Telangana Assembly : ‘సెంటిమెంట్’పై రాజకీయ క్రీడ
తెలంగాణ అసెంబ్లీ వేదికగా మరోసారి ఆంధ్రాపై కేసీఆర్ అక్కసు వెళ్లగక్కాడు. విభజనకు ముందు ఆంధ్రా ఆధిపత్యం గురించి ప్రస్తావించాడు.
- By CS Rao Published Date - 12:42 PM, Wed - 9 March 22

తెలంగాణ అసెంబ్లీ వేదికగా మరోసారి ఆంధ్రాపై కేసీఆర్ అక్కసు వెళ్లగక్కాడు. విభజనకు ముందు ఆంధ్రా ఆధిపత్యం గురించి ప్రస్తావించాడు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు కలిగిన నష్టాన్ని ఏకరువు పెట్టాడు. ఒకప్పుడు సినిమాల్లో తెలంగాణ యాసను జోకర్లు వాడేవారని గుర్తు చేశాడు. ఇప్పుడు తెలంగాణ బాషను హీరోయిజం కోసం హీరోలు వాడుతున్నారని సెంటిమెంట్ ను రెచ్చగొడుతున్నాడు. రెండుసార్లు సెంటిమెంట్ తో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ మూడోసారి కూడా దాన్ని నమ్ముకుంటున్నట్టు కనిపిస్తోంది.ఉద్యోగ క్యాలెండర్ ను విడుదల చేసిన కేసీఆర్ నిధులు, విధులు, నియామకాల గురించి మళ్లీ స్లోగన్ అందుకున్నాడు. సుమారు 91 వేల ఉద్యోగుల భర్తీకి అసెంబ్లీ వేదిగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అదే సందర్భంలో విభజన చట్టంలోని 9, 10 షెడ్యూల్ గురించి ప్రస్తావించాడు. దుర్మార్గంగా ఏపీ ప్రభుత్వం వ్యవహరింస్తోందని తీవ్రమైన ఆరోపణ చేశాడు. ఆస్తుల పంపకాల విషయంలో ఏపీ ప్రభుత్వం దుర్మార్గంగా ఉందని దుమ్మెత్తి పోశాడు. ఆంధ్రా వాళ్ల కారణంగా ఉద్యోగాలు పూర్తి స్థాయిలో భర్తీ చేయలేకపోయామని విమర్శలు గుప్పించాడు. షెడ్యూల్ 9, 10 అంశాలకు స్పష్టత వస్తే, మరిన్ని ఉద్యోగాలు వస్తాయని మెలిక పెట్టాడు. ఆంధ్రాను టార్గెట్ చేయడం ద్వారా మూడోసారి సీఎం కావడానికి అడుగులు వేస్తున్నాడు.\
Also Read : Tamilisai Vs KCR : ‘మహిళాదినోత్సవం’లో మాటల చిచ్చు
రాష్ట్ర విభజన జరిగిన తరువాత ప్రభుత్వ పనితీరుపై ఎన్నికలు జరగాలి. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలను కేసీఆర్ అమలు చేయలేకపోయాడు. ప్రజా వ్యతిరేకతను గ్రహించిన కేసీఆర్ 2018లోనే ముందస్తుగా ఎన్నికలకు వెళ్లాడు. చంద్రబాబును, ఆంధ్రా పెత్తనం అంటూ బూచిగా చూపి ఆనాడు సెంటిమెంట్ ను రేపడం ద్వారా రెండోసారి గట్టెక్కాడు. 2018 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కేసీఆర్ సర్కార్ అమలు చేయలేక నానా తంటాలు పడుతోంది. కాళేశ్వరం, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాల్లోని భారీ అవినీతిపై విపక్ష నేతలు నిలదీస్తున్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోన్న రియల్ దందాలు వెనుక టీఆర్ఎస్ లీడర్లు కొందరు ఉన్నారని ఆరోణలు వెల్లువెత్తుతున్నాయి. పథకాల అమలులోనూ వ్యతిరేకత ఉంది. పెన్షన్లలోనూ భారీగా కోత పెట్టారు. వరి ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతు ఆత్మహత్యలు పెరిగాయి. ఇలాంటి ప్రజా వ్యతిరేక అంశాలను విపక్షాలు వేలెత్తి చూపుతున్నాయి. ఒక వైపు కాంగ్రెస్ ఇంకో వైపు బీజేపీ కేసీఆర్ ను వెంటాడుతున్నాయి.