Gun Firing Case : బత్తుల ప్రభాకర్ టార్గెట్.. రూ.333 కోట్లు, 100 మంది యువతులు..
ప్రిజం పబ్ కాల్పుల కేసు నిందితుడు బత్తుల ప్రభాకర్(Gun Firing Case) వయసు 29 ఏళ్లు.
- By Pasha Published Date - 12:39 PM, Mon - 3 February 25

Gun Firing Case : గత శనివారం (ఫిబ్రవరి 1న) రాత్రి హైదరాబాద్‌లోని ప్రిజం పబ్‌లో పోలీసులపై కాల్పులు జరిపి బత్తుల ప్రభాకర్ కలకలం రేపాడు. కాల్పులు జరిపాక పారిపోయేందుకు యత్నించాడు. అయితే పోలీసులు సాహసోపేతంగా వ్యవహరించి పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి రెండు తుపాకులను, 23 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. కోర్టు ఆదేశాలతో ప్రభాకర్‌ను 14 రోజుల రిమాండ్‌కు తరలించారు. ఈ కేసుపై దర్యాప్తు చేసిన హైదరాబాద్ సిటీ పోలీసులు కీలక వివరాలను గుర్తించారు. బత్తుల ప్రభాకర్‌కు రూ.333 కోట్ల పెద్ద టార్గెట్ ఉందని తేల్చారు. 100 మంది అమ్మాయిలను కూడా అతగాడు లక్ష్యంగా పెట్టుకున్నాడట. ఆ వివరాలు చూద్దాం..
Also Read :Shocking Incident : ఘోరం.. తండ్రి డెడ్‌బాడీని రెండు ముక్కలు చేయమని..
ఎవరీ బత్తుల ప్రభాకర్ ?
ప్రిజం పబ్ కాల్పుల కేసు నిందితుడు బత్తుల ప్రభాకర్(Gun Firing Case) వయసు 29 ఏళ్లు. ఇతగాడు ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా వాస్తవ్యుడు. ప్రభాకర్ ఎనిమిదో తరగతి వరకు చదువుకున్నాడు. ఈజీ మనీ కోసం స్కూల్ డేస్ నుంచే దొంగతనాలకు పాల్పడ్డాడు. రూ.3 వేల దొంగతనంతో ఇతగాడి దొంగతనాల వ్యవహారం మొదలైంది. గతంలో బత్తుల ప్రభాకర్.. ఒకేరోజు రూ.3 లక్షలు, రూ.33 లక్షలు చొప్పున చోరీ చేయాలని టార్గెట్‌గా పెట్టుకుని మరీ దొంగతనాలు చేశాడు. ఈక్రమంలోనే ఛాతీపై 3 నెంబర్ టాటూ వేయించుకున్నాడు. ప్రభాకర్ ఛాతీపై రెండు వైపులా పచ్చ బొట్లు ఉన్నాయి.
నాలుగు రాష్ట్రాల్లో భారీగా కేసులు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ప్రభాకర్‌పై కేసులు ఉన్నాయి. బిట్టు, రాహుల్ రెడ్డి, సర్వేశ్వర రెడ్డి, రాజు వంటి మారుపేర్లతో ప్రభాకర్ చాలాచోట్ల దొంగతనాలు చేశాడు. ప్రభాకర్‌ను తొలిసారిగా 2020 సంవత్సరంలో వైజాగ్ పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో అతడిపై దాదాపు 80 కేసులు ఉన్నాయి. హైదరాబాద్ పరిధిలోని మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ప్రభాకర్‌పై 16 కేసులు ఉన్నాయి. ‘‘మొత్తం రూ.333 కోట్లను సంపాదించి ఆ తర్వాత నేరాలు మానేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నా’’ అని ఇటీవలే విచారణలో హైదరాబాద్ సిటీ పోలీసులకు ప్రభాకర్ చెప్పాడు. ‘‘మొత్తం 100 మంది యువతులతో సన్నిహితంగా ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నా’’ అని అతడు చెప్పడాన్ని విని, ఇంటరాగేట్ చేసిన పోలీసులు షాక్‌కు గురయ్యారు.
Also Read :AP BJP : టార్గెట్ ఆ ఏడుగురు.. ఏపీలో బీజేపీ బిగ్ స్కెచ్
హైదరాబాద్‌లో లగ్జరీగా బతుకుతూ..
హైదరాబాద్ పరిధిలోని నార్సింగ్‌లో ఉన్న ఒక గెటెడ్ కమ్యూనిటీలో ప్రభాకర్ ఉండేవాడు. ఒడిశాకు చెందిన ఒక యువతితో బత్తుల ప్రభాకర్ సహజీవనం చేస్తున్నాడు. తన స్నేహితుల పేర్లతో సెకండ్ హ్యాండ్ లగ్జరీ కార్లు కొనేవాడు. నెలకో కారు మారుస్తూ విలాసవంతంగా బతికేవాడు. ప్రిజం పబ్బుకు ప్రభాకర్ తరచూ వచ్చేవాడు. ఈవిషయం హైదరాబాద్ సిటీ పోలీసులకు తెలిసింది. దీంతో అతడిని పట్టుకునేందుకు పబ్‌కు వెళ్లారు. ఈక్రమంలో పోలీసులను గుర్తించిన ప్రభాకర్.. వారిపై కాల్పులకు తెగబడ్డాడు.