Telangana: తెలంగాణలో వందల కోతుల మృతదేహాలు
- By Praveen Aluthuru Published Date - 05:53 PM, Sat - 7 October 23

Telangana: తెలంగాణలోని జగదేవ్‌పూర్ మండలం మునిగడప గ్రామ శివారులో శనివారం 100కు పైగా కోతులు అనుమానాస్పదంగా మృతి చెందాయి. ఉదయం పొలాల్లోకి వెళ్లిన రైతులకు పొలాల సమీపంలో కోతుల కళేబరాలు కనిపించాయి. వారు వెంటనే వెటర్నరీ అధికారులకు సమాచారం అందించారు. వెటర్నరీ డాక్టర్లు కోతుల కళేబరాల నమూనాలను సేకరించి ల్యాబ్ కు పంపించారు. ఈ ఘటన గ్రామాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ప్రాథమిక పరీక్షల అనంతరం కోతులు పురుగుమందులు కలిపిన నీటిని తాగి ఉంటాయని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న జగదేవ్‌పూర్ పోలీసులు సంఘటన ప్రదేశానికి వచ్చి పరిస్థితిని గమనించారు. స్థానికుల నుంచి సమాచారాన్ని సేకరించి విచారణ ప్రారంభించారు. దేవుడిలా పూజించే వానరాలను ఇలా చంపి పడేయడం చాలా దారుణమని.. కోతులను హతమార్చిన నిందితులపై అధికారులు వెంటనే కఠినమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: KTR: ఈ నెల 9న తొర్రూరులో కెటిఆర్ సభకు భారీ ఏర్పాట్లు