Chevella Bus Accident : చేవెళ్ల బస్సు ప్రమాదానికి ప్రధాన కారణాలు ఇవే..
Chevella Bus Accident : రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మిర్జాగూడ సమీపంలో జరిగిన బస్సు ప్రమాదం తెలుగు ప్రజలను తీవ్ర విషాదంలో ముంచేసింది.
- By Sudheer Published Date - 05:54 PM, Mon - 3 November 25
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మిర్జాగూడ సమీపంలో జరిగిన బస్సు ప్రమాదం తెలుగు ప్రజలను తీవ్ర విషాదంలో ముంచేసింది. సోమవారం ఉదయం జరిగిన ఈ ఘోర ఘటనలో 19 మంది ప్రాణాలు కోల్పోవడం, మరో 35 మంది గాయపడటం రాష్ట్రాన్ని షాక్‌కు గురిచేసింది. తాండూరు నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును, ఎదురుగా రాంగ్ రూట్‌లో వస్తున్న కంకర లారీ ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఢీకొట్టిన వేళ లారీ బస్సుపైనే పడటంతో, బస్సులో ఉన్న ప్రయాణికులు కంకర కింద చిక్కుకున్నారు. రక్షణ చర్యలు చేపట్టినప్పటికీ, మృతుల సంఖ్య వేగంగా పెరిగింది. బస్సు డ్రైవర్, లారీ డ్రైవర్ కూడా ప్రాణాలు కోల్పోయారు.
Kranti Goud: ఆ మహిళా క్రికెటర్‌కు రూ. కోటి నజరానా ప్రకటించిన సీఎం!
ప్రమాదానికి అనేక కారణాలు ఉన్నట్లు అధికారుల ప్రాథమిక నివేదిక చెబుతోంది. టిప్పర్ లారీ ఓవర్‌లోడ్ అయి ఉండటమే కాకుండా, అనుమతించని మార్గంలో, అధిక వేగంతో ప్రయాణించింది. 35 టన్నుల సామర్థ్యమున్న లారీలో 60 టన్నుల కంకర నింపడంతో వాహనం అదుపు తప్పింది. రోడ్డుపై ఉన్న గొయ్యి, మలుపు ప్రాంతం, రాంగ్ రూట్ ప్రయాణం ఇలా అన్ని ప్రమాదానికి దారి తీశాయి. బస్సులో అనుమతిపైగా ప్రయాణికులు ఉన్నారు. టిప్పర్‌పై టార్పాలిన్ లేకపోవడంతో కంకర నేరుగా బస్సుపైన పడింది. ఈ నిర్లక్ష్యాలు వాహన పరిశీలన వ్యవస్థలో ఉన్న లోపాలను బయటపెట్టాయి. సీసీటీవీ ఫుటేజ్‌లో కూడా లారీ తప్పు దారి నుంచి వచ్చినట్లు స్పష్టంగా కనిపించడంతో, ట్రాఫిక్ పర్యవేక్షణలో పెద్ద తేడాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించింది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా, గాయపడిన వారికి రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. అయినా ప్రజల ఆవేదన మాత్రం తగ్గలేదు. స్థానికులు “రోడ్డు భద్రతా పరికరాలు లేకపోవడం, వాహనాల రూట్ తనిఖీలు సరిగా జరగకపోవడం” కారణంగా ఇలాంటి ప్రమాదాలు పెరుగుతున్నాయని విమర్శిస్తున్నారు. నిపుణులు ప్రభుత్వం ట్రాఫిక్ పర్యవేక్షణను ఆధునిక సాంకేతికతతో బలోపేతం చేయాలని, ఓవర్‌లోడింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్‌లపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. చేవెళ్ల దుర్ఘటన కేవలం ఒక ప్రమాదం కాదు,ఇది రోడ్డు భద్రతను పునరాలోచించాల్సిన అవసరాన్ని దేశానికి గుర్తు చేసింది.