Vanajeevi Ramaiah : వనజీవి రామయ్య ఇక లేరు.. ఆయన ఖ్యాతికి కారణమిదీ
ఈయన అసలు పేరు దరిపల్లి రామయ్య(Vanajeevi Ramaiah).
- By Pasha Published Date - 08:03 AM, Sat - 12 April 25

Vanajeevi Ramaiah : పద్మశ్రీ వనజీవి రామయ్య ఇక లేరు. 85 ఏళ్ల వయసున్న రామయ్య గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. శనివారం తెల్లవారుజామున ఆయనకు గుండెపోటు రావడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ రామయ్య తుదిశ్వాస విడిచారు.
Also Read :Kolkata Knight Riders: చిత్తుచిత్తుగా ఓడిన చెన్నై.. 8 వికెట్ల తేడాతో కేకేఆర్ విజయం!
వనజీవి రామయ్యకు ఖ్యాతి వచ్చిందిలా..
- రామయ్య స్వస్థలం ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి గ్రామం.
- ఈయన అసలు పేరు దరిపల్లి రామయ్య(Vanajeevi Ramaiah).
- పర్యావరణ పరిరక్షణ కోసం ఆయన ఎంతో పాటుపడ్డారు. చెట్ల నరికివేతను చాలాచోట్ల అడ్డుకున్నారు. చెట్లను కాపాడాలని ముమ్మరంగా ప్రజల్లో ప్రచారం చేశారు.
- రామయ్య ఎన్నోచోట్ల మొక్కలను నాటారు.
- రామయ్య తన జీవిత కాలంలో దాదాపు కోటికిపైగా మొక్కలను నాటారని సమాచారం. అందుకే ఆయనకు వనజీవి రామయ్యగా పేరొచ్చింది.
- రామయ్య చేసిన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం.. 2017లో ఆయనకు పద్మశ్రీ పురస్కారాన్ని అందించింది.
- రామయ్య మృతితో ప్రకృతి ప్రేమికులు శోక సంద్రంలో మునిగిపోయారు.
Also Read :Pot Water: ఈ వేసవిలో కుండ వాడేవారు పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే!
ఓ ఇంటర్వ్యూలో వనజీవి రామయ్య ఏం చెప్పారంటే..
జీవించి ఉన్న సమయంలో ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వనజీవి రామయ్య ఇలా చెప్పారు.. ‘‘ఎక్కడైనా ఒక చెట్టుంటే దాన్ని నరకాలి అని ఆలోచించే వాళ్లే ఎక్కువ. మొక్కలు నాటాలని ఆలోచించే వాళ్లు చాలా తక్కువ. చెట్లను నరికిస్తే వర్షాలురావు, పవనాలు కరువైతాయి. ఈవిషయాన్ని మనం గమనించలేక పోతున్నాం. అందుకే ప్రజల వద్దకు ఈ కార్యక్రమం తీసుకుపోతున్నాను. భారత ప్రభుత్వం నుంచి నాకు వచ్చిన పద్మశ్రీ పురస్కారంతో.. నేను మొక్కలు నాటుతుంటే నవ్విన వాళ్లకు నాణ్యమైన సందేశం అందింది. ఇప్పుడు వాళ్లంతా నవ్వకుండా నాకు నమస్తే పెడుతున్నారు. గతంలో నేను మొక్కలు నాటుతుంటే.. ఈయన ఇందిరాగాంధీనా, రాజీవ్‌గాంధీనా ఊరు ఊరు తిరిగి మొక్కలు నాటుతున్నాడు అని కామెంట్లు చేసేవాళ్లు. రోడ్ల వెంట విత్తనాలు వేస్తే ఈయనకు ఏం వస్తది అసలు బుర్ర పనిచేస్తలేదు అని అనేవారు. అయినా నేను బాధపడలేదు. కెన్యాకు చెందిన వంగాయి మాతాయి స్ఫూర్తిగా మూడు కోట్ల మొక్కలు నాటాలి అనేది నా లక్ష్యం. అందరూ ఎన్నో తరగతులు చదివితే ఇప్పుడు నేను 70వ తరగతి చదువుతున్నా.. ప్రతి సంవత్సరం ఒక తరగతే నాకు, జీవితమే ఒక పాఠశాల’’ అని వనజీవి రామయ్య జీవించి ఉండగా వ్యాఖ్యానించారు.