Rajagopal Reddy : బీజేపీకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా.. నెక్ట్స్ కాంగ్రెస్‌లోకి
Rajagopal Reddy : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి షాకిచ్చారు.
- By Pasha Published Date - 12:05 PM, Wed - 25 October 23

Rajagopal Reddy : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి షాకిచ్చారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపించిన తరుణంలో ఆయన కమలదళానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలోనే కాంగ్రెస్ లో చేరుతానని వెల్లడించారు. తన అనుచరులు, సన్నిహితుల కోరిక మేరకు పార్టీ మారాలని నిర్ణయించానని తెలిపారు. ఈమేరకు వివరాలతో రాజగోపాల్ రెడ్డి ఓ లెటర్ విడుదల చేశారు. దానిలో ఏముందంటే.. ‘‘కేసీఆర్ కుటుంబ పాలన నుంచి తెలంగాణను విముక్తి చేయాలనేది నా ఆశయం. మరో ఐదు వారాల్లో నా ఆశయం నెరవేరుతుందని భావిస్తున్నాను. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉంది. ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. ఏడాదిన్నర క్రితం తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదిగిన బీజేపీ, ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో డీలా పడింది. ఇప్పుడు తెలంగాణ ప్రజలు అధికార బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ను భావిస్తున్నారు. అందుకే నేను కూడా తెలంగాణ ప్రజల ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నాను’’ అని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ఇవాళ సాయంత్రం ఆయన రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది.
We’re now on WhatsApp. Click to Join.
ఫ్లాష్ బ్యాక్ లోకి వెళితే..
ఫ్లాష్ బ్యాక్ లోకి వెళితే.. కాంగ్రెస్, కమ్యూనిస్టుల పొత్తుల్లో భాగంగా మునుగోడు నుంచి ఒకవేళ సీపీఐ బరిలోకి దిగితే.. తాను స్వయంగా అక్కడ పోటీ చేస్తానని రాజగోపాల్‌రెడ్డి బీజేపీకి చెప్పినట్లు తెలుస్తోంది. ఒకవేళ అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి బరిలోకి దిగితే.. తాను ఎల్‌బీ నగర్ నుంచి పోటీ చేస్తానని, తన భార్యకు మునుగోడు టికెట్ ఇవ్వాలని రాజగోపాల్‌రెడ్డి అడిగినట్లు సమాచారం. అయితే మునుగోడు టికెట్ ఒకటే ఇస్తామని బీజేపీ నాయకత్వం ఆయనకు తేల్చి చెప్పిందని తెలిసింది.దీంతో కాంగ్రెస్‌లో చేరాలని ఆయన డిసైడ్ అయ్యారని అంటున్నారు. కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి ఎల్బీ నగర్ నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయనే ప్రచారం నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీ త్వరలో విడుదల చేయనున్న సెకండ్ లిస్టులోనే రాజగోపాల్ రెడ్డిని ఎక్కడి నుంచి బరిలోకి దింపుతారనే దానిపై క్లారిటీ వస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
మునుగోడు నుంచి బూర నర్సయ్యగౌడ్..
ఇక మునుగోడు నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్థానంలో బూర నర్సయ్యగౌడ్‌ను బరిలోకి దింపేందుకు బీజేపీ రెడీ అవుతోంది. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో బీసీ జనాభా చాలా ఎక్కువ. ఈ నియోజకవర్గంలో గౌడ ఓటర్లు అత్యధికంగా 35,150 మంది ఉన్నారు. నియోజకవర్గం మొత్తం ఓటర్లలో వీరు 15.94 శాతానికి సమానం. ముదిరాజు ఓటర్లు 33, 900 మంది, యాదవ ఓటర్లు 21, 360 మంది, పద్మశాలీ ఓటర్లు 11, 680 మంది, వడ్డెర ఓటర్లు 8,350 మంది, కుమ్మరి ఓటర్లు 7,850 మంది, విశ్వబ్రాహ్మణ ఓటర్లు 7,820 మంది, మున్నూరు కాపు ఓటర్లు 2,350 మంది ఉన్నారు. ఈనేపథ్యంలో బీసీ వర్గానికి చెందిన.. ప్రత్యేకించి మునుగోడులో అతిపెద్ద ఓటుబ్యాంకు కలిగిన గౌడ వర్గానికి చెందిన బూర నర్సయ్యగౌడ్‌కు అవకాశం ఇస్తే కలిసి వస్తుందని బీజేపీ ఆశిస్తోంది.