Kishan Reddy – Bandi Sanjay : కేంద్రమంత్రులుగా బాధ్యతలు చేపట్టిన కిషన్‌రెడ్డి, బండి సంజయ్
తెలంగాణ బీజేపీ ఎంపీలు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ ఇవాళ కేంద్ర మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు.
- By Pasha Published Date - 01:44 PM, Thu - 13 June 24

Kishan Reddy – Bandi Sanjay : తెలంగాణ బీజేపీ ఎంపీలు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ ఇవాళ కేంద్ర మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వారు తమ మంత్రిత్వ శాఖల(Kishan Reddy – Bandi Sanjay) పగ్గాలను చేపట్టారు. బొగ్గు, గనుల శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి వ్యవహరించనున్నారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టడానికి ముందు ఆయన ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో వెంకటేశ్వర స్వామి, కనకదుర్గమ్మ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తెలంగాణ భవన్‌లో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించారు. అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. గురుద్వారా బంగ్లా సాహిబ్‌ను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
Also Read :Finger In Ice Cream : కోన్ ఐస్‌క్రీమ్‌లో మనిషి వేలు.. ఫుడ్ లవర్‌కు షాక్.. పోలీసులకు కంప్లయింట్
అక్కడి నుంచి శాస్త్రి భవన్ ఏ-బ్లాక్‌లో ఉన్న బొగ్గు, గనుల శాఖ కార్యాలయానికి చేరుకొని కేంద్రమంత్రిగా కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో విద్యుత్ కొరత లేకుండా చేస్తామన్నారు. వ్యవసాయం నుంచి ఐటీ పరిశ్రమ దాకా ప్రతీ రంగానికి తగినంత విద్యుత్ అందేలా చూసే బాధ్యత తమ ప్రభుత్వానిది అని కిషన్ రెడ్డి వెల్లడించారు. ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ స్థానం నుంచి కిషన్ రెడ్డి రెండోసారి ఎంపీగా గెలిచారు. గతంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, పర్యాటకశాఖ మంత్రిగా కిషన్ రెడ్డి సేవలు అందించారు.
We’re now on WhatsApp. Click to Join
ఇవాళ ఉదయం 11 గంటలకు పార్లమెంటులోని నార్త్ బ్లాక్‌లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు పూల బొకే అందించి సహచర మంత్రి నిత్యానంద రాయ్ అభినందనలు తెలిపారు. భద్రతా కారణాల రీత్యా నిరాడంబరంగా సంజయ్ బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఢిల్లీలోని అధికారిక నివాసంలో బండి సంజయ్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపేందుకు తెలంగాణ నుంచి పెద్దసంఖ్యలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. సంజయ్‌ను పూలబొకేలు, శాలువాలతో సత్కరించారు. ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి బండి సంజయ్ ఎంపీగా ఎన్నికయ్యారు.