Modi Telangana : మోడీపై భగ్గుమన్న తెలంగాణ
పార్లమెంట్ లో ప్రధాని చేసిన వ్యాఖ్యలతో తెలంగాణ భగ్గుమంది. పీసీసీ చీఫ్ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మోడీ దిష్టిబొమ్మ లను తగుల పెట్టారు.
- By CS Rao Published Date - 10:20 AM, Wed - 9 February 22

పార్లమెంట్ లో ప్రధాని చేసిన వ్యాఖ్యలతో తెలంగాణ భగ్గుమంది. పీసీసీ చీఫ్ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మోడీ దిష్టిబొమ్మ లను తగుల పెట్టారు. రాజకీయంగా వచ్చిన అనుకూల అంశాన్ని దుకుడుగా తీసుకువెళ్లాలని కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోంది. మోడీ కామెంట్స్ తరువాత తెలంగాణలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. తెలంగాణ వ్యాఫ్తంగా నరేంద్ర మోడీ దిష్టిబొమ్మలను దగ్ధం చేస్తూ, హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ నాయకులు మోడీ దిష్టిబొమ్మలను తగులబెట్టారు. నాంపల్లిలోని గాంధీ భవన్ ఎదురుగా మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మోడీ, బీజేపీ డౌన్‌డౌన్ అంటూ నినదించారు.రాష్ట్ర విభజన తరువాత తలెత్తిన సమస్యలను ప్రధాని మోడీ ఏనాడూ పరిష్కరించడానికి ఆసక్తి చూపలేదని ఆరోపించారు. తెలంగాణ ప్రజల మనోభావాలను కించపరిచేలా పార్లమెంట్ సాక్షిగా అబద్ధాలు మాట్లాడారని మండిపడ్డారు. కోట్లాదిమంది ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉన్న తెలంగాణ అంశాన్ని తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం మోడీ లేవనెత్తారని విమర్శించారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అంగీకరించిన తరువాతే విభజన చోటుచేసుకుందని అన్నారు.
తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించి..కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిందే తప్ప- ఓట్ల కోసమో.. రాజకీయ ప్రయోజనాల కోసమో కాదని కాంగ్రెస్ నాయకులు అన్నారు. కోట్లాదిమంది తెలంగాణ ప్రజల ఆకాంక్షలను తమ పార్టీ నెరవేర్చిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏం చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన చోటు చేసుకుని ఏడు సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ.. సమస్యలను పరిష్కరించడానికి మోడీ ఎందుకు సిద్ధంగా లేరని నిలదీశారు. ఇప్పటివరకు ఇలాంటి అవకాశం కాంగ్రెస్ కు రాలేదు. పార్లమెంట్ వేదికగా మోడీ తెలంగాణ కాంగ్రెస్ కు అస్త్రాన్ని అందించాడు. వాస్తవంగా తెలంగాణ సెంటిమెంట్ గౌరవిస్తూ సోనియా రాష్ట్రాన్ని ఇచ్చింది. ఆమె ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాజకీయంగా ఏపీలో నష్టం జరుగుతుందని తెలిసి కూడా విభజన చేసింది. ఆ రోజు పార్లమెంట్ తలుపులు మూసి చీకట్లో బిల్లుని ఆమోదించారు. ఏపీ గురించి ఏ మాత్రం చర్చ లేకుండా విభజన చేశారు. ఏక పక్షంగా రాష్ట్రాన్ని విడతీయడానికి సోనియా కారణం. ఆ విషయాన్ని గ్రహించిన ఏపీ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఉనికి లేకుండా చేశారు. కానీ, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ను తెలంగాణ ప్రజలు ఆదరించ లేదు. రెండు చోట్లా కాంగ్రెస్ దెబ్బతింది. ఇప్పుడికి కొలుకోలేదు. ఆ విషయాన్ని మోడీ పార్లమెంట్ వేదికగా చెప్పాడు. దీంతో ఇప్పుడైనా తెలంగాణ ప్రజలను ఆలోచింప చేయలని కాంగ్రెస్ దూకుడు ప్రదర్శన చేస్తుంది. ఇవే నిరసనలు మరిన్ని రోజులు చేయాలని ప్లాన్ చేస్తుంది. అందరూ ఈ అంశంపై ఒకటిగా పోరాడితే బీజేపీ హైప్ కు తెలంగాణ లో కాంగ్రెస్ బ్రేక్ వేయడానికి అవకాశం ఉంది.