Food Delivery: ఆర్డర్ లేటు అయిందని ఫుడ్ డెలివరీ బాయ్‌పై విచక్షణారహితంగా దాడి.. హైదరాబాద్‌లో దారుణం
హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. ఆర్డర్ ఆలస్యమైందని ఫుడ్ డెలివరీ బాయ్ పై ఓ కస్టమర్ తన అనుచరులతో కలిసి దాడికి పాల్పడ్డాడు.
- Author : Anshu
Date : 03-01-2023 - 9:00 IST
Published By : Hashtagu Telugu Desk
Food Delivery: హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. ఆర్డర్ ఆలస్యమైందని ఫుడ్ డెలివరీ బాయ్ పై ఓ కస్టమర్ తన అనుచరులతో కలిసి దాడికి పాల్పడ్డాడు. నగరంలోని హుమయూన్ నగర్ లో చోటుచేసుకున్న ఈ ఘటన కలకలం రేపుతోంది. ఏకంగా 15 మంది హోటల్ కి వెళ్లి డెలివరీ బాయ్ పై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. డెలివరీ బాయ్ హోటల్ బయట ఉండగానే.. కస్టమర్ 15 మందితో కలిసి వెళ్లి దాడి చేసేందుకు ప్రయత్నించారు.
వారిని చూసి డెలివరీ బాయ్ భయపడి హోటల్ లోకి పరుగులు పెట్టాడు. దీంతో ఆ 15 మంది కూడా హోటల్ లోకి చొచ్చుకెళ్లారు. డెలివరీ బాయ్ పై విచక్షణారహితంగా దాడి చేశాడు. అందరూ కలిసి మూకుమ్మడిగా చితక్కొట్టారు. ఈ క్రమంలో హోటల్‌లోని కిచెన్ లో స్టౌపై ఉన్న వేడి నూనె పైన పడింది. ఈ ఘటనలతో డెలివరీ బాయ్ తో పాటు పాటు నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన వారిని హోటల్ సిబ్బంది ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘనటపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. హోటల్ సిబ్బంది నిందితులను ఆపేందుకు ప్రయత్నించినా.. వాళ్లు ఆగలేదు. కిచెన్ లోకి వెళ్లి మరీ చితకబాదారు. పుడ్ డెలివరీ బాయ్ ఇలియాస్ ను పోలీసులు విచారిస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడితో పాటు అతని కుమారులు సహా ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశాడు. దాడికి పాల్పడిన మరికొంతమందిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.హోటల్ సిబ్బంది సోము, సిజ్జన్ గాయపడ్డారని, వారిని కూడా ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. డెలివరీ బాయ్స్ పై దాడి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. అయితే ఆర్డర్ లేట్ అయిందని డెలివరీ బాయ్ పై దాడి ఘటన కలకలం రేపుతోంది.