Medaram Jatara : నేడు మేడారం జాతరలో కీలక ఘట్టం.. గద్దెలపైకి పగిడిద్దరాజు, గోవిందరాజు
- Author : Kavya Krishna
Date : 21-02-2024 - 9:40 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ కుంభమేళ మేడారం జాతర (Medaram Jatara) అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన ఈ మేడారం గిరిజన జాతర రెండేళ్లకోసారి జరుగుతుంది. ఇక్కడ ప్రకృతే దేవతలు. సమ్మక్క, సారలమ్మపై భక్తులకు ఎంతో విశ్వాసం. నేటి నుంచి ఈ మహాజాతర ప్రారంభం కానుండడంతో లక్షలాది మంది భక్తలు మేడారంకు తరలివస్తున్నారు. సమ్మక్క తనయుడు జంపన్నను గిరిజన సంప్రదాయాల మధ్య మంగళవారం గద్దెపై ప్రతిష్ఠించారు. ఈ వేడుకను చూసి భక్తులు తరించారు. నేటి నుంచి 24వ తేదీ వరకు మేడారం జాతర జరుగనుంది. నాలుగు రోజులపాటు జరుగనున్న ఈ జాతరకు ఇప్పటికే లక్షలాదిమంది భక్తులు మేడారం చేరుకొని అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. అయితే నేడు జాతరలో కీలక ఘట్టమైన సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజును గద్దెకు తీసుకువస్తారు. ఈ రోజు సాయంత్రం కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయం వద్ద గిరిజనలు పూజులు చేసి సారలమ్మను గద్దె పైకి తీసుకరానున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఉత్సవ మూర్తులంతా గద్దెలపై కొలువై మూడో రోజు భక్తులకు దర్శనం ఇస్తారు. రేపు సమ్మక్క దేవతను గద్దెకు తీసుకురానున్నారు. శుక్రవారం భక్తులు మొక్కులు తీర్చుకోవడం.. ఈనెల 24న దేవతల వనప్రవేశం ఉండగా… 28వ తేదీ జాతర పూజలు ముగింపు కార్యక్రమాలు ఉంటాయి. జాతరలో చివరి రోజున దేవతలను మళ్లీ వనంలోకి పంపిస్తారు. దేవతలు వనప్రవేశం చేయడంతో మేడారం మహాజాతర పరిపూర్ణం కానుంది. అయితే.. మరోవైపు మంత్రి సీతక్క రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న మేడారం జాతరకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా 6000 ప్రత్యేక ఆర్టీసీ(TSRTC) బస్సులను నడుపుతున్నారు. జాతరకు మహాలక్ష్మి పథకం అమలు నేపథ్యంలో భక్తులకు అసౌకర్యం కలగకుండా యాజమాన్యం అన్ని చర్యలు తీసుకుంటోంది. ఈ మహాజాతరకు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలి రానుండగా.. ఈసారి దాదాపు కోటిన్నర మంది వరకు తల్లులను దర్శించుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
Read Also : IPL Cricketer: ప్రముఖ మోడల్ ఆత్మహత్య.. SRH ఆటగాడికి సమన్లు పంపిన పోలీసులు..!