నిరుద్యోగ సమస్యను రాష్ట్ర వ్యాప్తంగా విపక్షాలు పెద్ద ఎత్తున తీసుకెళ్లాయి. విధిలేని పరిస్థితుల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ 91వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వడానికి సిద్థం అయ్యాడు. జిల్లాల వారీగా ఉద్యోగాల భర్తీ చేయబోతున్నాడు. కానీ, 2లక్షల పైచిలుకు ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని విపక్షాలు తొలి నుంచి చెబుతున్నాయి. కానీ, వాళ్ల డిమాండ్ లో సగం ఉద్యోగాల నియామకానికి మాత్రమే కేసీఆర్ సిద్ధం అయ్యాడు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పిన కేసీఆర్ తాను చెప్పలేదని ఇప్పుడు నాలుక మడతేస్తున్నాడు. ప్రత్యేక రాష్ట్రం వచ్చినంత మాత్రాన ఇంటికో ఉద్యోగం ఎలా సాధ్యమంటూ ప్రశ్నించిన వాళ్లను జైలుకు పంపుతున్నాడు. దళిత బంధు హుజురాబాద్ వరకు పరిమితం అయింది. రైతు బంధు, నిరుద్యోగభృతి, దళితబంధు, పెన్షన్లు..ఇలా అనేక సంక్షేమ పథకాల్లోని లబ్దిదారుల సంఖ్యను కేసీఆర్ సర్కార్ తగ్గించింది. ఫలితంగా గ్రౌండ్ లెవల్ లో వ్యతిరేకత ఉందని ఇటీవల ప్రశాంత్ కిషోర్ చేసిన సర్వేల సారంశమట.
Also Read : TRS Vs BJP : కేసీఆర్ సర్కార్ ను ఇరుకున పెట్టడానికి బీజేపీ కొత్త స్కెచ్
ఆ సర్వే ఆధారంగా మూడోసారి అధికారంలోకి రావడం కష్టమని భావించిన కేసీఆర్ అసెంబ్లీ వేదికగా నిరుద్యోగుల ఆగ్రహాన్ని తగ్గించే ప్రయత్నం చేశాడు. ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇంటికో ఉద్యోగం మంటూ ఇచ్చిన మాటను శాశ్వతంగా అటకెక్కించాడు. ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటున్న నిరుద్యోగ యువత కేసీఆర్ సర్కార్ పై గుర్రుగా ఉంది. పలు వర్గాల ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని తెలుసుకున్న కేసీఆర్ మరోసారి ఆంధ్రాను సెంటిమెంట్ గా వాడుకుంటున్నాడు. అందుకు అసెంబ్లీని వేదికగా వాడుకుంటున్నాడు. ఇప్పటికే ఏపీ, తెలంగాణ ప్రగతిని గురించి అసెంబ్లీ వేదికగా పోల్చాడు. తెలంగాణలో ఒక ఎకరం అమ్మితే, ఏపీలో మూడు ఎకరాలు వస్తుందంటూ కామెంట్ చేశాడు. అమరావతి ప్రాజెక్టు ఫెయిల్ విషయాన్ని కూడా కేసీఆర్ పదేపదే చెబుతున్నాడు. నీళ్లు, నిధులు, నియామకాల్లో ఇప్పటికీ ఏపీ అడ్డుపడుతుందని సెంటిమెంట్ ను రాజేస్తున్నాడు. ఆంధ్రా సెంటిమెంట్ మినహా మూడోసారి సీఎం కావడానికి మిగిలిన అంశాలు పనికిరావని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే, ఇప్పటి నుంచే రాజేస్తే సెంటిమెంట్ రాజేస్తే, తన పరిపాలన మీద తెలంగాణ ప్రజల దృష్టి మరలుతుందని కేసీఆర్ ఎత్తుగడని పలువురు భావిస్తున్నారు. ఈసారి షెడ్యూల్ 9, 10 అంశాలతో పాటు నీటి వాటాను తెర మీదకు తీసుకురావడానికి మాస్టర్ ప్లాన్ వేసినట్టు కేసీఆర్ అసెంబ్లీలో చేసిన ప్రసంగం ఆధారంగా అర్థం అవుతోంది. సినిమాల్లోని డైలాగులను కూడా సెంటిమెంట్ కు వాడుకోవాలని చూస్తున్నాడు. మూడోసారి ముచ్చటగా సెంటిమెంట్ ను పండించడానికి అసెంబ్లీని వాడుకుంటోన్న కేసీఆర్ క్షేత్రస్థాయి వ్యూహం ఏ విధంగా ఉంటుందో..చూడాలి!