HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Telangana
  • >Ntr Kcr Neravera Is Ntrs Dream Of India Kcr Brs Towards That Direction

NTR : నెర‌వేర‌ని ఎన్టీఆర్ క‌ల‌ ‘భారతదేశం’, ఆ దిశ‌గా కేసీఆర్ BRS !

భారతదేశం’ అనే పార్టీ స్థాపించి, దేశాన్నీ ఏలాలని ఎన్టీఆర్ (NTR) సంకల్పం చేసుకున్నారు.

  • By CS Rao Published Date - 12:43 PM, Wed - 18 January 23
  • daily-hunt
NTR
Ntr

‘భారతదేశం’ అనే పార్టీ స్థాపించి, దేశాన్నీ ఏలాలని ఎన్టీఆర్ (NTR) సంకల్పం చేసుకున్నారు. ఆయ‌న జీవితంలో అదొక్క‌టే సాధించలేక పోయారు. ఆ ఒక్క‌టి తప్ప ఆన్నీ సాధించిన మేరున‌గ‌ధీరుడు ఆయ‌న‌. ఎన్టీఆర్ ప్రధానమంత్రి కాలేకపోయిన‌ప్ప‌టికీ వి.పి. సింగ్ ను ప్రధానిగా(PM) కూర్చోబెట్ట‌డం ద్వారా కింగ్ మేకర్ అయ్యారు. దేశంలోని కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలన్నింటినీ ఒక్కచోటకు చేర్చి, నేషనల్ ఫ్రంట్ స్థాపించి దానికి కన్వీనర్ గా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పారు. ఏడు సంవత్సరాలపాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా సంచ‌ల‌న సంస్క‌ర‌ణ‌లు చేయ‌డం ద్వారా మ‌రువ‌లేని సేవ‌ల‌ను అందించారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే మొట్టమొదటగా కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని స్థాపించి చరిత్రకెక్కారు. తన పరిపాలనాకాలంలో ఎన్నో ప్రయోగాలు చేసి సామాన్యుల గుండెల్లో ప‌దిలంగా నిలిచిపోయారు.

రాజ‌కీయ సేవ‌కుడు (NTR)

కోట్లాదిమంది ప్రజల నుండి పొందిన అభిమానధనానికి ప్రతిగా ఏదైనా ఇవ్వాలనుకున్నారు. సగటుమనిషి కోసం నిలవాలని నిశ్చయించుకున్నారు. ప్రతిపౌరుని ఋణం తీర్చుకోవాలని సంకల్పం చేసుకొన్నారు. తెలుగుప్రజ కోసం తెలుగుదేశం పార్టీ స్థాపించారు.తొమ్మిది నెలల్లోనే జయకేతనం ఎగురవేశారు. ఢిల్లీ(PM)పీఠాలను గజగజ వణికించారు. తెలుగుప్రజల్లో రాజకీయ చైతన్యం నింపారు. యువతను, విద్యావంతులను, ఆడపడుచులను, వెనుకబడిన వర్గాలను నాయకులుగా, మంత్రులుగా చేశారు. రాజకీయ యవనికలోనూ మహానాయకుడిగా నిలిచారు. తెలుగు ఆత్మగౌరవ బావుటాన్ని జాతీయ స్థాయిలో రెపరెపలాడించారు. పేదలకోసం, మహిళల కోసం అహరహం తపించారు.

సంచలన విజయాలు

రాజకీయ జీవితంలో సంచలనాలు, సంచలన విజయాలు, సవాళ్లు, ప్రతి సవాళ్లు ఆన్నీ చూశారు. రాజకీయాల్లో అమేయంగా గెలిచారు. నిబద్ధత, నిజాయితీ, నిర్భీతి, నిక్కచ్చితనం ఎన్ టి ఆర్ బలాలు. అహం,ఆవేశం, అతివిశ్వాసం ఆయన బలహీనతలు. మొండితనం ఆయన ఆస్తి. పట్టుదల ఆయన ప్రాణం. మానవత్వం నింపుకున్న మనిషిగా ప్రజలకోసం ప్రతిక్షణం శ్రమించారు. అనంతమైన,అనితర సాధ్యమైన,అభేద్యమైన ప్రజాభిమానమే ఆయన ధనం. ఆత్మాభిమానం ఆయన ఇంధనం. ఈ బలాలు, ఈ ధనాలే ఎన్.టి.రామారావును విజేతగా నిలబెట్టాయి. అవినీతిరహిత పాలన ఆయన ముద్ర. ప్రజాధనం వృధాకాకుండా చూడడం ఆయన ప్రత్యేకం.

