Kavitha: వాళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ వదలను: కవిత
గ్రామస్థుల ఆహ్వానం మేరకు చింతమడకకు వచ్చిన కవిత, "ఈ గ్రామం నుంచి ఉద్యమం మొదలైంది.
- By Dinesh Akula Published Date - 11:45 PM, Sun - 21 September 25

సిద్దిపేట జిల్లా, Kavitha- బీఆర్ఎస్ నేత మరియు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను కుటుంబం నుంచే దూరం చేసినవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలబోనని ఆమె స్పష్టం చేశారు. చింతమడక గ్రామంలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. వేదికపై ఆమె భావోద్వేగానికి గురయ్యారు.
గ్రామస్థుల ఆహ్వానం మేరకు చింతమడకకు వచ్చిన కవిత, “ఈ గ్రామం నుంచి ఉద్యమం మొదలైంది. కేసీఆర్ గారు ఇక్కడినుంచే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి తొలి అడుగు వేశారు. అలాంటి గడ్డను కొందరు తమ సొంత ఆస్తిలా భావిస్తున్నారు. నేను వస్తే కూడా ఆంక్షలు పెడుతున్నారు,” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఎంగిలి పూల బతుకమ్మకు ఆహ్వానించి ఆత్మీయ స్వాగతం పలికిన మా చింతమడక అమ్మలు, అక్కాచెల్లెళ్లకు, అన్నదమ్ములకు, చిన్నప్పటి దోస్తులకు తలవంచి నమస్కరిస్తున్న.
కష్టకాలంలో మీరు నాపై చూపిన ప్రేమాభిమానాలను ఎప్పటికీ మరిచిపోలేను.. మీ అందరికీ కృతజ్ఞతలు.#Bathukamma pic.twitter.com/KTsIDf4qvD
— Kavitha Kalvakuntla (@RaoKavitha) September 21, 2025
తెలంగాణ ఉద్యమంలో అడ్డంకులు ఎదురైనట్లు ఇప్పుడు కూడా రాజకీయ అడ్డగోలు సాగుతుందని ఆమె వ్యాఖ్యానించారు. చింతమడకలో పండుగలు, సంస్కృతులు కుల, మతాలకు అతీతంగా జరిపే సంప్రదాయం ఉన్నదని గుర్తు చేశారు. అదే స్ఫూర్తితో రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
“కేసీఆర్ గారికి చెడ్డపేరు తెస్తున్న వారిపై నేను మాట్లాడితే నాపైనే దుష్ప్రచారం జరిగింది. నా ఇంటి నుంచే నన్ను వేరుచేశారు. వాళ్లను ఎప్పటికీ వదలను,” అని కవిత స్పష్టం చేశారు. చింతమడక తనకెప్పుడూ గౌరవ గడ్డగానే ఉంటుందని, ఎన్ని ఆంక్షలు వచ్చినా, ఇక్కడికి తానే వస్తానని ఆమె స్పష్టం చేశారు.
తర్వాత గ్రామస్థులతో కలిసి బతుకమ్మ పండుగలో కవిత ఉత్సాహంగా పాల్గొన్నారు.