Weather Forecast : ఈనెల 18 వరకు వర్షాలు.. ఏపీ, తెలంగాణకు వర్ష సూచన
తెలంగాణలోని 13 జిల్లాల్లో నేటి నుంచి జులై 18 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణం కేంద్రం వెల్లడించింది.
- By Pasha Published Date - 09:11 AM, Sun - 14 July 24

Weather Forecast : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని పలు జిల్లాలకు వర్షసూచన జారీ అయింది. తెలంగాణలోని 13 జిల్లాల్లో నేటి నుంచి జులై 18 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణం కేంద్రం వెల్లడించింది. పలుచోట్ల గంటకు 30-40 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. ఇవాళ వర్షం కురిసే అవకాశమున్న జిల్లాల జాబితాలో నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కామారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ ఉన్నాయి. దీంతో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేశారు. హైదరాబాద్‌లో ఇవాళ సాయంత్రం లేదా రాత్రి సమయంలో వర్షం కురిసే ఛాన్స్ ఉంది. జూన్ నెలలో ఆశించినంతగా వర్షాలు కురవలేదు. దీంతో అన్నదాతలు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. జులై నెలలో మాత్రం వర్షాలు దంచికొడతాయని ఐఎండీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే జులై మాసంలో సగం రోజులు పూర్తి కాగా.. వచ్చే 15 రోజుల్లో భారీ వర్షాలు(Weather Forecast) కురుస్తాయనే ఆశతో రైతులు ఉన్నారు.
We’re now on WhatsApp. Click to Join
ఏపీలో వాతావరణం ఇలా..
ఆంధ్రప్రదేశ్‌లోనూ జులై 18 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాయలసీమ జిల్లాలో తేలికపాటి వర్షాలే పడతాయని తెలిపింది. ఉత్తర, దక్షిణ కోస్తా జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. నైరుతి రుతుపవనాలు, ద్రోణుల ప్రభావానికి తోడు, ఈశాన్య అస్సాం నుంచి వాయవ్య బంగాళాఖాతం వరకు, పశ్చిమ అస్సాం నుంచి వాయవ్య బంగాళాఖాతం వరకు వేర్వేరుగా ద్రోణులు కొనసాగుతున్నాయి. వీటి ప్రభావంతోనే ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈశాన్య అసోం నుంచి వాయవ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తులో ఒక ద్రోణి కొనసాగి తాజాగా బలహీనపడిందని పేర్కొంది.
Also Read :Ear Piercing : పురుషులు చెవులు కుట్టించుకుంటే ఏమవుతుందో తెలుసా ?
వరద గుప్పిట్లో అసోం
భారీ వర్షాలకు అసోంలోని అన్ని నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. ఈ వరదల కారణంగా మృతిచెందిన వారి సంఖ్య 106కి పెరిగింది. రాష్ట్రంలోని 24 జిల్లాల పరిధిలో దాదాపు 12.33 లక్షల మందికిపైగా ప్రజలు ఈ వరదలతో ప్రభావితమయ్యారు. ప్రస్తుతం వరద ఉద్ధృతి కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ 75 రెవెన్యూ గ్రామాల పరిధిలోని 2,406 గ్రామాలు ఇంకా వరద గుప్పిట్లోనే ఉన్నాయి. అసోంలో వరదల కారణంగా 32,924.32 హెక్టార్లలో సాగు భూములు ముంపునకు గురయ్యాయి. ధుబ్రి జిల్లాలోని కాచర్, గోలాఘాట్, నాగాన్, గోల్‌పరా, మజులి, సౌత్ సల్యాజీ, ధేమాజీ ప్రజలు వరద ప్రభావానికి గురయ్యారు. వరద ప్రభావిత జిల్లాల్లోని 316 సహాయ శిబిరాల్లో 2.95 లక్షల మందికి పైగా ప్రజలు ఆశ్రయం పొందుతున్నారు.