KCR Tamilnadu Tour : కేసీఆర్ అరవ ‘మేళం’
తెలంగాణ సీఎం కేసీఆర్ రాజకీయ చతురతను చాలా సందర్భాల్లో చూశాం. లక్ష్యాన్ని చేరుకోవడానికి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాడు.
- By CS Rao Published Date - 02:34 PM, Mon - 13 December 21

తెలంగాణ సీఎం కేసీఆర్ రాజకీయ చతురతను చాలా సందర్భాల్లో చూశాం. లక్ష్యాన్ని చేరుకోవడానికి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాడు. `ఎప్పుడు వచ్చిందికాదు…బుల్లెట్ దిగిందా.? లేదా?` అనే సినిమా డైలాగు మాదిరిగా ఆయన రాజకీయ అస్త్రాలు ఉంటాయి. తాజాగా తమిళనాడు సీఎం స్టాలిన్ ను కలుసుకోవడానికి వెళ్లాడు. పనిలోపనిగా స్వామి కార్యం శ్రీరంగనాథ దర్శనం కూడా టూర్ షెడ్యూల్ లో ఉంది. ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం కేసీఆర్ రచించుకున్న షెడ్యూల్.ప్రాంతీయ పార్టీలను ఎక్కువ కాలం నడపడానికి అవసరమైన సంస్థాగత నిర్మాణం అవసరం. ఆ విషయంలో డీఎంకే పార్టీని ప్రాంతీయ పార్టీలు ఆదర్శంగా తీసుకుంటున్నాయి. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీని కూడా డీఎంకే తరహాలో సంస్థాగతంగా బలోపేతం చేయడానికి ఇటీవల అధ్యయనం జరిగింది. అందుకు అవసరమైన సలహాలు, సూచనలను స్టాలిన్ నుంచి తీసుకుంటామని ఇటీవల టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వగుంట్ల కేటీఆర్ చెప్పాడు.
ప్రాంతీయ పార్టీలు పుట్టడం..కనుమరుగు కావడం చాలా తేలిగ్గా జరుగుతోంది. టీఆర్ఎస్ పార్టీ రెండు దశాబ్దాల క్రితం ఆవిర్భవించింది. ఇప్పటి వరకు విజయవంతంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాదరణ పొందుతోంది. ఇక ముందు కూడా ఇలాంటి ఆదరణే ఉండేలా కేసీఆర్ పగడ్బందీ వ్యూహాన్ని రచించాడు. ఆ క్రమంలోనే దాదాపు 450కోట్ల నిధులను పార్టీ కోసం సేకరించ గలిగాడు. ఆ నిధులతో పార్టీ కార్యాలయాలను ఢిల్లీ నుంచి మండల స్థాయి వరకు నిర్వహించడానికి ప్రణాళికలను రచించాడు. ఇలాంటి నిర్మాణం ఉన్నప్పటికీ టీడీపీ ప్రస్తుతం ఎలా ఉందో.. ఆయనకు తెలుసు. అందుకే, నాలుగు దశాబ్దాలుగా పైగా విజయవంతంగా ప్రజల్లో ఉన్న డీఎంకే పార్టీ మోడల్ ను కేసీఆర్ అధ్యయనం చేస్తున్నాడు. అందుకే, స్టాలిన్ ను కలుస్తున్నాడని గులాబీ శ్రేణుల టాక్.తమిళనాడులో స్టాలిన్ పాలన మీద దేశ వ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. పైగా దక్షిణ భారతదేశంలో బలమైన రాజకీయ నాయకుడు. యూపీఏకి నమ్మకమైన భాగస్వామి. కాంగ్రెస్, బీజేపీయేతర కూటమి దిశగా మమత అడుగులు వేస్తోన్న క్రమంలో స్టాలిన్ తో కేసీఆర్ భేటీ కీలకమే. ఎందుకంటే, ప్రధాన మంత్రి అభ్యర్థి రేసులో కేసీఆర్ 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల టైం నుంచి ఉన్నాడు. ఆనాడే ప్రధాన మంత్రి అభ్యర్థిగా అన్ని అర్హతలు తనకు ఉన్నాయని మీడియా ముందు బల్లగుద్ది చెప్పాడు. భారత దేశానికి అవసరమైన వ్యూహం ఉందని ఆనాడే వెల్లడించాడు.
కాంగ్రెస్, బీజేపీయేతర ప్రధాని అభ్యర్థుల జాబితాలో పశ్చిమ బెంగాల్ సీఎం మమత పేరు ప్రముఖంగా ఉంది. ఆ తరువాత ఎన్సీపీ నేత శరద్ పవార్, ఆప్ నేత కేజ్రీవాల్, స్టాలిన్, కేసీఆర్, జగన్. ..ఇలా అనేక పేర్లు మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఫెడరల్ ఫ్రంట్ దిశగా 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు అడుగులు వేసిన కేసీఆర్ ఆ తరువాత సైలెంట్ గా ఉన్నాడు. ఇప్పుడు మళ్లీ ఫెడరల్ ఫ్రంట్ వైపు అడుగులు వేయడానికి తొలి పర్యటన తమిళనాడు నుంచి పెట్టుకున్నాడని ఆ పార్టీలోని కొందరు చెప్పుకుంటున్నారు.సరిగ్గా ఇలాంటి పర్యటనలను 2018 ఎన్నికలకు ముందు కేసీఆర్ పెట్టుకున్నాడు. తమిళనాడు, కర్నాటక, ఒడిస్సా, ఏపీ, ఢిల్లీ, పశ్చిమబెంగాల్, చత్తీస్ గఢ్ తదితర రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల అధిపతులను కలిశాడు. ఫెడరల్ ఫ్రంట్ అవసరమని ఆనాడు మోడీని, సోనియాను టార్గెట్ చేస్తూ మాట్లాడాడు. రాష్ట్రంలోనూ జిల్లాల పర్యటనలను పెట్టుకున్నాడు. అదే సమయంలో కేసీఆర్ మీద ప్రత్యర్థి పార్టీలు అవినీతి ఆరోపణలను గుప్పించాయి. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం నిర్మాణంలోని అవినీతి..ఇలా అనేక అంశాలతో పాటు డగ్స్, మియాపూర్ భూ కుంభకోణం, నయిమ్ ఎన్ కౌంటర్‌లోని గుట్టు తదితరాలతో కాంగ్రెస్ దాడిని పెంచింది. వీటన్నింటినీ ప్రజల మధ్యే తేల్చుకుంటానని `ముందస్తు` ఎన్నికలకు ఆనాడు కేసీఆర్ వెళ్లాడు. ఇప్పుడు కూడా సేమ్ టూ సేమ్ 2018 ఎన్నికలకు ముందుగా ఎలాంటి అడుగులు వేశాడో..అలాగే కేసీఆర్ ముందుకు కదులుతున్నాడు. తమిళనాడు వెళ్లి వచ్చిన తరువాత జిల్లాల పర్యటనలు పెట్టుకున్నాడు. ఆనాడు కాంగ్రెస్ చేసిన విధంగానే ఈసారి కేసీఆర్ మీద బీజేపీ అటాక్ చేస్తోంది. ఆ క్రమంలో `ముందస్తు` ప్రకటన సంక్రాంతి తరువాత కేసీఆర్ చేస్తారని ప్రత్యర్థులు భావిస్తున్నారు. సో..ఈసారి కేసీఆర్ వేసే ఎత్తుగడలు…మునుపటి మాదిరిగా ఉంటాయా? కొత్త పంథా ఉంటుందా? అనేది చూడాలి!