Hydra : హైడ్రా కీలక నిర్ణయం.. ఆ అధికారులపై క్రిమిన్ కేసులు..!
ఎఫ్‌టీఎల్‌లో నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. అనుమతులు ఇచ్చిన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
- By Latha Suma Published Date - 07:43 PM, Thu - 29 August 24

Hydra: హైదరాబాద్ నగరంలోని చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములను ఆక్రమించిన అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా (Hydra) వ్యవస్థను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పుడు హైడ్రా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎఫ్‌టీఎల్‌లో నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. అనుమతులు ఇచ్చిన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆరుగురు అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సైబరాబాద్ కమిషనర్‌కు హైడ్రా సిఫారసు చేసినట్లు సమాచారం. హెచ్ఎండీఏలో అక్రమంగా అనుమతులు ఇచ్చిన అధికారుల జాబితాను హైడ్రా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
We’re now on WhatsApp. Click to Join.
మరోవైపు అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా పాల్గొన్నారు. హైడ్రాకు వ్యతిరేకంగా పలువురు నేతలు కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేతలు కోర్టుకు వెళ్లడంపై ఏం చేయాలనే యోచనలో చర్చించినట్లు సమాచారం. హైడ్రాకు చట్టబద్ధత కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Read Also: Kannayyanayudu : ఏపీ ప్రభుత్వ సలహాదారుడిగా కన్నయ్య నాయుడు
కాగా, అక్రమ నిర్మాణదారులకే కాదు.. నిబంధనలకు నీళ్లొదిలిన అధికారులకూ హైడ్రా సెగ తగిలింది. చెరువులను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను హైడ్రా పెద్దఎత్తున కూల్చివేయిస్తున్న విషయం తెలిసిందే. అయితే కూల్చివేతలు చేపట్టిన ప్రాంతాల్లో నాటి నుంచి విధులు నిర్వహించిన సంబంధిత అధికారుల వివరాలను సేకరిస్తున్నట్టు సమాచారం. ఇప్పటివరకు 18 ప్రాంతాల్లో చిన్నా పెద్దవి కలిపి సుమారు 200కి పైగా నిర్మాణాలు కూల్చివేసినట్లు అధికారుల సమాచారం. 50 ఎకరాల వరకు ప్రభుత్వ, చెరువుల భూములను పరిరక్షించినట్లు హైడ్రా అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఆయా ప్రాంతాల్లో జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, రెవెన్యూ అధికారుల పాత్రపై అధికారులు ఆరా తీస్తున్నారు.
పలుచోట్ల చాలామంది చెరువులను ఆక్రమించుకుని భారీ నిర్మాణాలు చేపట్టిన విషయం ప్రభుత్వానికి తెలియంది కాదు. పర్యవేక్షణ అధికారులు తమకు కేటాయించిన ప్రాంతాల్లో చేపడుతున్న నిర్మాణాలు నిబంధనల మేరకు జరుగుతున్నాయా? లేదా? అన్నది తనిఖీ చేయాల్సి ఉంటుంది. అనుమతులు లేని పక్షంలో కూల్చివేతలు చేపట్టాలి. పర్యవేక్షణ అధికారులే కాదు ప్రతి విభాగంలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు కూడా నిర్మాణాలపై ఓ కన్నేసి ఉంచాల్సిన బాధ్యత ఉంది. కొన్ని ప్రాంతాల్లో సర్వే నంబర్లు వేరుగా వేసి నిర్మాణ అనుమతులు తీసుకున్నట్లు కూడా హైడ్రా అధికారులు గుర్తించారు. అనుమతులు జారీచేసే ముందు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలి. అలాచేస్తే సర్వే నంబరు సరైనదా? కాదా? గుర్తించడం అధికారులకు పెద్ద కష్టమైన పనేమీ కాదు. ఈ మేరకు అక్రమ నిర్మాణాలకు సంబంధించి.. ఆయా ప్రాంతాల్లో పనిచేసిన అధికారులు తమ విధులు సక్రమంగా నిర్వహించడంలో నిబంధనలకు తిలోదకాలు ఇచ్చారన్న ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో నిబంధనలను అమలు చేయని అధికారుల లెక్కలు తేల్చాల్సి ఉంది.
Read Also: Orange Alert : తెలంగాణకు భారీ వర్ష సూచన.. సెప్టెంబర్ 2 వరకు ఆరెంజ్ అలర్ట్