Hydraa : ముందు హైడ్రా..GHMC ఆఫీసులను కూల్చాలని కేటీఆర్ డిమాండ్
Hydraa : ఇందిరమ్మ రాజ్యంలో మీరు ఇండ్లు కట్టిస్తరని ప్రజలు ఓట్లు వేశారు. ఇందిరమ్మ ఇండ్లని మీరే చెప్పారు. కానీ, పేదల ఇండ్లుకూలగొడతమని చెప్పుంటే ఒక్కరంటే ఒక్కరు కాంగ్రెస్‌కు ఓటు వేస్తుండెనా..?
- By Sudheer Published Date - 06:53 PM, Mon - 30 September 24

కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) తీసుకొచ్చిన హైడ్రా (Hydraa) ఫై నిప్పులు చెరిగారు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ (KTR). కాంగ్రెస్ సర్కారుకు కూలగొట్టాలన్న పిచ్చితప్పా.. ఓ పద్ధతి.. ప్లానింగ్ లేదని కేటీఆర్ విమర్శించారు. హైడ్రా కూల్చివేతలు, మూసి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇందిరమ్మ రాజ్యం అన్నరు. ఇందిరమ్మ రాజ్యంలో మీరు ఇండ్లు కట్టిస్తరని ప్రజలు ఓట్లు వేశారు. ఇందిరమ్మ ఇండ్లని మీరే చెప్పారు. కానీ, పేదల ఇండ్లుకూలగొడతమని చెప్పుంటే ఒక్కరంటే ఒక్కరు కాంగ్రెస్‌కు ఓటు వేస్తుండెనా..? ఒక్కసారి ఆలోచన చేయాలని ముఖ్యమంత్రిని అడుగుతున్నా. ముఖ్యమంత్రి మూడునాలుగు రోజులుగా మీడియాకు మొఖం చాటేశాడు. లేకపోతే మీడియాతో చీట్‌చాట్‌లు చేసేవాడు. ఇప్పుడు చేస్తలేడు. ఎందుకు? భయం. అవతల ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్నది అని దీనికి భయపడే సీఎం మీడియా ముందుకు రావడం లేదన్నారు కేటీఆర్.
నిబంధనల ప్రకారం అక్రమ నిర్మాణాలను కూల్చాల్సి వస్తే, మొదట కూల్చాల్సింది హైడ్రా కమిషనర్ ఆఫీస్ , GHMC ఆఫీస్ అని కేటీఆర్ అన్నారు. హుస్సేన్ సాగర్ పక్కన ఉన్న బుద్ధ భవన్ లో హైడ్రా ఉన్న ఆఫీసును నాలా మీద కట్టారని, అలాంటప్పుడు కూల్చివేతలు ఇక్కడి నుంచే తెలంగాణ ప్రభుత్వం చేపట్టాలని సూచించారు. అదే బిల్డింగ్ లో ఎలక్షన్ కమిషనర్, మహిళా కమిషన్ ఉందన్నారు. పర్మిషన్లు ఇచ్చే జీహెచ్ఎంసీ బిల్డింగ్ సైతం నాలా మీద ఉందని, దమ్ముంటే GHMC భవనాన్ని కూల్చాలని డిమాండ్ చేశారు.
మొన్న వినాయక నిమజ్జనం సందర్బంగా సెక్రటేరియట్ వద్దకు రాగానే కేసీఆర్ పాటలు పెట్టడం, నినాదాలు చేయడంతో రేవంత్ రెడ్డికి ఇరిటేషన్ వచ్చింది. అందుకే కేసీఆర్ కట్టిన సెక్రటేరియట్ ను సైతం కూల్చివేస్తారేమో. ఓట్లు అడిగిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు. తెలంగాణ ప్రజలతో కలిసిపోయినట్లు మభ్యపెట్టారు. ఇప్పుడు హైడ్రా కూల్చివేతల బాధితుల సమస్యలు కనిపిస్తలేవా, బాధితుల ఆక్రందనలు వినిపిస్తలేవా అని కేటీఆర్ ప్రశ్నించారు. పేదల కన్నీళ్ల ధాటికి ఇబ్బందిపడుతరు కాంగ్రెస్ నాయకులారా.. పేదలతో పెట్టుకోవడం మంచిది కాదని మీ ముఖ్యమంత్రికి చెప్పాలని సూచించారు.
Read Also : Birth Control Pill: గర్భనిరోధక మాత్రలు వాడుతున్నారా..?