Teenmar Mallanna: సీఎం రేవంత్ బీజేపీకి సహకరిస్తున్నారు.. మల్లన్న సంచలన ఆరోపణలు
కానీ అది తీన్మార్ మల్లన్న(Teenmar Mallanna) విషయంలో సాధ్యం కాదు’’ అని మల్లన్న వ్యాఖ్యానించారు.
- Author : Pasha
Date : 05-03-2025 - 1:39 IST
Published By : Hashtagu Telugu Desk
Teenmar Mallanna: తెలంగాణలోని అన్ని బీసీ సంఘాలకు ఒకే వేదికను ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ బహిష్కృత నేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రకటించారు. బీసీలు అందరినీ ఏకం చేస్తామన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనరల్ స్థానాల్లో బీసీలను నిలబెడుతామని తెలిపారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే ఆలోచనే లేదన్నారు. శాసన మండలిలో తాను మాట్లాడేది చాలా ఉందని తీన్మార్ మల్లన్న చెప్పారు. తెలంగాణకు నిధులు ఇచ్చేందుకు ప్రధాని మోడీ సిద్ధంగా ఉన్నారని చెబుతున్న సీఎం రేవంత్, రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కూడా సాధించాలని కోరారు. తెలంగాణలో బీసీలకు ఎందుకు రాజ్యాధికారం రాదో చూస్తానని తీన్మార్ మల్లన్న పేర్కొన్నారు. ఇటీవలే జరిగిన ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొన్న బీసీ వాదులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.ఇవాళ ఉదయం హైదరాబాద్‌లోని సోమాజీగూడ ప్రెస్ క్లబ్‌లో మల్లన్న మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
Also Read :KCR Vs Congress : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పోల్స్.. కేసీఆర్ కొత్త వ్యూహం రెడీ
బీజేపీకి పరోక్షంగా సహకరిస్తున్నారు
‘‘కాంగ్రెస్ పార్టీ పెద్దలు నాకు షోకాజు నోటీసులు పంపించేలా ప్రయత్నం చేసిన సీఎం రేవంత్ రెడ్డికి నా కృతజ్ఞతలు.ఆయన దగ్గర ప్రతి ఒక్కరూ బానిసగా పడి ఉండాలని రేవంత్ రెడ్డి కోరుకుంటున్నారు. కానీ అది తీన్మార్ మల్లన్న(Teenmar Mallanna) విషయంలో సాధ్యం కాదు’’ అని మల్లన్న వ్యాఖ్యానించారు. ‘‘సీఎం రేవంత్ బీజేపీకి పరోక్షంగా సహకరిస్తున్నారు. సంవత్సరంలోనే ప్రభుత్వంపై ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చిందో అందరూ ఆత్మపరిశీలన చేసుకోవాలి. వంశీ చందర్‌రెడ్డిని ఓడగొట్టింది మీరే కదా ?’’ అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ నేతలు తన మాట వినడం లేదని రేవంత్ రెడ్డి అలిగి పోతున్నారట అని మల్లన్న కామెంట్ చేశారు.
Also Read :Nagababu : నాగబాబుకు మంత్రి పదవి ఖాయమేనా ?
కులగణనలో తప్పులు దొర్లాయి
‘‘తెలంగాణలో చేపట్టిన కులగణనలో తప్పులు దొర్లాయి. ఆ సర్వే రిపోర్టు చిత్తు కాగితంతో సమానం. అందుకే దాన్ని నేను తగులబెట్టాను. బీసీలకు న్యాయం జరగాలని కోరుకుంటూ దాన్ని తగులబెడితే తప్పేముంది ? ఒకవేళ అదే తప్పు అయితే.. నేను ఆ తప్పును వెయ్యి సార్లు చేస్తాను’’ అని తీన్మార్ మల్లన్నస్పష్టం చేశారు. ‘‘సర్వేలో బీసీల లెక్కను తక్కువగా చూపించారంటూ నేను ఆ రిపోర్టును తగులబెట్టాను. అలాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రీసర్వే ఎందుకు చేపట్టింది ? 3.54 లక్షల ఇళ్లలో సర్వే జరగలేదని ప్రభుత్వం చెప్పింది. మరో 16 లక్షల మంది సర్వేలో ఎంట్రీ కావాల్సి ఉందని సర్కారే తెలిపింది. ఏ ప్రాతిపదికన ఈ లెక్కలను చెప్పారో అర్థం కావడం లేదు. రాష్ట్రంలోని ఈడబ్ల్యూఎస్ వర్గం వారిని రక్షించుకునేందుకు ఇది సీఎం రేవంత్ రెడ్డి వేసిన ఎత్తుగడ’’ అని తీన్మార్ మల్లన్న వ్యాఖ్యానించారు.