NTR: ఎన్టీఆర్ ప్రజా పట్టాభిషేకానికి నేటికి 40 ఏళ్లు!
- By Balu J Published Date - 11:09 AM, Mon - 9 January 23

తెలుగు నేల అతడి వెంట నడిచింది. నలువైపులా జనవాహిని పరవళ్లు తొక్కింది. చైతన్య రథ సారథికి చెయ్యెత్తి జేకొట్టింది. గతమెంతో ఘనకీర్తి కల వెండితెర ఆరాధ్యుణ్ణి.. రాజకీయ యవనిక మీద అన్నగారిగా అభిమానించి.. హృదయ పూర్వకంగా స్వాగతించింది. ఎటు వెళితే అటు జన సందోహం.. పోటెత్తి.. ‘ఓటెత్తి’. మహా నాయకుడికి ముఖ్యమంత్రిగా పట్టం కట్టారు. ఈ ధరిత్రి మీద నూరేళ్ల చరిత్ర కలిగిన పార్టీనే.. మట్టి కరిపించిన ఆ చరితార్ధుడు నందమూరి తారకరామారావు.
ప్రజాక్షేమం కోసం సాహసాలు చేసిన సంక్షేమ రాముడి.. అలనాటి ప్రజా పట్టాభిషేకానికి నేటికి నలభై ఏళ్లు. ‘నందమూరి తారక రామారావు అను నేను ..’అని.. ఆయన మొట్టమొదట ప్రజా సమక్షంలో చేసిన ప్రమాణాన్ని జగమంతా ఆలకించింది. జనమంతా ఆస్వాదించారు. ఆనాటి అపురూప ఘట్టానికి నేటికి 40 ఏళ్లు. 1983 జనవరి 9 పెద్ద అక్షరాలతో రాసుకోవాల్సిన తేదీ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించాల్సిన తారీఖు. వెండితెరపై ఆరాధ్యుడిగా వెలిగిపోయిన నటరత్న నందమూరి తారక రామారావు.. ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేసిన ఘట్టం.