Modi and KCR: అంతటా అలజడి!కేంద్రం వేటలో కేసీఆర్ నైతిక ఆట!
కేంద్ర దర్యాప్తు సంస్థలతో భయకంపితులవుతోన్న గులాబీ శ్రేణులకు తెలంగాణ సీఎం కేసీఆర్ ధైర్యాన్ని నూరిపోస్తున్నారు. రాజకీయంగా బీజేపీ చేస్తోన్న అరాచకాన్ని ప్రజలు గుర్తించారని, ప్రజా క్షేత్రంలో ఆ పార్టీని దోషిగా నిలుపుదామంటూ దిశానిర్దేశం చేస్తున్నారు.
- Author : CS Rao
Date : 23-11-2022 - 10:39 IST
Published By : Hashtagu Telugu Desk
కేంద్ర దర్యాప్తు సంస్థలతో భయకంపితులవుతోన్న గులాబీ శ్రేణులకు తెలంగాణ సీఎం కేసీఆర్ ధైర్యాన్ని నూరిపోస్తున్నారు. రాజకీయంగా బీజేపీ చేస్తోన్న అరాచకాన్ని ప్రజలు గుర్తించారని, ప్రజా క్షేత్రంలో ఆ పార్టీని దోషిగా నిలుపుదామంటూ దిశానిర్దేశం చేస్తున్నారు. దాడులను ఎదుర్కొంటోన్న లీడర్లకు నైతికంగా, చట్టపరంగా అండగా ఉంటానని హామీ ఇవ్వడం ఆ పార్టీ శ్రేణులకు ఊరట కలిగిస్తోంది.
టీఆర్‌ఎస్ నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు మరిన్ని జరిగే అవకాశం ఉందని కేసీఆర్ అంచనా వేస్తున్నారు. ఢిల్లీ పాలకుల (బీజేపీ) ఆదేశానుసారం టీఆర్‌ఎస్‌ను ఇరుకున పెట్టేందుకే ఎంపీలు, ఎమ్మెల్యేలను వేటాడుతున్నారని అభిప్రాయపడ్డారు. మంత్రులు, సీనియర్ నాయకులు ఆందోళన చెందకుండా నిలబడాలని పిలుపునివ్వడం గమనార్హం.
Also Read: TS NEWS : రైతాంగానికి శుభవార్త చెప్పిన తెలంగాణ సర్కార్..!!
గత కొద్ది రోజులుగా మంత్రులు గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబసభ్యులు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రపై జరుగుతున్న దాడులు టీఆర్ఎస్ పార్టీని ఇరుకున పెట్టే క్రమంలో జరిగినవేనంటూ కేసీఆర్ అభిప్రాయపడుతున్నారు.కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, ఆయన కుటుంబసభ్యుల నివాసాలు, విద్యాసంస్థల్లో ఐటీ సోదాల నేపథ్యంలో కొందరు మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలతో సీఎం ఫోన్‌లో మాట్లాడినట్లు తెలుస్తోంది.
మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై మంగళవారం ఐటీ దాడులు జరగడం టీఆర్‌ఎస్ వర్గాల్లో కలకలం రేపింది. గత కొద్ది రోజులుగా టీఆర్‌ఎస్ నేతలపై ఐటీ, ఈడీ, సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు టీఆర్‌ఎస్ నేతల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. ఐటీ దాడుల క్రమంలో జీహెచ్‌ఎంసీ పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలు మంగళవారం తెలంగాణ భవన్‌కు తరలివెళ్లి అధిష్టానం వద్ద మొరపెట్టుకున్నారు. దీంతో కేసీఆర్ ఫోన్లో ధైర్య వచనాలు చెప్పే ప్రయత్నం చేశారని తెలుస్తోంది.
Also Read: IT Raids in Telangana : ప్రగతిభవన్లో `బ్లూ ప్రింట్`! అమలైతే బీజేపీ ఔట్!
ఎవరికి వారే తరువాత టార్గెట్ తామేనంటూ భయపడుతున్నారు. ఏకంగా టీఆర్ఎస్ కు కీలకంగా ఉండే ఎమ్మెల్సీ రాజేశ్వరరెడ్డి తదుపరి టార్గెట్ తానేనని భయాందోళన చెందారు. ఇలా పలువురు ఆందోళన చెందుతూ బీజేపీలోకి కొందరు టచ్ లోకి వెళ్లారని తెలుస్తోంది. మొత్తం మీద ఒక పానిక్ వాతావరణం టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల్లో నెలకొంది. దాన్ని అధిగమించడానికి కేసీఆర్ రంగంలోకి దిగడంతో పాటు నైతిక, న్యాయపరమైన మద్ధతు ప్రకటించడం ఊరటనిస్తోంది.