Musi Project: లండన్ థేమ్స్ రివర్ ప్రాజెక్టు తరహాలో హైదరాబాద్ మూసీ ప్రాజెక్టు
- Author : Balu J
Date : 24-01-2024 - 8:04 IST
Published By : Hashtagu Telugu Desk
Musi Project: లండన్ లోని థేమ్స్ రివర్ ప్రాజెక్టు తరహాలో హైదరాబాద్ లో మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్రిటిష్ హై కమిషనర్ అలెక్స్ ఎల్లిస్ తో తన ఆలోచనలను పంచుకున్నారు. ఇటీవల లండన్ పర్యటనలో అక్కడ థేమ్స్ నది నిర్వహిస్తున్న తీరు, రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు అభివృద్ధి చేసిన తీరును ప్రత్యేకంగా అధ్యయనం చేసినట్లు చెప్పారు. అదే మోడల్ లో హైదరాబాద్ లో మూసీనది పునరుజ్జీవింపజేసేందుకు చేస్తున్న ప్రణాళికలను, ప్రాజెక్టుకు సంబంధించిన అవుట్ లైన్, థేమ్స్ నది తరహాలో అభివృద్ధి, తదితర అంశాలను ఆయనతో చర్చించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో బ్రిటిష్ హై కమీషనర్ అలెక్స్ ఎల్లిస్ తో భేటీ అయ్యారు. నదీ ఒడ్డున అభివృద్ధి కార్యక్రమాలతో పాటు నదీ సంరక్షణకు అత్యున్నత ప్రాధాన్యమిస్తున్నట్లు, నదీ జలాలను సుస్థిరంగా ఉంచటం, ఎంచుకున్న ప్రాజెక్టు ద్వారా స్థానికులకు ఎక్కువ ప్రయోజనముండే విధంగా ఈ ప్రాజెక్టును మరింత అత్యుత్తమంగా తీర్చిదిద్దే విధంగా చేపట్టనున్నట్లు సీఎం అన్నారు. మూసి నది అభివృద్ధిలో పర్యావరణాన్ని కాపాడుతూ, సహజ వనరులకు విఘాతం లేకుండా అభివృద్ధి చేస్తామని సీఎం అన్నారు.
సీఎం దార్శనికతకు, నది పరీవాహిక ప్రాంత అభివృద్ధి చేపట్టటం పట్ల బ్రిటిష్ హై కమీషనర్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్, ఎకో టూరిజంకు తమ సహకారం ఉంటుందని ఎల్లిస్ అన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, డిప్యూటీ హై కమీషనర్ గారేత్ వైన్ ఒవేన్, ఐటి మరియు పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు పాల్గొన్నారు.