సంస్కరణలు అనేకం (PM)

పటేల్ పట్వారి వ్యవస్థ నిర్మూలనం, శాసనమండలి రద్దు, మండలాల స్థాపన ద్వారా పరిపాలనా వికేంద్రీకరణ, రాయలసీమ క్షేమం కోసం తెలుగుగంగ నిర్మాణం, ఆడపిల్లలకు ఆస్తిలో హక్కు, కిలో రెండురూపాయల బియ్యం పధకం, విద్యుత్ చార్జీల తగ్గింపు, కార్పొరేషన్ పదవుల సంఖ్య కుదింపు… ఇవ్వన్నీ ఎన్.టి. ఆర్ చేసిన సంస్కరణల, ప్రజాప్రయోజనాల పర్వం. ఏకపక్ష నిర్ణయాలు, ప్రజాప్రతినిధుల పాత్రను విస్మరించడం, ఒకేసారి కేబినెట్ మొత్తం రద్దు చెయ్యడం, తన మీద తనకు అతివిశ్వాసం, తను నమ్మినవారిపట్లా అదే అతివిశ్వాసంగా ఉండడం, చుట్టూ జరుగుతున్న కుట్ర, కుతంత్రాలను, తప్పులను గమనించకపోవడం మొదలైనవి… ఎన్టీఆర్ రాజకీయజీవితంలో చేదు అనుభవాలు, అపజయాలు, ఆత్మక్షోభ పొందడానికి కారణాలు అయ్యాయి. తెలుగురాష్ట్రంలోనే కాక, భారతదేశంలోనే ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థలను నిర్మించిన ధీశాలి నందమూరి తారక రాముడు.

అస్త‌మించిన రోజు జ‌న‌వ‌రి 18

మ‌ర‌ణంలేని మ‌నిషి ఎన్టీఆర్ అస్త‌మించిన రోజు జ‌న‌వ‌రి 18. భౌతిక దేహాన్ని వీడి ప‌ర‌లోకాల‌కు వెళ్లిన యుగ‌పురుషుడు ఆయ‌న‌. రాజ‌కీయ‌, సినీ రంగాల్లో మేరున‌గ‌ధీరునిగా వెలుగొందిన మ‌హా మ‌నీషి ఎన్టీఆర్‌. జ‌గ‌త్తు ఉన్నంత వర‌కు ఆయ‌న్ను ఎవ‌రూ మ‌రువ‌లేరు. అంతటి విజయస్వరూపుడైన ఎన్టీఆర్ జీవితం వ్యక్తిగతంగానూ, రాజకీయంగానూ విషాదాంతమైంది. విధి ఆడిన నాటకం ఆయ‌న లాస్ట్ జ‌ర్నీ విషాదాంతంగా ముగిసింది.

కుళ్ళురాజకీయాలకు అతీతుడైన మహానాయకుడు. నటరత్నగా కోట్లాదిమంది ప్రజల హృదయాలు గెలుచుకున్న ఈ నవరస నటనాభిరామునికి ‘భారతరత్న’ ప్రదానం చెయ్యాలి. రాజకీయాలకు అతీతంగా, అన్ని పార్టీలు ఈ దిశగా కలిసి సాగాలి. నందమూరి తారకరామారావు పేరున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్థాపించిన పురస్కారాలు ప్రతి సంవత్సరం తప్పకుండా ప్రదానం చెయ్యడమే నిజమైన నివాళి. తన ఐశ్వర్యం, కీర్తి, వైభవం ఆన్నీ ఆయన రెక్కల కష్టం, ధర్మార్జితం. ఈ మహితాత్ముని స్మృతికి అంజలి ఘటించ‌డం ప్ర‌తి తెలుగువాడి బాధ్య‌త‌.

