TS: టీఆర్ఎస్ లో భగ్గుమన్న వర్గ విభేదాలు..మంత్రుల సమక్షంలోనే ఎంపీ , ఎమ్మెల్యే వాగ్వాదం..!!
- By hashtagu Published Date - 04:59 PM, Sun - 13 November 22

అధికార TRSలో వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. ఈసారి మహబూబాబాద్ టీఆర్ఎస్ లో నేతల మధ్య వాగ్వాదం తారా స్ధాయికి చేరుకుంది. కొంతకాలంగా అధికార TRSకు చెందిన ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్ కు అస్సలు పొసలడం లేదు. దీంతో విభేదాలు భయటపడుతున్నాయి. తాజాగా మంత్రుల సమక్షంలోనే వారి మధ్య వాగ్వాదం జరిగింది. జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన మెడికల్ కాలేజ్, కలెక్టర్ కార్యాలయం, టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం భననాలను CM KCR త్వరలోనే ప్రారంభించనున్నారు.
ఈ నేపథ్యంలో ఆదివారం మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి , ఎంపీ మాలోత్ కవితతోపాటు టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం పనుల పురోగతిని పరిశీలించేందుకు వెళ్లారు. ఈ సమయంలోనే ఎంపీ కవిత (mp kavitha) ఎమ్మెల్యే శంకర్ నాయక్ మధ్య వాగ్వాదం నెలకొంది. పార్టీ కార్యాలయ పనుల గురించి మంత్రులకు వివరిస్తున్న సందర్భంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. కాంట్రాక్టర్ ఎలాంటి సంబంధం లేదని..తానే సొంతంగా పనులను చేపట్టానని ఎమ్మెల్యే శంకర్ నాయక్ చెప్పడంతో….పార్టీ కార్యాలయం నిధులను పార్టీ భరిస్తుంది…ఎవరి జేబులో నుంచి రూపాయి పెట్టడం లేదని కవిత అన్నట్లుగా సమాచారం.
ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య వాగ్వాదం నెలకొంది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు జోక్యం చేసుకుని గొడవ సద్దుమణిగించేలా చేశారు. దీంతో మహబూబాబాద్ రాజకీయా విభేదాలు మరోసారి బయటపడ్డాయి. అంతకుముందు రైతు దీక్షలో సత్యవతి రాథోడ్, కవిత, శంకర్ నాయక్ ల మధ్య విబేధాలు బయటపడిన సంగతి తెలిసిందే.