Farmer Ganesha : జయములివ్వు ‘రైతు గణేశా’.. ఫొటోలు వైరల్
Farmer Ganesha : వినాయక చవితి వేళ వివిధ రూపాల్లోని వినాయక ప్రతిమలను గణేశ్ మండపాల్లో భక్తులు ఆరాధిస్తున్నారు.
- By Pasha Published Date - 10:38 AM, Sun - 24 September 23
Farmer Ganesha : వినాయక చవితి వేళ వివిధ రూపాల్లోని వినాయక ప్రతిమలను గణేశ్ మండపాల్లో భక్తులు ఆరాధిస్తున్నారు. ఒక్కో చోట ఒక్కో విధమైన రూపాల్లోని గణేశుడి ప్రతిమలు భక్తజనం నుంచి పూజలు అందుకుంటున్నాయి. ఈక్రమంలోనే కరీంనగర్ పట్టణంలో ఏర్పాటైన ‘రైతు గణేశుడి’ వినాయక మండపం ఆకట్టుకుంటోంది.

కరీంనగర్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఆవరణలో ఇండియన్ యూత్ సెక్యూర్ ఆర్గనైజేషన్ ఫౌండర్ ఘన్ శ్యాంజీ చొరవ చూపి రైతు గణేశుడి వినాయక మండపాన్ని ఏర్పాటు చేయించారు. ఈ మండపంలోని వినాయకుడు వ్యవసాయం చేస్తున్నట్టుగా.. నాగలి పట్టి పొలం దున్నుతున్నట్లుగా.. వరి పంట పండిస్తున్నట్టుగా.. పొలం పనులు చేస్తున్నట్టుగా వివిధ ప్రతిమలు ఉన్నాయి.
వినాయకుడు రైతుగా మారి పంటలు పండిస్తున్నట్టుగా ఉన్న ఈ ప్రతిమలలో జీవకళ ఉట్టిపడుతోంది. ఘన్ శ్యాంజీ గత ఐదు సంవత్సరాలుగా ఎకో ఫ్రెండ్లీ వినాయక ప్రతిమలతోనే వినాయక మండపాన్ని ఏర్పాటు చేయిస్తున్నారు. ఈసారి కూడా రూ. 75000 ఖర్చు చేసి కలకత్తా నుంచి కళాకారులను తీసుకొచ్చి రైతు గణేశుడి మండపాన్ని తయారు చేయించారు. ఈ ప్రతిమల తయారీలో ప్రమాదకర రసాయనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ను కొంచెం కూడా వాడలేదు. పూర్తిగా మట్టితోనే ఈ ప్రతిమలు రెడీ అయ్యాయి.