Also Read : Jr. NTR and Kalyan Ram: నేడు ఎన్టీఆర్ వర్ధంతి.. జూ.ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ నివాళి

దివంగత మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ సినీ నటుడు నందమూరి తారక రామారావు తనవు చాలించి నేటికి 27 సంవత్సరాలు. 27వ వర్థంతిని పురస్కరించుకుని కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. తెల్లవారుజామునే ఘాట్ వద్దకు చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లు ఎన్టీఆర్ సమాధిపై పుష్ప గుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించారు. వారితో పాటు మిగతా కుటుంబ సభ్యులు కూడా ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ వర్దంతిని పురస్కరించుకుని ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ టీడీపీ నేతలు, కార్యకర్తలు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు.

నందమూరి తారకరాముడు ఒక జీవితం జీవిత నిఘంటువు. నటుడు, నిర్మాత, దర్శకుడు, నాయకుడు, ప్రతినాయకుడు, ప్రతిపక్షనాయకుడు, మహానాయకుడు, చిత్రకారుడు. సినీ జీవితంలోనే కాదు, నిజజీవితంలోనూ ఇన్ని పాత్రలు పోషించి, శాసించి, భాసించిన ప్రభంజనుడు ఎన్టీఆర్. సామాన్యుడిగా మొదలై, అసామాన్యుడిగా నిలిచి, గెలిచిన నందమూరి తారకరామారావు జన్మదినం మే 28. మరో రెండేళ్లల్లో శతవసంతం సంపూర్ణం కానుంది. శ‌త జ‌యంతి ఉత్స‌వాల‌ను కొన‌సాగిస్తున్నారు.

Also Read : NTR: ఎన్టీఆర్​ ప్రజా పట్టాభిషేకానికి నేటికి 40 ఏళ్లు!

ఆకర్షణకు మరోపేరు అన్నగారు. స్ఫురద్రూపం, వాచకం ఆయన ప్రత్యేకం. ప్రతి అక్షరం, ప్రతి అచ్చు అచ్చంగా, స్వచ్ఛంగా పలుకుతాయి, మనకు చేరుతాయి. ఆ కంచుకంఠంలో స్వరవిన్యాసం, నటవిన్యాసం ఏకకాలంలో ప్రస్ఫుటంగా ప్రకటితమవుతాయి. ప్రతి రసం సహజ సంపూర్ణంగా చిలుకుతుంది. ఉచ్చారణలో ఇంతటి సహజసౌందర్య సంపూర్ణ సుగాత్రుడు తెలుగునటుల్లోనే మ‌రొక‌రు లేరు. ఎన్టీఆర్ ధరించే ఆభరణాలు కూడా ధ్వనిస్తూ నటిస్తాయి. భారతచలనచిత్ర జగతిలోనే ఇది అపూర్వం.

నటన ఒక ఎత్తు. నడక మరో ఎత్తు. బృహన్నలగా,అర్జునుడుగా, సుయోధనుడుగా, శ్రీరాముడుగా, రావణుడుగా, శ్రీకృష్ణుడుగా ఆన్నీ ఆయనే. కానీ, అది ఎన్.టి.ఆర్ అని మనకు అనిపించదు. ఆ పాత్రలే కనిపిస్తాయి. ఆ హావభావనట ప్రదర్శనలో వేరొకరు సాటిరారు. అప్పటి వరకూ బృహన్నలగా ఉండి, అర్జునుడిగా మారిన వెనువెంటనే వాచక రూపక స్వరూపాలు చకచకా మారిపోతాయి. ఇది ఒక నందమూరికే సాధ్యం. శ్రీకృష్ణుడి వాచకం పరమ సాత్వికం, రసరంజితం – సుయోధనుడిది గాంభీర్యం, రాజరాజసం. ఈ రెండు పాత్రలను ఒక్కడే ఒకే చిత్రంలో పోషించి, పండించడం న‌భూతోన‌భ‌విష్య‌త్‌. అది ఎన్ టి ఆర్ ఒక్కడికే చెల్లు.

