Modi : బీఆర్ఎస్ స్టీరింగ్ కేసీఆర్ చేతుల్లోనే ఉంది..బీజేపీ స్టీరింగే అదాని చేతిలోకి వెళ్లింది – కేటీఆర్
బీఆర్‌ఎస్ పార్టీ స్టీరింగ్ కేసీఆర్ చేతుల్లో పదిలంగానే ఉందని.. కానీ బీజేపీ స్టీరింగ్ అదాని చేతిలోకి వెళ్లిపోయిందంటూ సెటైర్లు వేశారు
- By Sudheer Published Date - 08:37 PM, Sun - 1 October 23

ప్రధాని మోడీ (Modi) ఆదివారం పాలమూరు జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి..అనంతరం భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్బంగా బిఆర్ఎస్ , కాంగ్రెస్ పార్టీల ఫై విమర్శలు చేసారు. ‘రుణమాఫీ చేస్తామని రాష్ట్ర ఫ్రభుత్వం మాట తప్పింది. కాంగ్రెస్ (Congress) – బీఆర్ఎస్ (BRS) రెండూ కుటుంబపార్టీలే. కరప్షన్, కమీషన్ అనే సిద్ధాంతాల మీద తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోంది. ప్రజాస్వామ్య వ్యవస్థను కుటుంబ వ్యవస్థగా మార్చారు. తెలంగాణ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోంది. కాలువలు ఉన్నా వాటిలో నీరు ఉండదు. రైతు పథకాల పేరుతో తెలంగాణ సర్కారు అక్రమాలకు పాల్పడుతోంది.
తెలంగాణ ప్రభుత్వ కారు స్టీరింగ్ వేరే వాళ్ల చేతిలో ఉంది. మీకు తెలుసుకదా స్టీరింగ్ ఎవరు తిప్పుతున్నారో?.తెలంగాణ ప్రభుత్వాన్ని 2 కుటుంబాలు నడిపిస్తున్నాయి. కరప్షన్, కమిషన్ ఆ రెండు పార్టీల విధానం. పార్టీ ఆఫ్ ది ఫ్యామిలీ, బై ది ఫ్యామిలీ,.. ఫర్ ది ఫ్యామిలీ అన్నది వాళ్ల నినాదం. ప్రజాస్వామ్యాన్ని వాళ్లు కుటుంబవాదంగా మార్చారు. ఆ పార్టీలో అందరూ ఆ కుటుంబంలోని వాళ్లే. ప్రతి కీలక పదవిలో కుటుంబంలోని వాళ్లే కూర్చుంటారు. పార్టీలో ప్రతి నిర్ణయం వాళ్ల చేతిలోనే ఉంటుందంటూ మోడీ విమర్శలు చేసారు.
Read Also: TSRTC : దసరా స్పెషల్ బస్సుల్లో ఒక్క రూపాయి కూడా అదనపు ఛార్జ్ లేదు
మోడీ విమర్శలపై బిఆర్ఎస్ మంత్రి కేటీఆర్ (KTR) ట్విట్టర్ వేదికగా స్పందించారు. బీఆర్‌ఎస్ పార్టీ స్టీరింగ్ కేసీఆర్ చేతుల్లో పదిలంగానే ఉందని.. కానీ బీజేపీ స్టీరింగ్ అదాని చేతిలోకి వెళ్లిపోయిందంటూ సెటైర్లు వేశారు. కేంద్రం కిసాన్ సమ్మాన్ కింద ఇచ్చింది కేవలం నామమాత్రం కానీ.. ఒక చిన్న రాష్ట్రమైన తెలంగాణ కొత్త రాష్ట్రమైనప్పటికీ 70 లక్షల మంది రైతులకు 72 వేల కోట్లను నేరుగా ఖాతాల్లో వేసిన విషయం తెలుసుకుంటే మంచిది మోడీకి సూచించారు. రైతుల రుణమాఫీ జరగనే లేదని మాట్లాడటం.. మిలియన్ డాలర్ జోక్ అని, స్వతంత్ర భారత చరిత్రలోనే ఒక కొత్త రాష్ట్రం రెండుసార్లు రైతుల రుణమాఫీకి నడుం బిగించిన ఏకైక సందర్భమని.. అది తెలంగాణలోనే ఆవిష్కృతమైందన్నారు. అన్నదాత అప్పులు మాఫీ చేసిన జైకిసాన్ ప్రభుత్వం మాదని.. కార్పొరేట్ దోస్తులకు 14.5 లక్షల కోట్ల రుణాలు రద్దు చేసిన నై కిసాన్ సర్కారు మీది అంటూ విమర్శించారు. కర్షకుల రక్తం కండ్ల జూసిన రైతుహంతక రాజ్యం బీజేపీదని, పదేళ్లపాటు విభజన హామీలను పాతరేసి.. ఎన్నికల హామీలను గాలికి వదిలేసి ఓట్ల వేటలో ఇప్పుడొచ్చి మాట్లాడితే నమ్మేదేవరని చురకలంటించారు.
నమో అంటే నమ్మించి మోసం చేయడం అని తెలంగాణ ప్రజలకు తెలుసు
తెలంగాణ ప్రజలు కాదు..
జాతీయస్థాయిలో అధికార
మార్పు కావాలని కోరుతోంది దేశ ప్రజలు..BRS పార్టీ స్టీరింగ్
కేసీఆర్ గారి చేతిలోనే పదిలంగా ఉంది.
కానీ బిజెపి స్టీరింగ్..
అదాని చేతిలోకి వెళ్లిపోయింది.మీరు కిసాన్ సమాన్ కింద…
— KTR (@KTRBRS) October 1, 2023