KTR : ఆటో డ్రైవర్లకు రాహుల్ గాంధీ ఇచ్చిన హామీలను నెరవేర్చరా ? : కేటీఆర్
ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. అవన్నీ ఎందుకు అమలు చేయడం లేదు’’ అని కేటీఆర్(KTR) ప్రశ్నించారు.
- By Pasha Published Date - 02:43 PM, Tue - 5 November 24

KTR : ఉచిత బస్సు ప్రయాణ స్కీంకు తాము వ్యతిరేకం కాదని.. ఆటో డ్రైవర్లకు ప్రతినెలా ఇస్తామన్న డబ్బులు ఇవ్వాలని మాత్రమే కాంగ్రెస్ సర్కారును కోరుతున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద ఆటో డ్రైవర్ల మహాధర్నాలో ఆయన మాట్లాడారు. గతంలో ఆటో డ్రైవర్లు రోజుకు 2 వేలు సంపాదించే పరిస్థితి ఉండేదని.. ఇప్పుడు రెండు వందలు కూడా సంపాదించలేని పరిస్థితి వచ్చిందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆటోడ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుందని తాను ఎన్నడూ అనుకోలేదన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న ఆటో డ్రైవర్ల పేర్లను తాము శాసన సభలో చదివి వినిపించామని.. అయినా వారి కుటుంబాలను కాంగ్రెస్ సర్కారు ఆదుకోలేదని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలోని దాదాపు ఆరున్నర లక్షల మంది ఆటోడ్రైవర్ల పరిస్థితి చాలా దయనీయంగా ఉందని చెప్పారు.
Also Read :US Election Winner : కాబోయే అమెరికా అధ్యక్షుడిపై హిప్పోల జోస్యం.. వీడియో వైరల్
‘‘గతేడాది రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చి ఆటో ఎక్కి ఆటో డ్రైవర్ల సమస్యలు తీరుస్తానని రంగుల కలను చూపించారు. నెలకు వెయ్యి రూపాయలు ఇస్తామన్నారు. ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. అవన్నీ ఎందుకు అమలు చేయడం లేదు’’ అని కేటీఆర్(KTR) ప్రశ్నించారు. ఈ నిరసన ప్రదేశానికి ఆటో డ్రైవర్లు ఎక్కువ మంది రాకుండా పోలీసులు అడ్డుకున్నారని ఆరోపించారు. దయచేసి ఆవిధంగా చేయొద్దని పోలీసులకు ఆయన సూచించారు. పోలీసులు డ్యూటీలు చేయాలని.. పేద వాళ్ల పట్ల దయతో వ్యవహరించాలన్నారు. ‘‘సెక్యూరిటీ లేకుండా బయటకు వెళితే రేవంత్ రెడ్డిపై దాడి జరిగే పరిస్థితి ఉంది. అందుకే ఆయనకు భయం పట్టుకుంది. రేవంత్ రెడ్డికి పోలీసులపై కూడా నమ్మకం లేక సెక్యూరిటీలో నుంచి బెటాలియన్ పోలీసులను తీసేశారు’’ అని కేటీఆర్ విమర్శించారు. మెయిన్ స్ట్రీమ్ మీడియా భయపడకుండా.. పోరాటం చేసే వాళ్ల సమస్యలకు మద్దతుగా నిలవాలని ఆయన కోరారు. మహాలక్ష్మి పేరుతో మహిళలకు ప్రతినెలా రూ. 2500 ఇస్తామని ఇచ్చిన హామీని కాంగ్రెస్ సర్కారు నెరవేర్చాలని డిమాండ్ చేశారు.