Lok Sabha Results : బీజేపీను గెలిపించి బీఆర్ఎస్ నేతలు అవయవదానం చేసారు – సీఎం రేవంత్ రెడ్డి
7 సీట్లలో బీజేపీను గెలిపించి బీఆర్ఎస్ నేతలు అవయవదానం చేశారని, బీఆర్ఎస్ నుంచి బలహీన అభ్యర్థులను బరిలోకి దింపి బీజేపీ నేతల గెలుపు కోసం కేసీఆర్ కృషి చేశారని రేవంత్ ఆరోపించారు
- By Sudheer Published Date - 05:19 PM, Wed - 5 June 24

లోక్ సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) కాంగ్రెస్ పార్టీ (Congress) 8 స్థానాల్లో విజయం సాధించడం పై సీఎం రేవంత్ (CM Revanth Reddy) మీడియా సమావేశం చేసారు. ఈ సందర్భాంగా బిఆర్ఎస్ పార్టీ పై ఆగ్రహం వ్యక్తం చేసారు. 7 సీట్లలో బీజేపీను గెలిపించి బీఆర్ఎస్ నేతలు అవయవదానం చేశారని, బీఆర్ఎస్ నుంచి బలహీన అభ్యర్థులను బరిలోకి దింపి బీజేపీ నేతల గెలుపు కోసం కేసీఆర్ కృషి చేశారని రేవంత్ ఆరోపించారు.
ఇవాళ్టి నుంచి మరో రెండు గంటలు అదనంగా పని చేస్తామని, రాష్ట్రంలో ఏ సీటు గెలిచినా, ఏ సీటు ఓడినా తనదే బాధ్యత అని రేవంత్ రెడ్డి అన్నారు. వంద రోజుల కాంగ్రెస్ పాలనకు ప్రజలు పట్టం కట్టారని, మమ్మల్ని ఆశీర్వదించిన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల కంటే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓట్ల శాతం పెరిగిందని, తమ రెఫరెండంకు ప్రజలు మద్దతు తెలిపారన్నారు. కాంగ్రెస్ గెలుపు కోసం పోరాడిన కార్యకర్తలకు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్కు వచ్చిన 22 ఓట్ల శాతాన్ని ఈ ఎన్నికల్లో కమలం పార్టీకి బదిలీ చేశారని ధ్వజమెత్తారు. 2001 నుంచి 2023 వరకు సిద్దిపేటలో బీఆర్ఎస్కు మెజార్టీ వచ్చిందన్న రేవంత్ రెడ్డి, సిద్దిపేటలో బీఆర్ఎస్ ఓట్లను హరీశ్‌రావు బీజేపీకి బదిలీ చేయించారని ఆరోపించారు. అందుకే బీఆర్ఎస్ ఓటింగ్ 16.5 శాతానికి పడిపోయిందన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
తాను జిల్లాకు ముఖ్యమంత్రిని కాదని రాష్ట్రానికి సీఎం అని, తన బాధ్యత రాష్ట్రానికి పరిమితమని రేవంత్ అన్నారు. అయితే పీసీసీ అధ్యక్షుడిగా పార్టీ గెలుపు ఓటములకు తానే బాధ్యుడినన్న రేవంత్, తన జిల్లా అయిన మహబూబ్‌నగర్‌లో పార్టీ ఓటమికి తాను బాధ్యత వహిస్తున్నట్లు చెప్పారు. ఈ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు ఉగాది పచ్చడిలాంటివని అభివర్ణించారు. మోడీ గ్యారంటీకి వారంటీ తీరిపోయిందని విమర్శించారు. ఆయన కాలం చెల్లిపోయిందని, మోడీ చరిష్మాతో ఎన్నికలకు వెళ్లిన ఎన్డీయే కూటమికి ప్రజలు బుద్ధి చెప్పారని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజలు తిరస్కరించిన మోడీ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆయనకు విలువలు ఉంటే ప్రధాని పదవి నుండి హుందాగా తప్పుకోవాలన్నారు.
Read Also : Pawan Kalyan : పిఠాపురం ఎమ్మెల్యే గారు -వెంకటేష్ ట్వీట్