IAS officers : తెలంగాణ హైకోర్టులో ఐఏఎస్‌లకు దక్కని ఊరట
IAS officers : 'తప్పకుండా వాదనలను వింటాం.. కానీ ఇలాంటి విషయాల్లో ఇప్పటి పరిస్థితుల్లో మేం జోక్యం చేసుకోలేం. డీవోపీటీ ఉత్తర్వుల ప్రకారం ముందు రాష్ట్రానికి వెళ్ళి రిపోర్టు చేయండి. ఆ తర్వాత అవసరాన్ని బట్టి మళ్లీ విచారిస్తాం. మీ వాదనలను మరింత లోతుగా వింటాం.
- Author : Latha Suma
Date : 16-10-2024 - 4:44 IST
Published By : Hashtagu Telugu Desk
Telangana High Court : క్యాట్ తీర్పును వ్యతిరేకిస్తూ ఏపీ కేడర్ ఐఏఎస్ అధికారులు తెలంగాణ హైకోర్టు)ను ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే వీరి పిటిషన్లపై బుధవారం మధ్యాహ్నం కోర్టు విచారణ జరిపింది. ఐఏఎస్‌లు ఉన్నది ప్రజాసేవ కోసమే అని.. ఎక్కడ అవకాశం కల్పిస్తే అక్కడకు వెళ్ళాలని పేర్కొంది. ట్రిబ్యునల్ కొట్టి వేస్తే కోర్టుకు రావడం సరైంది కాదని.. ఇప్పుడు డిస్మిస్ చేస్తే మళ్ళీ అప్పీల్ చేస్తారు. అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తారు. అక్కడ కూడా ఇదే వాదనలు చేస్తారు. ఇక ఇది లాంగ్ ప్రాసెస్‌గా మారుతుందిని కోర్టు అభిప్రాయపడింది. ముందు ఎక్కడివాళ్లు అక్కడ రిపోర్ట్ చేయాలని ఆదేశించింది.
‘తప్పకుండా వాదనలను వింటాం.. కానీ ఇలాంటి విషయాల్లో ఇప్పటి పరిస్థితుల్లో మేం జోక్యం చేసుకోలేం. డీవోపీటీ ఉత్తర్వుల ప్రకారం ముందు రాష్ట్రానికి వెళ్ళి రిపోర్టు చేయండి. ఆ తర్వాత అవసరాన్ని బట్టి మళ్లీ విచారిస్తాం. మీ వాదనలను మరింత లోతుగా వింటాం. కానీ మీరు రిపోర్టు చేయకుండా ఆపివేసేలా కోర్టులు ఇప్పుడు ఎలాంటి రిలీఫ్ ఇవ్వడం సాధ్యం కాదు’ అంటూ తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది. కాగా, క్యాట్ మంగళవారం ఇచ్చిన ఆర్డర్ కాపీని సమర్పించాలని ఐఏఎస్‌ల తరపు న్యాయవాదులను కోర్టు ఆదేశించగా.. ఆర్డర్ కాపీ ఇంకా తమకు అందలేదని లాయర్ సమాధానం ఇచ్చారు. క్యాట్ ఇచ్చిన తీర్పునే ఐఏఎస్‌లు సవాలు చేస్తూ హైకోర్టుకు వచ్చారని లాయర్ చెప్పుకొచ్చారు.
డీవోపీటీ ఉత్తర్వులపై ఐఏఎస్ అధికారులు వాణి ప్రసాద్, వాకాటి కరుణ, రొనాల్డ్ రోస్, ఆమ్రపాలి, సృజన, శివశంకర్, హరికిరణ్ హైకోర్టును ఆశ్రయించారు. ట్రైబ్యునల్‌లో నవంబరు 4న విచారణ ఉందని, అప్పటి వరకు రిలీవ్ చేయవద్దని ఐఏఎస్‌ల తరఫు న్యాయవాది కోరారు. స్టే ఇస్తూ పోతే ఈ అంశం ఎన్నటికీ తేలదని ఈ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యానించింది. వివాదాన్ని తేలుస్తాం.. ముందు కేటాయించిన రాష్ట్రాల్లో చేరాలని సూచించింది.