Medaram Jatara: నేడు సమ్మక్క ఆగమనం!
తెలంగాణ కుంభమేళ అయిన మేడారం జాతరకు భక్తులు పొటెత్తుతున్నారు. దాదాపు కోటికిపైగా భక్తులు వస్తారని అధికారుల అంచనా. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, చత్తస్ ఘడ్ ప్రాంతాల నుంచి భక్తుల బారులు తీరారు.
- By Balu J Published Date - 12:31 PM, Thu - 17 February 22

తెలంగాణ కుంభమేళ అయిన మేడారం జాతరకు భక్తులు పొటెత్తుతున్నారు. దాదాపు కోటికిపైగా భక్తులు వస్తారని అధికారుల అంచనా. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, చత్తస్ ఘడ్ ప్రాంతాల నుంచి భక్తుల బారులు తీరారు. భక్తుల రాకతో మేడారం జనసంద్రమైంది. జాతీయ రహదారులు, రోడ్లు వాహనాలతో కిక్కిరిసిపోయాయి. ఎటూచూసినా జనం తండోపతండాలుగా తరలివస్తున్నారు. జంపన్నవాగు పుణ్య స్నానాలు ఆచరించి, వనదేతలకు బెల్లం కానుకగా సమర్పించి మొక్కలు చెల్లించుకుంటున్నారు. సమ్మక్క, సారలమ్మ చల్లగా చూడమ్మా.. అంటూ ప్రత్యేక పూజలు చేస్తున్నారు. మేడారం జాతరలో తొలి ఘట్టం అంగరంగ వైభవంగా ఆరంభమైంది. మేడారం గద్దె పైకి సారలమ్మ చేరడంతో భక్తులు పరవశించిపోయారు. నేడు చిలకలగుట్ట నుంచి సమ్మక్క ఆగమనం కానుంది. ఆదివాసీ పూజారులు సారలమ్మ తండ్రి పగిడిద్దరాజును, భర్త గోవిందరాజులును కూడా వేర్వేరు ప్రాంతాల నుంచి ఊరేగింపుగా తోడ్కొని వచ్చి గద్దెలపై ప్రతిష్ఠించడంతో భక్త కోటి పరవశించింది.
మేడారం జాతరలో అద్భుత సన్నివేశంగా భావించే సమ్మక్క గద్దెలపైకి చేరే ఘట్టం గురువారం జరగనుంది. ముందుగా సమ్మక్క ప్రధాన పూజారులు, వడ్డెలు మేడారం సమీపంలో ఉన్న సమ్మక్క ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సాయంత్రం చిలుకలగుట్టపై ఉన్న సమ్మక్కను తీసుకువచ్చేందుకు వెళ్తారు. భక్తులు ఎదురెళ్లి స్వాగతం పలుకుతుండగా.. వడ్డె కొక్కెర కృష్ణయ్య సమ్మక్కను భరిణె రూపంలో గద్దెల వద్దకు తెచ్చి ప్రతిష్టించాక భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. వన దేవతలు నలుగురు గద్దెలపైకి చేరుకోవడంతో గురువారం రాత్రి నుంచి భారీ సంఖ్యలో భక్తులు మేడారం వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. మహాజాతర ప్రారంభం కావడంతో బుధవారం మేడారం ప్రాంతంలోని జంపన్నవాగు, కొత్తూరు, నార్లాపూర్, కన్నెపల్లి, రెడ్డిగూడెం, ఊరట్టం తదితర పరిసర ప్రాంతాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. పుణ్యస్నానాలతో జంపన్నవాగు జనంతో నిండిపోయింది. లక్షలాదిగా వస్తున్న భక్తులతో అడవి దారులన్నీ పోటెత్తాయి. మేడారం నలువైపులా కిలోమీటర్ల మేర దారులు వాహనాలు, భక్తులతో నిండిపోయాయి.