Meenakshi Natarajan: అందరివాదనలు వింటాం.. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై మీనాక్షి నటరాజన్
కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం రాజకీయ దుమారం రేపుతున్న నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ స్పందించారు.
- By News Desk Published Date - 09:39 PM, Sat - 5 April 25

Meenakshi Natarajan: తెలంగాణలో కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. చెట్లను నరికివేయడంతో అక్కడి వన్యప్రాణులు చెల్లాచెదురయ్యాయంటూ జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం రాజకీయ దుమారం రేపుతున్న నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ స్పందించారు. శనివారం సచివాలయంలోని డిప్యూటీ సీఎం ఛాంబర్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబులతో ఆమె సమావేశం అయ్యారు. వారి నుంచి పూర్తి విషయాలు తెలుసుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.
Also Read: Secretariat : తెలంగాణ సచివాలయంలో భద్రతా వైఫల్యం
పర్యావరణ పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. కంచ గచ్చిబౌలి వ్యవహారంపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ కమిటీతో అన్ని అంశాలపై చర్చలు జరుపుతున్నామని తెలిపారు. అందరి వాదనలను పరిగణనలోకి తీసుకుంటామని, ఆ తర్వాత తగిన నిర్ణయం తీసుకుంటామని ఆమె వెల్లడించారు. ఎవరికీ నష్టం వాటిల్లకుండా వివాదాన్ని పరిష్కరించాలనేది తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. విద్యార్థుల లేఖలపై సమాచారం సేకరిస్తామని మీనాక్షి నటరాజన్ హామీ ఇచ్చారు. ప్రతిపక్షాల ఆరోపణల్లోని వాస్తవాలను ప్రజలకు తెలియజేసేందుకు ప్రయత్నిస్తామని అన్నారు.
హెచ్‌సీయూ వర్శిటీకి ఆనుకుని ఉన్న కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిపై తీవ్ర వివాదం నడుస్తోన్న విషయం తెలిసిందే. చట్టప్రకారం ఈ భూమి ప్రభుత్వానిదని ప్రభుత్వం చెబుతుండగా.. అది వర్శిటీ భూమి అంటూ హెచ్‌సీయూ విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు. విద్యార్థుల ఆందోళనకు ప్రతిపక్షాలు మద్దతు ఇవ్వడంతో గచ్చిబౌలి భూ వివాదం పొలిటికల్ టర్న్ తీసుకొని తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
హెచ్‌సీయూ వ్యవహారంపై మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందించారు. కార్యకర్తల సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ.. హెచ్‌సీయూ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి సరైంది కాదని అన్నారు. ఈ సందర్భంగా హెచ్‌సీయూ విద్యార్థులు, వారికి అండగా నిలిచిన పార్టీలకు కేసీఆర్ అభినందనలు తెలిపారు. హెచ్‌సీయూ ఉదంతాన్ని ప్రభుత్వం గుణపాఠంగా తీసుకోవాలని అన్నారు.