Betting Apps Scam : బెట్టింగ్ యాప్స్.. ఎలా దగా చేస్తున్నాయి ? చట్టాలతో కంట్రోల్ చేయలేమా ?
క్రికెట్, ఫుట్‌బాల్, టెన్నిస్, రమ్మీ, క్యాసినో, పోకర్ వంటి గేమ్స్‌లో డబ్బులు పెట్టి ఆడేందుకు వీలుగా బెట్టింగ్ యాప్స్‌ను(Betting Apps Scam) తయారుచేస్తున్నారు.
- By Pasha Published Date - 03:11 PM, Wed - 19 March 25

Betting Apps Scam : బెట్టింగ్ యాప్స్‌ను పలువురు సెలబ్రిటీలు ప్రమోట్ చేస్తున్న వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సీరియస్ ఇష్యూగా మారింది. ఈమేరకు ఆరోపణలు ఎదుర్కొంటున్న 11 మంది సినీనటులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లపై హైదరాబాద్ పోలీసులు కేసులు నమోదు చేశారు. వినయ్ అనే వ్యక్తి మార్చి 17న పంజాగుట్ట పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా యూట్యూబర్లు ఇమ్రాన్ ఖాన్, హర్షసాయి, అజయ్, నటులు విష్ణుప్రియ, శ్యామల, టేస్టీ తేజ, రీతూ చౌదరి, బండారు శేషయాని సుప్రీత, కానిస్టేబుల్ కిరణ్ గౌడ్, ట్రావెలర్ సన్నీయాదవ్, అనలిస్టు సుధీర్‌లపై కేసులు పెట్టారు. మరోవైపు సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ పిలుపు మేరకు సోషల్ మీడియాలో #SayNoToBettingApps హ్యాష్‌టాగ్ ట్రెండ్ అవుతోంది.
Also Read :Telangana Budget 2025: తెలంగాణ అప్పులు, ఆదాయం.. చైనా ప్లస్ వన్ వ్యూహం
బెట్టింగ్ యాప్స్ ఎలా పనిచేస్తాయి ?
- క్రికెట్, ఫుట్‌బాల్, టెన్నిస్, రమ్మీ, క్యాసినో, పోకర్ వంటి గేమ్స్‌లో డబ్బులు పెట్టి ఆడేందుకు వీలుగా బెట్టింగ్ యాప్స్‌ను(Betting Apps Scam) తయారుచేస్తున్నారు.
- బెట్టింగ్ యాప్స్‌లో ముందుగానే ఆటను ప్రోగ్రామ్ చేస్తారు. తొలుత ప్లేయర్లకు కొద్దిపాటి లాభాలు వచ్చేలా చేస్తారు. ఆ తర్వాత ఒకేసారి పెద్దమొత్తాలు పందేనికి పెట్టేలా ప్రేరేపించి, అలా భారీ పందెం కాసినప్పుడు మ్యాచ్‌లో ఓడిపోయేలా ప్రోగ్రామింగ్ చేస్తారు.
- బెట్టింగ్ యాప్‌లలో గేమ్ ఆడేందుకు తొలుత ఫ్రీ బోనస్ ఇస్తారు. ఆ ఫ్రీ బోనస్‌తో గేమ్ స్టార్ట్ చేస్తే లాభం వచ్చినట్లుగా చూపిస్తారు. ఈ లాభాన్ని పెంచుకోవాలనే అత్యాశతో జనం పందెం కాయడం మొదలుపెడతారు. బెట్టింగ్ యాప్‌లోకి డబ్బులను లోడ్ చేయడం మొదలుపెడతారు.
- తమ యాప్‌లో ఫలానా దానిపై పందెం కాస్తే లాభం వస్తుందని యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లతో చెప్పిస్తారు. అది నమ్మి జనం పందేలు కాసి భారీగా నష్టపోతుంటారు.
- బెట్టింగ్ యాప్స్ వల్ల భారీగా నష్టపోయి కొందరు యువత ఆత్మహత్య కూడా చేసుకున్నారు. దీనివల్ల వారి కుటుంబాలు అనుభవిస్తున్న మానసిక వేదన అంతాఇంతా కాదు.
- బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు.. తమ వేదికల్లో పందెం కాసే వారి వ్యక్తిగత వివరాలను, బ్యాంకు ఖాతా సమాచారాన్ని ఇతరులకు అమ్మేస్తుంటారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
- కొన్ని బెట్టింగ్ యాప్‌లను దారుణంగా మోసాలకు పాల్పడుతున్నాయి. గేమ్ ఆడేటప్పుడు వాలెట్‌లో డబ్బులు ఉన్నట్లుగా చూపిస్తారు. గేమ్ అయిపోయాక.. అందులో డబ్బులు కనిపించవు. అవన్నీ పోయినట్టే. ఇలాంటి యాప్స్‌ను తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు యూట్యూబర్లు ప్రమోట్ చేస్తున్నారట. ఇందుకోసం వారికి బెట్టింగ్ యాప్‌ల నిర్వాహకులు లక్షల్లో పేమెంట్ చేస్తున్నారట.
Also Read :Nagpur Violence : నాగ్‌పూర్ అల్లర్ల మాస్టర్‌మైండ్ ఫహీం.. ఎఫ్‌ఐఆర్‌లో కీలక వివరాలు
ఆన్‌లైన్ బెట్టింగ్‌ను బ్యాన్ చేయలేరా ?
మన దేశంలో ఆన్‌లైన్ బెట్టింగ్‌పై బ్యాన్ విధించే అంశానికి సంబంధించి రాష్ట్రాల వారీగా వేర్వేరు చట్టాలు ఉన్నాయి. ఇదే అంశం బెట్టింగ్ యాప్‌ల నిర్వాహకులకు కలిసొస్తోంది. గ్యాంబ్లింగ్, గేమింగ్ చట్టాలకు ‘ది పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ 1867’ పునాదిగా ఉంది. 2000 సంవత్సరంలో వచ్చిన ఐటీ చట్టం సైబర్ నేరాలకు కొంత అడ్డుకట్ట వేస్తోంది. అయితే అందులో ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. గోవా, సిక్కిం, నాగాలాండ్ రాష్ట్రాలలో ఆన్‌లైన్ గేమింగ్స్‌పై నిషేధం లేదు. దీంతో ఆ రాష్ట్రాల్లో రిజిస్టర్ చేసుకొని మరీ ఈ యాప్స్‌ను నిర్వహిస్తున్నారు. రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లోఫాంటసీ గేమ్స్‌పై నిషేధం లేదు.
తెలుగు రాష్ట్రాల్లో చట్టాల సంగతేంటి ?
2017లో వచ్చిన గేమింగ్ యాక్ట్ ప్రకారం తెలంగాణలో ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్‌పై బ్యాన్ ఉంది. 1974లో వచ్చిన ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్‌కు సవరణ చేసి ఏపీలోనూ 2020 డిసెంబరులో ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్, బెట్టింగ్ గేమ్స్‌పై బ్యాన్ విధించారు. తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లోనూ బ్యాన్ ఉంది. ఫాంటసీ గేమ్స్‌పై ఏపీ, తెలంగాణలో నిషేధం ఉంది.