TG Municipal Elections Results : మున్సిపాలిటీలో స్వీపర్‌గా పనిచేసే మహిళ..ఈరోజు కౌన్సిలర్‌గా అడుగు
మున్సిపాలిటీలో ఆమె ఏళ్లుగా స్వీపర్‌గా పనిచేసి 2019లో రిటైర్ అయ్యారో, ఇప్పుడు అదే మున్సిపాలిటీలో గౌరవప్రదమైన కౌన్సిలర్ హోదాలో అడుగుపెట్టబోతున్నారు
- Author : Sudheer
Date : 14-02-2026 - 1:39 IST
Published By : Hashtagu Telugu Desk
TG Municipal Elections Results : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాజకీయ ముఖచిత్రాన్ని మార్చడమే కాకుండా, సామాన్యుల సాధికారతకు నిదర్శనంగా నిలిచాయి. సంపన్నులు, హేమాహేమీలు కోట్లు ఖర్చు చేసిన చోట.. శ్రమనే నమ్ముకున్న సామాన్యులు విజయం సాధించడం విశేషం.
స్వీపర్ నుంచి కౌన్సిలర్‌గా.. బజ్జీల బండి నుంచి మున్సిపాలిటీకి!
తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు ఈసారి ప్రజాస్వామ్యానికి కొత్త అర్థాన్ని ఇచ్చాయి. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీలో ఇంజమూరి వెంకటమ్మ సాధించిన విజయం ఒక సంచలనం. ఏ మున్సిపాలిటీలో ఆమె ఏళ్లుగా స్వీపర్‌గా పనిచేసి 2019లో రిటైర్ అయ్యారో, ఇప్పుడు అదే మున్సిపాలిటీలో గౌరవప్రదమైన కౌన్సిలర్ హోదాలో అడుగుపెట్టబోతున్నారు. పదో వార్డులో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన ఆమె, కేవలం 10 ఓట్ల స్వల్ప మెజారిటీతో విజయం సాధించినా.. ఆమె ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం. తను శుభ్రం చేసిన మున్సిపాలిటీలోనే పాలన చేసే అవకాశం రావడం నిజమైన సామాన్యుడి గెలుపుగా స్థానికులు అభివర్ణిస్తున్నారు.
అదేవిధంగా ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో గుబిడే నాగుబాయి గెలుపు కూడా అద్భుతమనే చెప్పాలి. ఒకప్పుడు ఇళ్లలో పనులు చేస్తూ, ప్రస్తుతం చిన్న బజ్జీల బండి నడుపుకుంటూ జీవనం సాగించే నాగుబాయిని స్థానిక యువత, పెద్దలు ప్రోత్సహించి ఎన్నికల బరిలోకి దింపారు. 19వ వార్డులో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన ఆమె 58 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆడంబరాలకు పోకుండా, అందరి అవసరాల్లో తోడుండే ఆమె గుణమే ఓటర్లను ఆకర్షించింది. బజ్జీల బండి నడుపుకునే సామాన్య మహిళ మున్సిపాలిటీలో ప్రజల గొంతుకగా మారడం రాజకీయాల్లో వస్తున్న మార్పుకు సంకేతం.
మరోవైపు నల్గొండ జిల్లా దేవరకొండలో తాళ్ల శ్రీధర్ గౌడ్ స్వతంత్ర అభ్యర్థిగా హ్యాట్రిక్ విజయం సాధించి చరిత్ర సృష్టించారు. 19వ వార్డులో వరుసగా 2014, 2020 మరియు ఇప్పుడు 2026లో కూడా గెలుపొంది తన పట్టును నిరూపించుకున్నారు. ఏ పార్టీ అండ లేకపోయినా, కేవలం సామాజిక సేవా కార్యక్రమాలతో ప్రజల మనసు గెలుచుకుని భారీ మెజారిటీ సాధించడం విశేషం. మొత్తంగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 66 మున్సిపాలిటీలను దక్కించుకుని ఆధిపత్యాన్ని చాటినా, వెంకటమ్మ, నాగుబాయి, శ్రీధర్ గౌడ్ వంటి వారి గెలుపు రాజకీయాల్లో డబ్బు కంటే మనుషులే ముఖ్యమని చాటిచెప్పింది.