Maoists Letter : సీఎం రేవంత్‌కు మావోయిస్టుల లేఖ.. ఏ అంశంపై అంటే..
Maoists Letter : తెలంగాణలోని సీఎం రేవంత్ సర్కారుకు మావోయిస్టులు లేఖ రాశారు.
- By Pasha Published Date - 01:13 PM, Tue - 6 February 24

Maoists Letter : తెలంగాణలోని సీఎం రేవంత్ సర్కారుకు మావోయిస్టులు లేఖ రాశారు. మేడారం జాతరకు వచ్చిన ప్రజలకు సౌకర్యాలను కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం జాతరను నిర్వహించడంపై నిర్లక్ష్యం వహించడం సరికాదన్నారు. ఈమేరకు మావోయిస్టు డివిజన్ కమిటీ (జయశంకర్ – వరంగల్ – మహబూబాబాద్ – పెద్దపల్లి) కార్యదర్శి వెంకటేశ్ ఓ ప్రకటన విడుదల చేశారు. మేడారం జాతరను ప్రభుత్వం చేతుల్లోకి తీసుకొని.. ఆదివాసీల పాత్రను నామమాత్రంగా మార్చిందని మావోయిస్టులు ఆందోళన వ్యక్తం చేశారు. జాతరకు వచ్చే కోట్లాది భక్తుల ద్వారా భారీగా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతోందని.. ఆ ఆదాయాన్ని ఆదివాసీల డెవలప్మెంట్ కోసం ఖర్చు చేయకుండా ఇతరత్రా పనులకు దారిమళ్లిస్తున్నారని మావోయిస్టులు ఆరోపించారు.
We’re now on WhatsApp. Click to Join
జాతరకు సంబంధించిన పనులను ప్రభుత్వం చాలా ఆలస్యంగా కాంట్రాక్టర్లకు అప్పగించడంతో వారు ఎంతో నిర్లక్ష్యంగా, నాసిరకంగా పనులు చేస్తున్నారని విమర్శించారు. ఆ పనులపై పర్యవేక్షణ కూడా లేకుండాపోయిందన్నారు. మరుగుదొడ్లు, పారిశుధ్య పనులు కూడా మేడారంలో చేయకపోవడంతో భక్తులు తీవ్ర అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్నారని మావోయిస్టులు తెలిపారు. మేడారం జాతరను ఆదివాసీ సంప్రదాయాలతో నిర్వహించాలని డిమాండ్ చేశారు. హిందూ సంప్రదాయాలైన లడ్డు, పులిహోర కాకుండా బెల్లాన్ని ప్రసాదంగా ఇవ్వాలని తెలిపారు. జాతర అయిన వెంటనే ఆ ప్రాంతంలో యుద్ధ ప్రాతిపదికన పారిశుధ్య పనులు చేయించాలని ప్రభుత్వాన్ని కోరారు. జాతర పనుల కోసం వదిలిపెట్టిన పంటపొలాలకు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పారు. పంటపొలాల్లో పేరుకుపోయే చెత్త, మద్యం సీసాలు, ఇతర వ్యర్థాలను తొలగించే బాధ్యతను రాష్ట్ర సర్కారే చేపట్టాలన్నారు.
Also Read : YCP : వైసీపీ నేతలు.. పవన్ కళ్యాణ్ ను రెచ్చగొట్టాలని చూస్తున్నారా..?
లాంచర్ల తయారీలో మావోయిస్టులు..!
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా-బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లో సీఆర్పీఎఫ్ కోబ్రా బలగాలపై మావోయిస్టుల మెరుపుదాడి ఘటనలో విస్మయం కలిగించే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. టేకులగూడెం అటవీప్రాంతంలోని సీఆర్‌పీఎఫ్ బేస్‌క్యాంపు సమీపంలో మూడు రోజుల క్రితం భద్రతబలగాలపై చేసిన దాడిలో మావోయిస్టులు బ్యారెల్ గ్రెనేడ్ లాంచర్ల(బీజీఎల్)ను వినియోగించారు. అయితే వాటిని సొంతంగానే తయారు చేస్తున్నట్లు తేలడం ఆందోళన కలిగించే అంశంగా మారింది. బీజీఎల్‌తోపాటు ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్(ఐఈడీ)లను సొంతంగానే కర్మాగారాల్లో తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. టేకులగూడెం అడవుల్లో దాడి అనంతరం మావోయిస్టుల సొరంగాన్ని పోలీసులు గుర్తించిన సంగతి తెలిసిందే.
ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో..
ఆ ప్రాంతానికి సమీపంలోనే భారీగా ఆయుధాల డంప్‌ను భద్రతబలగాలు స్వాధీనం చేసుకోగా వీటిలో పదుల సంఖ్యలో బీజీఎల్‌లు లభించడం గమనార్హం. వాటి నిర్మాణశైలిని బట్టి మావోయిస్టులు సొంతంగానే తయారు చేస్తున్నట్లు గుర్తించారు. దండకారణ్యంలోని అబూజ్‌మడ్ అడవుల్లో వీటిని తయారు చేస్తున్నట్లు భావిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో మావోయిస్టులను కట్టడి చేసే వ్యూహంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి 4 కి.మీ.లకు ఒకటి చొప్పున సీఆర్పీఎఫ్ బేస్‌క్యాంపులను విస్తృతం చేస్తున్న సంగతి తెలిసిందే. దీన్ని అడ్డుకునేందుకు మావోయిస్టులూ గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బేస్‌క్యాంపులపై దాడులకు వ్యూహరచన చేస్తున్నట్లు నిఘావర్గాలకు సమాచారం అందింది. తాజాగా మావోయిస్టుల సొరంగం ఏర్పాటు వెనక అదే ఉద్దేశమున్నట్లు భావిస్తున్నారు. మరోవైపు ఆయుధాలనూ భారీగా సమకూర్చుకోవడంలోనూ మావోయిస్టులు నిమగ్నమయ్యారనే విషయం ఇటీవల దాడితో తేటతెల్లమైంది.