UNESCO : ప్రపంచ వారసత్వ రేసులో ‘నిలువురాళ్లు’.. ఎలా నిలబడ్డాయి? ఏం చేస్తాయి ?
నిలువురాళ్లకు(UNESCO) ఎగువన రాతిపై సప్తర్షి మండలాన్ని చెక్కారు.
- By Pasha Published Date - 07:42 AM, Sat - 15 March 25

UNESCO : ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించాలంటూ ఆరు ప్రదేశాల పేర్లను యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (యునెస్కో)కు భారత ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ లిస్టులో తెలంగాణలోని నారాయణపేట జిల్లా ముడుమాల్ గ్రామంలో ఉన్న నిలువురాళ్లకు కూడా చోటు దక్కింది. మన దేశంలో ఇప్పటికే యునెస్కో గుర్తింపు పొందిన 56 వారసత్వ కేంద్రాలు ఉన్నాయి. తాజాగా భారత సర్కారు పంపిన ఆరు ప్రదేశాలకు కూడా చోటు దక్కుతుందా ? లేదా ? అనేది వేచిచూడాలి. ఈసందర్భంగా ముడుమాల్ నిలువు రాళ్ల విశేషాలను తెలుసుకుందాం..
Also Read :Neem Leaves: వేప ఆకులను నమలడం వల్ల కలిగే ప్రయోజనాలు మీకు తెలుసా?
ఏమిటీ నిలువురాళ్లు ? ఎందుకివి ?
- ముడుమాల్ గ్రామంలోని నిలువు రాళ్లను ఆంగ్లభాషలో మెగాలితిక్ మెన్హిర్స్ అని పిలుస్తారు.
- ఈ నిలువు రాళ్లు నారాయణపేట జిల్లా కృష్ణా మండలం ముడుమాల్ శివారులోని కృష్ణానది ఒడ్డున ఉన్నాయి.
- దాదాపు 80 ఎకరాల విస్తీర్ణంలో ఈ నిలువు రాళ్లు ఉన్నాయి. గతంలో 10 నుంచి 14 అడుగుల ఎత్తులో వందకుపైగా నిలువురాళ్లు ఉండేవి. కాలక్రమంలో అవన్నీ ధ్వంసమయ్యాయి. ఇప్పుడు కొన్నే మిగిలాయి.
- హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ కె.పి.రావు తొలుత ఈ నిలువు రాళ్లను ముడుమాల్ గ్రామంలో గుర్తించారు.
- నిలువురాళ్ల సంరక్షణ బాధ్యతను డెక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ చేపట్టింది. ప్రభుత్వ సహకారంతో వీటి చుట్టూ ఇనుప కంచె ఏర్పాటు చేశారు. ఈ రాళ్ల సంరక్షణకు ఒక వ్యక్తిని నియమించారు. టిటా గ్లోబల్‌ట్రస్ట్ వ్యవస్థాపకులు సందీప్ మక్తాల ఆధ్వర్యంలోనూ ఈ నిలువు రాళ్లపై పలు డాక్యుమెంటరీలు తయారు చేసి ప్రచారం చేశారు.
- ఈ రాళ్లను క్రీస్తు పూర్వం 5 వేల ఏళ్ల క్రితం ఏర్పాటు చేసి ఉండొచ్చని పురాతత్వ శాస్త్రవేత్తలు అంటున్నారు.
- భారతీయుల ప్రాచీన ఖగోళ విజ్ఞానానికి ఈ నిలువు రాళ్లు నిదర్శనమని చెబుతుంటారు.
- ప్రాచీన కాలంలో వాతావరణ మార్పులపై అంచనాకు వచ్చేందుకు ఈ రాళ్లను వాడే వాళ్లని చెబుతున్నారు. నిలువురాళ్ల నీడల ఆధారంగా సూర్య గమనాన్ని లెక్కించి.. రుతువులు, ఉత్తరాయణం, దక్షిణాయణం వంటివి నిర్ధారించుకునే వారట.
- నిలువురాళ్లకు(UNESCO) ఎగువన రాతిపై సప్తర్షి మండలాన్ని చెక్కారు.
- నిలువు రాళ్లను ఏర్పాటు చేసిన ప్రదేశం పక్కనే దాదాపు 50 ఎకరాల్లో గండశిలలతో ఏర్పాటు చేసిన గుండ్రటి నిర్మాణాలు ఉన్నాయి.
- నిలువు రాళ్లను ఆదిమానవుల సమాధులపై నిలబెట్టి ఉంటారని పలువురు చరిత్రకారులు అంచనా వేస్తున్నారు.
- ప్రపంచ వారసత్వ ప్రదేశాలను గుర్తించేందుకు యునెస్కో ముమ్మర కసరత్తు చేస్తుంది. ఇందుకోసం ప్రత్యేక సమావేశాలను నిర్వహిస్తుంది. వివిధ దేశాలు ఈ ఓటింగ్‌లో పాల్గొంటాయి. అధిక దేశాల మద్దతు పొందే ప్రదేశాలకే ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో చోటు లభిస్తుంది.
- ఒకవేళ నిలువురాళ్లకు ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు లభిస్తే, ఇక్కడికి విదేశీ పర్యాటకుల తాకిడి పెరుగుతుంది. టూరిజం వికసిస్తుంది.