Erravalli : ఎర్రవల్లి భూములకు భారీ డిమాండ్..కారణం అదే..!!
Erravalli : సాధారణంగా రాజకీయనేతలు, సినీతారలు తమ ఫామ్ హౌస్‌లను మొయినాబాద్ లేదా మేడ్చల్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకుంటారు
- By Sudheer Published Date - 06:20 PM, Thu - 6 February 25

తెలంగాణలో ఎర్రవల్లి (Erravalli ) గ్రామం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇది మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్‌కు ప్రసిద్ధి చెందిన ఊరు. సాధారణంగా రాజకీయనేతలు, సినీతారలు తమ ఫామ్ హౌస్‌లను మొయినాబాద్ లేదా మేడ్చల్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకుంటారు. కానీ కేసీఆర్ మాత్రం గజ్వేల్ సమీపంలోని ఎర్రవల్లిని ఎంచుకున్నారు. ఆయన ఫామ్ హౌస్ వల్లే ఈ గ్రామం తెలంగాణవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఇప్పుడీ గ్రామం మరో కారణంతో మరింత ప్రాచుర్యం పొందుతోంది. తెలంగాణ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన రీజనల్ రింగ్ రోడ్ (ట్రిపుల్ ఆర్) ఇంటర్ చేంజ్ జంక్షన్, ఎర్రవల్లి సమీపంలోని జగదేవ్ పూర్ వద్ద ఏర్పడనుంది. దీని ప్రభావంతో ఆ ప్రాంతంలోని రియల్ ఎస్టేట్ రంగం ఊహించని స్థాయిలో అభివృద్ధి చెందుతోంది. రుస్తాపూర్, తుర్కపల్లి, వాసాలమర్రి, ఎర్రవల్లి పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే అనేక రియల్ వెంచర్లు మొదలయ్యాయి.
Repo Rate: గుడ్ న్యూస్ చెప్పనున్న ఆర్బీఐ.. వడ్డీ రేట్లను తగ్గించనుందా?
ప్రస్తుతం వాసాలమర్రిలో డీటీసీపీ లేఅవుట్ ప్రాజెక్టుల వల్ల రియల్ ఎస్టేట్ మార్కెట్ వేగంగా మారుతోంది. అక్కడ చదరపు గజం ధర రూ.10,000 నుంచి రూ.20,000 వరకు ఉంది. అదే సమయంలో జగదేవ్ పూర్ పరిసర ప్రాంతాల్లో చదరపు గజం ధర రూ.14,000 నుంచి రూ.28,000 వరకు ఉంది. ఎర్రవల్లి ప్రాంతంలో కూడా భారీ స్థాయిలో ఓపెన్ ప్లాట్లు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం వేగం పెంచితే, ఈ ప్రాంతాల్లో భూముల ధరలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే రియల్ ఎస్టేట్ సంస్థలు ఈ ప్రాంతంలో భారీ స్థాయిలో వెంచర్లు వేయాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. రోడ్డు పక్కన వ్యాపార సముదాయాలు, గుడ్లు, రెస్టారెంట్లు, పెట్రోల్ బంకులు మొదలైన వాణిజ్య ప్రాజెక్టులకు భూముల డిమాండ్ పెరుగుతోంది. భవిష్యత్తులో రీజనల్ రింగ్ రోడ్ పూర్తయితే, ఎర్రవల్లి పరిసర ప్రాంతాలు అత్యంత వేగంగా అభివృద్ధి చెందే అవకాశముంది. రియల్ ఎస్టేట్ పెట్టుబడిదారులు, భవిష్యత్తులో రియల్ మార్కెట్‌లో లాభాల కోసం ఆ ప్రాంతాలను దగ్గరగా గమనిస్తున్నారు. ఈ ప్రాంతం రియల్ ఎస్టేట్ హబ్‌గా మారడం ఖాయమని నిపుణులు అంచనా వేస్తున్నారు.