Attack : తండ్రి అనే పదానికి మచ్చ తెచ్చిన నీచుడు..కన్న కూతురుపై శాడిజం
Attack : బాలిక, చైల్డ్ హెల్ప్‌లైన్ 1098కు ఫోన్ చేసి తన కష్టాన్ని తెలియజేసింది. వెంటనే స్పందించిన చైల్డ్ లైన్ అధికారులు, ఐసిడిఎస్ సూపర్‌వైజర్ సక్కుబాయి బాలికను కలసి వివరాలు సేకరించారు
- By Sudheer Published Date - 03:29 PM, Wed - 23 July 25

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాక(Saarapaaka)లో ఒక అమానవీయ ఘటన వెలుగుచూసింది. “తండ్రి” అనే పవిత్ర పదానికి మచ్చ తెచ్చేలా, కన్నకూతురిపై శాడిజంగా ప్రవర్తించిన రమేష్ అనే వ్యక్తి చేసిన దాడితో అందరిని కలిచివేశాడు. డాడీ కొట్టొద్దని కన్నీళ్లతో వేడుకున్నా, మద్యం మత్తులో ఉన్న రమేష్ తన మానసిక రోగత్వాన్ని బయటపెట్టాడు. ఈ అమానవీయ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర కలకలం రేపుతోంది.
వివరాల్లోకి వెళితే.. రమేష్ అనే వ్యక్తి నిత్యం మద్యం మత్తులో ఉండటం అతని కుటుంబానికి పెద్ద నరకంగా మారింది. ఒకరోజు ఇంటికొచ్చి తన కన్న కూతురిపై నీచంగా ప్రవర్తించాడు. తన కూతురిని కాలితో తన్ని, చిత్రహింసలకు గురిచేసాడు. అమ్మానాన్న ప్రేమలో భాగమవాల్సిన బాల్యం.. అతడి చేతుల్లో బాధగా మారింది. శాడిజంతో ఆ దృశ్యాన్ని వీడియోగా రికార్డు చేసి, దాన్ని తన వాట్సాప్ స్టేటస్‌లో పెట్టడం ఎంతటి మానసిక అస్థిరతను సూచిస్తుందో చెప్పక్కర్లేదు.
ఈ దారుణ ఘటనను భరించలేకపోయిన బాలిక, చైల్డ్ హెల్ప్‌లైన్ 1098కు ఫోన్ చేసి తన కష్టాన్ని తెలియజేసింది. వెంటనే స్పందించిన చైల్డ్ లైన్ అధికారులు, ఐసిడిఎస్ సూపర్‌వైజర్ సక్కుబాయి బాలికను కలసి వివరాలు సేకరించారు. బాధిత బాలికకు మానసిక స్థిరత్వం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. తండ్రి తీరుపై స్థానికంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. చట్టపరంగా అతనిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ఈ ఘటన తల్లిదండ్రుల బాధ్యత, మానవత్వంపై తీవ్రమైన ప్రశ్నలు లేపుతోంది. ఒక తండ్రి కన్న కూతురిపై ఇలాంటి చర్యకు దిగడం బాధాకరం మాత్రమే కాదు, సమాజానికి మచ్చకాయ కూడా. పిల్లల భద్రత కోసం ఈ తరహా వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుని, పాఠం నేర్పించేలా చట్టం పని చేయాలి. పిల్లలు భయపడకుండా జీవించే హక్కు ఉన్న సమాజం కోసం ఇది సజీవ ఉదాహరణగా నిలవాలి.