Deccan Cement : ‘డెక్కన్ సిమెంట్’ అటవీ భూ ఆక్రమణలపై దర్యాప్తు
Deccan Cement : మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసిన ఆరోపణలతో “డెక్కన్ సిమెంట్స్” (Deccan Cement) కంపెనీ మళ్లీ వార్తల్లోకి వచ్చింది.
- By Sudheer Published Date - 01:45 PM, Thu - 16 October 25

మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసిన ఆరోపణలతో “డెక్కన్ సిమెంట్స్” (Deccan Cement) కంపెనీ మళ్లీ వార్తల్లోకి వచ్చింది. ఇటీవల విడుదల చేసిన వీడియోలో ఆమె, డెక్కన్ సిమెంట్స్ యాజమాన్యంపై రాజకీయ ఒత్తిడి తెచ్చారని పేర్కొనడంతో, ఈ కంపెనీ చుట్టూ ఉన్న భూ వివాదాలు మళ్లీ ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సూర్యాపేట జిల్లా పరిధిలోని 73 ఎకరాల అటవీ భూమిని ఈ కంపెనీ అక్రమంగా ఆక్రమించిందని స్థానికులు పలు మార్లు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులను పరిశీలించిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) ఇప్పటికే విచారణ చేపట్టి, సంబంధిత శాఖల నుండి నివేదికలు కోరిన విషయం తెలిసిందే.
Infosys : ఉద్యోగులకు ఇన్ఫోసిస్ అదిరిపోయే శుభవార్త..!
అటు కేంద్ర అటవీశాఖ కూడా ఈ వ్యవహారంపై సీరియస్‌గా స్పందించింది. పదిరోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర అటవీశాఖకు నోటీసులు జారీ చేసి, ఆక్రమణలపై పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం, అటవీశాఖ అధికారులు ఇప్పుడు పరిశీలనలో నిమగ్నమయ్యారు. భూమి నిజంగా అటవీ పరిధిలోదేనా, లేక ప్రైవేట్ సర్వే భూమా అనే అంశాలను పరిశీలించడానికి ప్రత్యేక సర్వే బృందాలు కూడా ఏర్పాటయ్యాయి. అధికారులు ప్రాథమికంగా సర్వే మ్యాపులు, పాత రికార్డులు, ఉపగ్రహ చిత్రాలను కూడా పరిశీలిస్తున్నారని సమాచారం.
ఇక రాజకీయ దృష్ట్యా ఈ వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్‌కు మరో సవాలుగా మారింది. కొండా సురేఖ – పొంగులేటి మధుసూదన్‌రెడ్డి మధ్య జరుగుతున్న టెండర్ వివాదం నేపథ్యంలో సుస్మిత చేసిన ఆరోపణలు ఇప్పటికే పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టాయి. ఇప్పుడు డెక్కన్ సిమెంట్స్ భూ ఆక్రమణ కేసు కూడా దీనికి కొత్త కోణం తెచ్చింది. అధికారులు “దర్యాప్తు పూర్తి కాగానే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి” అని చెబుతున్నప్పటికీ, రాజకీయ వర్గాల్లో మాత్రం ఈ కేసు వెనుక ఉన్న సంబంధాలు, ఒత్తిడులపై ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి. త్వరలోనే అటవీశాఖ నివేదిక వెలువడితే ఈ వివాదానికి కొత్త దిశ దొరకనుంది.