తెలుగుసినిమా సామ్రాజ్యానికి చక్రవర్తిగా

నడి వయస్సులో ముసలి బడిపంతులు పాత్ర పోషించడం ఎంత సాహసమో కోడె వయస్సులో ముదిమి భీష్మ పాత్ర వెయ్యడం అంతకు మించిన సాహసం. పౌరాణిక పాత్రల కోసమే ఈయన పుట్టాడో, లేక ఆ పౌరాణిక పాత్రలే ఈయనగా పుట్టాయో పుట్టించునోడికే ఎరుక! దాదాపు ఐదు దశాబ్దాలపాటు తెలుగుసినిమా సామ్రాజ్యానికి చక్రవర్తిగా వెలిగారు.సాంఘిక, చారిత్రక, పౌరాణిక, జానపద పాత్రల్లో జీవించి, తరించారు. తరగని రసానుభూతుల్ని కోట్లాది మందికి పంచారు.

`మన దేశం` సినిమాతో మొదలైన మహానట ప్రస్థానం మేజర్ చంద్రకాంత్ వరకూ జగజ్జేగీయమానంగా సాగింది. జీవనసంధ్యలో, తన ఆరాధ్య శ్రీనాథ కవిసార్వభౌమ పాత్ర కూడా పోషించి, నిర్మించి, ఋషిఋణం, కవిఋణం తీర్చుకున్నాడు. నిడుమోలులో ఓనమాలు నేర్పిన తొలి గురువు వల్లూరి సుబ్బారావు, విజయవాడలో నటప్రస్థానానికి తొలితిలకం దిద్దిన కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణల శిష్యరత్నంగా తెలుగుభాషాభిమానాన్ని, తెలుగు ఆత్మగౌరవాన్ని నరనరాన చాటుకున్న మేరునగధీరుడు నందమూరి తారకరామారావు. నటవిరాట్ స్వరూపంగా సకల సౌభాగ్య సంపదలన్నీ అందుకున్నారు.

స్నేహశీలి

ఎన్ టి ఆర్ స్నేహపాత్రుడు, ప్రేమస్వరూపుడు. గుంటూరు, విజయవాడ ప్రాంతాలకు ఎప్పుడు వెళ్లినా తన చిన్ననాటి స్నేహితులను కలువకుండా ఉండడు. గుంటూరు శేషేంద్రశర్మ, సోమరాజు శ్రీహరిరావు ( ఆంజనేయపంతులుగారి కుమారుడు), జగ్గయ్య మొదలైనవారు ఎన్టీఆర్ సహాధ్యాయులు. ముక్కామల, రాజనాల మొదలగు మహానటులంతా ఎన్టీఆర్ స్థాపించిన నేషనల్ ఆర్ట్ ధియేటర్ లో తొలినాళ్ళల్లో నటించినవారే. విద్యార్థిగా ఉన్నప్పుడే ఈ సంస్థ స్థాపించాడు. తర్వాత ఇదే బ్యానర్ పై అద్భుతమైన అనేక సినిమాలు నిర్మించాడు. బంధుప్రీతి ఎక్కువైనా అవినీతికి ఆమడదూరం. అందుకే, ఆయనకు సబ్ రిజిస్ట్రార్ గా తొలి ప్రభుత్వ ఉద్యోగం మూడునాళ్ళ ముచ్చటే అయ్యింది. అక్కడి అవినీతి భరించలేక మూడు వారాల్లోనే ఉద్యోగానికి రాజీనామా చేశాడు. అవినీతి వ్యతిరేక పోరాటం ఆనాడే ప్రారంభించాడు. ముఖ్యమంత్రిగా కూడా అదే బాటలో నడిచాడు. ఒక్కమాటలో చెప్పాలంటే ఎన్టీఆర్ యుగపురుషుడు. నిమ్మకూరు నుండి నింగివరకూ ఎగిరిన, ఎగసిన తేజోమూర్తి ఎన్టీఆర్.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhra Pradesh TDP
  • Film maker
  • Nandamuri
  • Prime Minister

Related News

    Latest News

    • Green Chillies : ప్రతిరోజూ పచ్చిమిర్చి తినడం ఆరోగ్యానికి మంచిదేనా?..అస‌లు రోజుకు ఎన్ని తిన‌వ‌చ్చు..?

    • Khairatabad ganesh : గంగమ్మ ఒడికి చేరిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి

    • Renault Cars : జీఎస్టీ 2.0 ఎఫెక్ట్.. రెనో కార్లపై భారీ తగ్గింపు

    • South: ఏఐడీఎంకెలో ఉత్కంఠ.. పళణి స్వామి కీలక నిర్ణయాలు

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    Trending News

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

      • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd