణిగంజ్ నుంచి పీవీఎన్ఆర్ మార్గ్ (నెక్లెస్ రోడ్) వైపు వచ్చే వాహనాలను నల్లగుట్ట ‘ఎక్స్’ రోడ్ల వద్ద ట్రాఫిక్ మినిస్టర్ రోడ్డు వైపు మళ్లిస్తారు. ఎగువ ట్యాంక్ బండ్‌కు వచ్చే వాహనాలను పాత అంబేడ్కర్ విగ్రహం వద్ద వాహనాలు ఇక్బాల్ మినార్ వైపు మళ్లించనున్నారు. సికింద్రాబాద్ నుంచి అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వచ్చే వాహనాలను కర్బలా మైదాన్ వద్ద బైబిల్ హౌస్ వైపు ట్రాఫిక్ మళ్లించనున్నారు. ధోబీ ఘాట్ నుంచి చిల్డ్రన్స్ పార్క్/అప్పర్ ట్యాంక్ బండ్‌కు వచ్చే వాహనాలను DBR మిల్స్ వద్ద కవాడిగూడ ‘X’ రోడ్ల వైపు మళ్లిస్తారు. కాగా, బతుకమ్మ వేడుకల సందర్భంగా సాధారణ వాహనాలకు ట్రాఫిక్ ఆంక్షలు తప్ప, ఆర్టీసీ బస్సులపై ఆంక్షలు ఉండవని పోలీసులు స్పష్టం చేశారు.
Read Also : Prasanth Varma Mahakali: పీవీసీయూలో మరో క్రేజీ అనౌన్స్మెంట్ చేసిన ప్రశాంత్ వర్మ